సాక్షి, ఏలూరు : జిల్లాలో నగర, పురపాలక సంఘాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగినా పాలకవర్గాలు ఎప్పుడు కొలువు తీరతాయనే దానిపై స్పష్టత కొరవడింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గెలిచిన అభ్యర్థులు పదవులు చేపట్టకుండా స్తబ్దుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. స్థానిక సంస్థలు దాదాపు మూడేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు విడుదల కాలేదు. పాలన గాడిన పడే రోజు కోసం ప్రజలు, పదవి చేపట్టే సమయం కోసం గెలిచిన అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు.
రెండు నెలల నిరీక్షణ
2010 సెప్టెంబర్‌తో పాలకవర్గం గడువు ముగిసిన ఏలూరు నగరపాలక సంస్థ, నిడదవోలు, కొవ్వూరు, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం పురపాలక సంఘాలు, కొత్తగా ఏర్పడిన జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 4 స్థానాల్లో ఎన్నిక ఏకగ్రీవం కాగా, 287 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. నిజానికి ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. అదేనెల 7న మేయర్, డెప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. అయితే, కోర్టు ఆదేశాల మేరకు ఓట్ల లెక్కిం పు వాయిదా పడింది. ఈ నెల 12న పురపాలక ఫలితాలు ప్రకటించారు.
ఇందుకోసం 43 రోజులు ఎదురుచూసిన అభ్యర్థులు గెలిచిన తర్వాత కూడా పదవి చేపట్టడానికి నిరీక్షించక తప్ప డం లేదు. మునిసిపల్ కౌన్సిల్‌లో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉంటా రు. కొన్ని సందర్భాల్లో వీరి ఓటు అత్యంత కీలకం అవుతుంటుంది. అయితే గత శాసనసభ రద్దు కావడంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలైతే తప్ప పాలకవర్గం ఏర్పాటుకు మార్గం ఏర్పడలేదు. ఈనెల 7న సార్వత్రిక ఫలితాలు వచ్చాక కూడా పురపాలక సంఘాల పాలకమండళ్ల ఏర్పాటుపై చలనం లేదు. ఎంపీల పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తోంది. జూన్ రెండు తర్వాత కొత్త ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవీ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఏర్పాటవుతాయి. పాలకవర్గాలు ఉంటే తప్ప నిధులు విడుదలచేయడం కుదరదని కేంద్ర ప్రభుత్వం గతంలో చెప్పడంతో మునిసిపాలిటీలకు రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. అవి రావాలంటే మరికొంత సమయం వేచి చూడక తప్పదు.
పదవులొచ్చినా పగ్గాలేవి!
Published Sat, May 24 2014 12:58 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement