‘ఫలితం’.. కలవరం!
సర్వేల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా
- పోటీనివ్వలేకపోయిన కాంగ్రెస్
- టీడీపీని వెన్నాడుతున్న ఓటమి భయం
- దివాలా దిశగా పలువురు అభ్యర్థులు
కర్నూలు, న్యూస్‌లైన్: నలుగురు గుమికూడితే వారి మధ్య ఎన్నికల ఫలితాలపైనే చర్చ. శుభ కార్యాలు.. హోటళ్లు.. ప్రభుత్వ కార్యాలయాలు.. ప్రాంతం ఏదైనా పార్టీల బలాబలాలు, అభ్యర్థుల గెలుపోటముల గురించిన ఉత్కంఠే. సామాజిక వెబ్‌సైట్లలో ఫలితాల ఊహాగానాలు.. ఆ పార్టీకి ఇన్ని సీట్లు.. ఈ పార్టీకి అంత మెజార్టీ అంటూ సెల్‌పోన్లలో మెసేజ్‌లు.. ఒకదానికొకటి పొంతనలేని అంకెలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి చర్చలతో అభ్యర్థుల బీపీ ఒక్కసారిగా పెరిగిపోతోంది. కొందరు కాకిలెక్కలని కొట్టిపారేస్తుండగా.. మరికొందరు తమ సత్తా ఇదంటూ ఇతరులకు ఆ సమాచారాన్ని చేరవేస్తున్నారు.
మొత్తం మీద జిల్లాను ఎన్నికల ఫీవర్ కుదిపేస్తోంది. మున్సిపల్.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ.. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసినా రాజకీయంగా ఇప్పటికీ ఆ వేడి చల్లారని పరిస్థితి. ఫలితాలు ఎలా ఉంటాయోననే ఆందోళన అభ్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఓటరు నాడి అంతుచిక్కకపోవడంతో వారి ఆందోళన వర్ణనాతీతం. అభ్యర్థుల విషయం ఇలాఉంటే.. రాజకీయాలపై ఆసక్తి కలిగిన వారిలోనే ఇలాంటి ఉత్కంఠే కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాలు మొదలు.. పట్టణాల వరకు అన్నిచోట్లా ఇదే వాతావరణం కనిపిస్తోంది. జిల్లాలోని రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాలకు ఈనెల 7న పోలింగ్ పూర్తవడం తెలిసిందే.
మరుసటి రోజు నుంచే అభ్యర్థులంతా కూడికలు, తీసివేతలతో ఓ అంచనాకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? అతనికి కలిసొచ్చే అంశాలు ఏమిటి? ఎక్కడ వెనుకబడ్డారు? డబ్బు ప్రభావితం చేస్తుందా? కుల సమీకరణాలు కలిసొస్తాయా? ఇలాంటి ప్రశ్నలు అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదిలాఉండగా ప్రభుత్వానికి ఓటరు నాడి అందించేందుకు పోలీసు శాఖలోని నిఘా విభాగం కూడా రంగంలోకి దిగింది.
వీరు గ్రామాల్లో కలివిడిగా తిరుగుతూ సమాచార సేకరణలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఓ నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. మొదటి నివేదికలో వైఎస్సార్‌సీపీకే జిల్లాలో అధిక స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని తేలడంతో.. రెండో నివేదికలోని సారాంశాన్ని తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.