బద్వేలు నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య పవర్ పాలిటిక్స్ నడుస్తోంది. పనుల పంచాయితీ ఎక్కువైంది. ‘నేను తెలుగుదేశం పార్టీలో లేనా? ఆ పార్టీ ఎమ్మెల్యేను కాదా..’ అంటూ బద్వేలు శాసనసభ్యుడు జయరాములు ఇటీవల విలేకరుల సమావేశంలో తీవ్ర ఆవేదన వెల్లగక్కడం ఇందుకు బలం చేకూరుస్తోంది.
సాక్షి ప్రతినిధి, కడప : ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన బద్వేలు నుంచి గత శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గుర్తుపై జయరాములు పోటీ చేసి టీడీపీ అభ్యర్థి విజయజ్యోతిపై గెలుపొందారు. ఆ తర్వాత 2016 ఫిబ్రవరి 23న నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ టీడీపీ తీర్థం పుచ్చుకున్న సంగతి విదితమే. అయితే తొలుత జయరాములుకు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సంపూర్ణ మద్దతు పలికారు. కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య ఎడం పెరిగింది. అది ఇప్పుడు వర్గపోరుకు దారితీసింది. నియోజకవర్గంపై పట్టు నీదా? నాదా? అనే స్థాయికి చేరడంతో బద్వేలు రాజకీయం రసకందాయంలో పడింది.
పట్టు నిలుపుకొనేందుకు..
దివంగత మంత్రి వీరారెడ్డి కుమార్తె అయిన విజయమ్మ తండ్రి చనిపోవడంతో రాజకీయాల్లో వచ్చారు. అప్పటినుంచి నియోజకవర్గంలో తన హవా కొనసాగిస్తున్నారు. అనంతర కాలంలో ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో ఆమె బలపరిచిన అభ్యర్థికే పార్టీ టిక్కెట్ దక్కుతూ వచ్చింది. గత ఎన్నికల్లో ఆమె బలపరిచిన విజయజ్యోతికి టీడీపీ టిక్కెట్ ఇచ్చింది. వైఎస్సార్‌సీపీ తరఫున జయరాములు బరిలో నిలిచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, తనపట్టు పెంచుకోవడంలో భాగంగా విజయజ్యోతి వర్గంతో సత్సంబంధాలు నెరపడంతో అది విజయమ్మకు కోపం తెప్పించింది. తన నియోజకవర్గంలో ఇతరుల పెత్తనాన్ని సహించలేని మాజీ ఎమ్మెల్యే మంత్రులు ఆది, సోమిరెడ్డిల అండతో ఎమ్మెల్యే జయరాములు స్పీడ్‌కు బ్రేక్‌లు వేశారు. మొదటి నుంచి ఓ వర్గానికి అండగా ఉంటున్న మాజీ ఎమ్మెల్యే, తర్వాత నియోజకవర్గ అభివృద్ధి పనులన్నీ ఆ వర్గానికి చెందిన వారికే దక్కేలా పావులు కదిపి విజయం సాధించారు.
విజిలెన్స్‌కు లేఖ రాయడంతో..
బద్వేలులో జరుగుతున్న నీరు–చెట్టు పనుల్లో అవకతవకలు జరిగాయని, అందులో అక్రమాలు వెలికితీయాలని కోరుతూ స్వయానా ఎమ్మెల్యే జయరాములు విజిలెన్స్ అధికారులకు లేఖ రాయడంతో ఇద్దరి మధ్య విబేధాలు బాగా ముదిరాయి. నీరు–చెట్టు పనుల్లో దాదాపు రూ.80 కోట్ల వరకు పనులను విజయమ్మ వర్గీయులు చేశారు. జ యరాములు వర్గీయులకు తక్కువగా పనులు దక్కాయి. పైగా జయరాములు వర్గీయులను ఆమె తనవైపు తిప్పుకోవడం, జిల్లా మంత్రి ఆమెకు అండగా నిలవడం.. అభివృద్ధి పనుల్లో అడ్డుతగులుతుండడం..నిధుల విషయంలో తనను టార్గెట్ చేయడంపై ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు.
తాను దళిత ఎమ్మెల్యేను కావడం వల్లే అధికారపార్టీలో తనపై వివక్ష చూపుతున్నారని ఆయన తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు వ్యక్తం చేసినట్లు తె లిసింది. ఇదే విషయాన్ని ఆయన స్వయంగా విలేకరుల సమావేశం పెట్టి మరీ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు వద్దే తాడోపేడో తెల్చుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
నియోజకవర్గ ఇన్‌చార్జి ఎవరు?
ఎస్సీ రిజర్వుడు స్థానమే అయినా, నియోజకవర్గంలో బలమైన ఓ సామాజికవర్గం ఇక్కడ పెత్తనం చెలాయిస్తుంది. దీంతో ఎవరికి నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించాలన్న విషయంపై టీడీపీ అచితూచి వ్యవహరిస్తోంది. ఎవరికి ఇస్తే ఎవరికి కోపం వస్తుందోనని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. తనకు బలమైన వర్గం మద్దతు ఉంది కాబట్టి తానే నియోజకవర్గ ఇన్‌చార్జి అంటూ ఓవైపు విజయమ్మ అంటుండగా, లేదు, నేను పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను కాబట్టి రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో ఉన్నట్లుగానే తానే ఇన్‌చార్జి అంటూ మరోవైపు విజయజ్యోతి స్పష్టం చేస్తోంది.ఇప్పుడు వీరిరువురుని కాదని, ఎమ్మెల్యేను కాబట్టి తనకే నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారంటూ జయరాములు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. ఇలా వర్గపోరుతో ఆ పార్టీ మూడు ముక్కలైనా.. అధిష్టానం మాత్రం ఇన్‌చార్జి విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. నేతల మధ్య పోరుతో పార్టీ శ్రేణులు నిస్తేజంలో పడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment