బారులు దీరిన ఓటర్లు
సాక్షి, కర్నూలు/సిటీ, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాలుగు పురపాలక సంఘాలు, మరో నాలుగు నగర పంచాయతీలో ఉదయం నుంచే ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఎండ ప్రభావంతో పోలింగ్ మందకొడిగా సాగింది. అయితే సాయంత్రానికి వేగం పుంజుకొని జిల్లా వ్యాప్తంగా 71.09 శాతం ఓటింగ్ నమోదైంది. మొత్తం 219 వార్డులకు ఎన్నికలు జరగగా.. మహిళలు, యువత అత్యధికంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు.
మొరాయించిన ఈవీఎంలు..
ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఒక గంట ఆలస్యమైంది. ఉదయం 10 గంటల వరకు 25 శాతానికి మించి పోలింగ్ నమోదు కాలేదు. క్రమంగా పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉదయం నుంచి విపరీతంగా ఎండవేడిమి ఉన్నా ప్రజలు మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మధ్యాహ్నం 12 గంటలకు రికార్డుస్థాయిలో గూడూరు నగర పంచాయతీలో 61.20 శాతం పోలింగ్ నమోదు అయింది. మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల మధ్య ఓటర్లు భారీగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 60 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైంది.
ఊపిరిపీల్చుకున్న జిల్లా యంత్రాంగం..
పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. గత వారం రోజులుగా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి మునిసిపల్ ఎన్నికలపై ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సజావుగా నిర్వహించేందుకు కృషి చేశారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలకు అవకాశం లేకుండా పోలీసు యంత్రాంగం కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అందుబాటులో ఉన్న సిబ్బందితో పాటు పారమిలటరీ బలగాలను రంగంలోకి దింపింది.