యువతికి గుర్తింపు కార్డు, ఓటర్లకు స్లిప్పులు అందిస్తున్న బీఎల్‌వోలు
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రెండు దఫాలుగా ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేయగా.. ఈవీఎంలలో బ్యాలెట్ పత్రాల కమిషనింగ్ సైతం కొలిక్కి వచ్చింది. జిల్లావ్యాప్తంగా 505 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు 2,910 మంది సిబ్బందిని సిద్ధంచేశారు. జిల్లాలో 4,10,999 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా దివ్యాంగుల కోసం సిరిసిల్ల బాలికల హైస్కూల్, వేములవాడ మండలం కోనాయిపల్లి పాఠశాలలో దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. మహిళల కోసం మొత్తం మహిళా పోలింగ్ సిబ్బందితో సిరిసిల్ల గీతానగర్ స్కూల్, వేములవాడ సాంస్కృతిక డిగ్రీ కళాశాలలో ప్రత్యేక మహిళా కేంద్రాలు ఏర్పాటుచేయనున్నారు.
పోలింగ్ సిబ్బంది నియామకం..
సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణ కోసం 2,910 మంది సిబ్బందిని నియమించారు. వేములవాడ నియోజకవర్గంలో 235 పోలింగ్ కేంద్రాలు ఉండగా 15శాతం అదనపు సిబ్బందితో కలిపి
271 మంది పోలింగ్ అధికారులను, మరో 271 మంది ఏపీవోలను, 542 మంది అదనపు పోలింగ్ సిబ్బందిని నియమించారు. మరో 271 మందిని ఎన్నికల నిర్వహణకు ఎంపికచేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో 270 పోలింగ్ కేంద్రాలు ఉండగా 311 మంది పోలింగ్ అధికారులు, మరో 311 మంది ఏపీవోలు, 622 మంది ఓపీవోలను, 311 మంది అదనపు సిబ్బందిని నియమించారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ వెంకట్రామరెడ్డి పూర్తిచేశారు.
ఫొటో పోల్ చిట్టీల పంపిణీ
జిల్లా వ్యాప్తంగా ఓటర్లకు ఫొటో పోల్ చిట్టీలను బూత్ లెవల్ అధికారుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. శుక్రవారం ఒక్కరోజే 62వేల మందికి ఈ చిట్టీలను పంపిణీ చేశారు. వీటితోపాటు కొత్తగా ఓటర్లుగా నమోదైన యువకులకు ఓటరు గుర్తింపుకార్డులను జారీచేస్తున్నారు. మూడురోజల కిందటే జిల్లాకు కొత్త ఓటరు గుర్తింపుకార్డులు వచ్చాయి. వీటిని జిల్లావ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. జిల్లాలో ఎన్నారై ఓటర్లు ఇద్దరు ఉండగా సర్వీసు ఓటర్లు 93 మంది ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన పనులు చురుకుగా సాగుతున్నాయి.
వెబ్ కెమెరాలకు ఏర్పాట్లు
జిల్లావ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ కోసం వెబ్‌కెమెరాలను ఏర్పాటుచేస్తున్నారు. ఇప్పటికే లాప్‌ట్యాప్‌లు ఉన్న ఇంజినీరింగ్ విద్యార్థులను ఎంపిక చేసి వెబ్‌కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చారు. హై ఫ్రీక్వెన్సీ ఉన్న కెమెరాలను కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 69 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వి«ధిగా కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment