నల్లగొండ, న్యూస్‌లైన్: ఈనెల 6, 11వ తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ప్రాదేశిక ఎన్నికల్లో మహిళా ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వారు ఎటు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకగా మారనుంది. పురుష, స్త్రీ ఓటర్ల నిష్పత్తిని చూస్తే ఈ విషయం అవగతమవుతోంది. ప్రాదేశిక ఎన్నికల్లో ఓటర్లు జిల్లా వ్యాప్తంగా 2 0,77, 581 మంది ఉండగా వీరిలో పురుషులు 10,45,068, మహిళలు 10,32,493 మంది ఉన్నారు. ఇతరులు 20 మంది ఉన్నారు.
అత్యధికం.. అత్యల్పం
జిల్లాలోని 59 మండలాలకుగాను మేళ్లచెర్వు మండలంలో అత్యధికంగా 54,048 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో చౌటుప్పల్(49,605), గరిడేపల్లి(38,576), నేరేడుచర్ల(48,978) మండలాలు ఉన్నాయి. అత్యల్పంగా హుజూర్‌నగర్ మండలంలో 18,513, తుర్కపల్లిలో 23,505 మంది ఉన్నారు.
18 మండలాల్లో ప్రభావితం
జిల్లాలో 18 మండలాల్లో మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. దీంతో ఆయా మండలాల్లో అన్ని రాజకీయ పార్టీలకు మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. ఈ స్థానాల్లో మహిళలకు రిజర్వ్ అయిన వాటితో పాటు జనరల్ మహిళ, జనరల్ స్థానాలు ఉన్నాయి. జనరల్ మహిళల స్థానాల్లో ప్రధాన పార్టీల నాయకుల సతీమణులు ఎంపీపీ అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. మిగిలిన స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రిజర్వు చేశారు. ఆయా పార్టీల అభ్యర్థులు మహిళా ఓటర్ల మద్దతు పొందితే తప్ప.. లేకుంటే వారి గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుస్తోంది.
జెడ్పీటీసీ స్థానాల్లో..
మేళ్లచెర్వు, మఠంపల్లి, నాంపల్లి, పీఏ పల్లి జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు, చిలుకూరు ఎస్టీ జనరల్, గరిడేపల్లి, మునగాల, నడిగూడెం, పెన్‌పహాడ్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 9 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. అయితే జనరల్ స్థానాల్లో పురుషులు పోటీ చేస్తుండటంతో ఆ మండలాల్లో మహిళా ఓటర్లు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో.. ఆ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఎంపీపీ స్థానాల్లో పోటాపోటీ
చిలుకూరు ఎంపీపీ స్థానం జనరల్‌కు రిజర్వ్ కాగా, కేతేపల్లి, మునగాల, నడిగూడెం, నాంపల్లి, వేములపల్లి స్థానాలు జనరల్ మహిళ, మేళ్లచెర్వు, పెన్‌పహాడ్ ఎస్టీ జనరల్, సూర్యాపేట, పీఏపల్లి బీసీ జనరల్‌కు కేటాయించారు. మిగిలిన 8 స్థానాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు. ఎస్టీ, బీసీ జనరల్ స్థానాలను మినహాయిస్తే మిగిలిన స్థానాల్లో మహిళా అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగానే ఉండనుంది. వీరిలో మహిళా ఓటర్లను ఆకర్షించిన వారికే గెలుపు సునాయసం కానుంది.
మహిళలే ‘కీ’లకం
Published Fri, Apr 4 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 5:32 AM
Advertisement