అనంతపురం కార్పొరేషన్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల పోలింగ్ ఆదివారం జరగనుంది. అనంతపురం కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 11 పురపాలక సంఘాలలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేస్తారు. కేంద్రానికి 100 మీటర్ల మేర ఆంక్షలు అమలులో ఉంటాయి. ఆ మార్గంలో వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. ఓటర్లు మినహా ఇతరులు ఎవరూ కేంద్రాల వైపు రాకూడదు.
కేంద్రాల పరిసరాలలో గుంపులుగా సంచరించడం కానీ, నిలబడటం కానీ నిషిద్ధం. కేంద్రాల వద్ద ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ మాత్రమే ఉండాలి. కేంద్రాల వద్ద అభ్యర్థులు లేదా వారి ఎన్నికల ఏజెంట్ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కూడా ప్రచారం నిర్వహించకూడదు. కేంద్రం పరిసరాల్లో పార్టీల జెండాలు, ఎన్నికల గుర్తులు ప్రదర్శించకూడదు. ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు లేదా వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను రెచ్చగొట్టడం, కించపర్చడం వంటి చర్యలకు పాల్పడకూడదు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఎలాంటి చర్యలకు దిగకూడదు. ఎవరైనా ఆ విధంగా వ్యవహరిస్తే నియమావళి ఉల్లంఘించినట్లుగా కేసు నమోదు చేస్తారు.