80.23 శాతం పోలింగ్ నమోదు
సాక్షి, కర్నూలు/అర్బన్, న్యూస్‌లైన్: తొలి విడత ప్రాదేశిక పోరు ఆదివారం ముగిసింది. ఉదయం నెమ్మదిగా ప్రారంభమైన పోలింగ్ సరళి మధ్యాహ్నానికి ఊపందుకుంది. ఓటర్లు తక్కువున్న గ్రామాల్లో ఉదయం 11 గంటలకే దాదాపు 70 శాతం పోలింగ్ నమోదైంది. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేృందుకు యువత ఉత్సాహం చూపింది. అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించడంతో పాటు సూక్ష్మ పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించారు. మొత్తంగా 36 జెడ్పీటీసీ, 496 ఎంపీటీసీ స్థానాల్లో 80.23 శాతం పోలింగ్ నమోదవడం విశేషం.
అత్యధికంగా బండిఆత్మకూరులో 88.34 శాతం, అత్యల్పంగా అవుకులో 73.03 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలిదశలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్లలో మొత్తం 12,98,190 మంది ఓటర్లు ఉండగా.. 10,41,473 మంది ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. బండిఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలోని 35వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో సీరియల్ నెం.501 నుంచి 600 వరకు బ్యాలెట్ పత్రాలు గల్లంతయ్యాయి.
ఘటనపై పోలింగ్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం పోలింగ్ ప్రక్రియను యథావిధిగా నిర్వహించారు. కోడుమూరు మండలంలోని 34వ పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధుల్లోని పోలింగ్ క్లర్క్ సుజాత హస్తం గుర్తుకు ఓటు వేయండంటూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేయడంపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫలితంగా గంట పాటు పోలింగ్ నిలిచిపోయింది.
ప్రిసైడింగ్ అధికారులు ఈ విషయాన్ని ఎన్నికల ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లడంతో ఆమెను విధుల నుంచి తప్పించారు. అదేవిధంగా 16వ నంబర్ పోలింగ్ కేంద్రంలో ఆర్‌పీఎస్ తరఫున పగిడ్యాల సర్పంచ్ చిన్న ఎర్రన్న ఏజెంట్‌గా కూర్చోవడాన్ని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. అనంతరం ఎన్నికల అధికారి అతన్ని ఏజెంట్‌గా తొలగించడంతో పోలింగ్ తిరిగి ప్రారంభమైంది. వెల్దుర్తి మండలం బుక్కాపురంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేస్తుండంగా వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న చెంచులు
ఆత్మకూరు మండలం కొట్టాలచెరువు ఎంపీటీసీ స్థానంలో ఓటర్లుగా ఉన్న పెచ్చెర్వు చెంచుగూడెంకు చెందిన 130 మంది చెంచులు మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెచ్చె ర్వు నుంచి కొట్టాల చెరువు పోలింగ్ కేంద్రానికి దాదాపు 50 కిలోమీటర్లు దూరం కావడంతో.. ప్రభుత్వమే వీరిని రెండు లారీల్లో తరలించింది.