తెలుగు తమ్ముళ్లు పుర సమరంలో డీలా పడ్డారు
సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌సీపీ గ్రాఫ్ పడిపోతోంది.. తెలుగుదేశం పార్టీ పుంజుకుంటోంది...అంటూ ఇంతకాలం ఊదరగొడుతూ వచ్చిన తెలుగు తమ్ముళ్లు పుర సమరంలో డీలా పడ్డారు. పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ నేతల్లో తత్తరపాటు కన్పిస్తోంది. కడప కార్పొరేషన్‌తోబాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తే ఒక చోట కూడా కచ్చితంగా గెలుస్తామనే ధీమా వారిలో కన్పించడం లేదు.
ఎన్నికలు ఏవైనా సరే జిల్లాలో ప్రజాతీర్పు ఏకపక్షమేనని స్పష్టమవుతోంది. వైఎస్ కుటుంబం వెన్నంటే ప్రజానీకమని రుజువు చేస్తున్నారు. అదే పరంపరను మున్సిపల్ ఎన్నికల్లో కూడా పట్టణ ప్రజలు చూపించారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ నేతల అనైక్యత, నేల విడిచి సాము చేస్తుండటం వైఎస్సార్‌సీపీకి కలిసివచ్చే అంశంగా అభిప్రాయపడుతున్నారు.
టీడీపీ నేతల ఒంటెత్తు పోకడలు కూడా పార్టీ కేడర్‌కు ఇబ్బందికర పరిణామంగా తయారైందని పలువురు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఒకచోట కూడా కచ్చితంగా విజయం సాధిస్తామనే ధీమాను టీడీపీ నేతలు వ్యక్తం చేయలేకపోతున్నారు. దీని కారణం ప్రజామద్దతు పొందడంలో అనైతిక పద్ధతులను అవలంభించడమేనని పలువురు పేర్కొంటున్నారు. మైదుకూరు మున్సిపాలిటీలో టీడీపీ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ రంగసింహ విషయంలో తెలుగుతమ్ముళ్లు ఆశలు పెంచుకున్నారు. అలాగే భారీగా డబ్బు పంపిణీ చేయడంతో బద్వేలుపై కూడా నమ్మకాన్ని వ్యక్తం చేసేవారు. అయితే భారీగా పోలింగ్ జరగటంతో ఆ రెండు చోట్ల గెలిచేంతవరకూ నమ్మకం లేదనే అభిప్రాయాన్ని తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు.
పరువు నిలుపుకునే ఫలితాలు వస్తాయా..!
మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి ఎటూ తప్పదని తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు కనీసం పరువు నిలుపుకునేలా ఫలితాలు లభిస్తాయా.. లేదా.,. అన్న మీమాంసలో ఉన్నట్లు తెలుస్తోంది. కడప కార్పొరేషన్ పరిధిలో మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, పుత్తా నరసింహారెడ్డి, కందుల రాజమోహన్‌రెడ్డి, గోవర్థన్‌రెడ్డి, సుభాన్‌బాష, అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్, మాజీ మంత్రి ఖలీల్‌భాష ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశం నేతలంతా అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డారు. అయితే ప్రజల్లో విశ్వాసం నింపేలా ఆయా నేతల చర్యలు కన్పించలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎవరికి వారు తామే బలవంతులం అనే రీతిలో వ్యవహరించి వచ్చే సీట్లు కూడా చేజార్చుకుంటున్నారని పరిశీలకుల అభిప్రాయం.
ముందే అత్తెసరు ప్రజా మద్దతున్న తెలుగుదేశం పార్టీకి నేతల ఒంటెత్తు పోకడలు మరింత దెబ్బతీశాయని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లలో ఎక్కువ స్థానాల్లో గెలుపు దేవుడెరుగు... కనీస మర్యాద నిలుపుకునేందుకు సరిపడ డివిజన్లు దక్కుతాయో లేదోనని లోలోపల మదనపడుతున్నారు. విశ్లేషకులు మాత్రం టీడీపీ సింగల్ డిజిట్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుందని పేర్కొంటున్న నేపధ్యంలో పరువు గంగలో కలవనుందనే బెంగ నేతల్లో అధికమైనట్లు సమాచారం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిస్థితి కూడా అలాగే ఉందని తెలుగుతమ్ముళ్లు మదన పడుతున్నారు.
ఇరువురు బలవంతులని భావిస్తే.. వీరి కలయిక కారణంగానే ఓటమి చెందుతున్నామనే అంచనాకు టీడీపీ నేతలు వచ్చినట్లు సమాచారం. అత్యధిక స్థానాలు వైఎస్సార్‌సీపీ వశం కానున్నాయనే భావనలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. నేతలంతా కూడికలు తీసివేతల్లో సోమవారం బిజీగా గ డిపారు. మరికొందరు పంచాంగంలోనైనా అనుకూలత ఉందేమోనని వాకబు చేసినట్లు తెలుస్తోంది.
చైర్మన్ అభ్యర్థులకు పంచాంగంలో అనుకూలత లేదని గ్ర హించిన మరికొంత మంది తెలుగుతమ్ముళ్లు ఓటమి తప్పదనే భావనకు వచ్చినట్లు సమాచారం. పురపోరులో ఎలాగైనా పట్టు నిలుపుకోవాలన్న టీడీపీ నేతల అంచనాలను ప్రజానీకం తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు, కడప, యర్రగుంట్ల, ప్రొద్దుటూరు పరిధిలో చైర్మన్ పీఠం ఎంత మాత్రం దక్కదనే ధీమాకు వచ్చినట్లు సమాచారం. మైదుకూరు, బద్వేలులో ఎత్తుగడలు ఫలిస్తాయోమోననే దింపుడు కల్లం ఆశల్లో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.