నిజామాబాద్‌లో.. పోలింగ్‌ ప్రతిష్టాత్మకం | Prestigious Polling In Nizamabad | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌లో.. పోలింగ్‌ ప్రతిష్టాత్మకం

Published Thu, Apr 4 2019 12:29 PM | Last Updated on Thu, Apr 4 2019 12:29 PM

Prestigious Polling In Nizamabad - Sakshi

ఈవీఎంలను పరిశీలిస్తున్న ఇంజినీర్లు

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి అసాధారణ పరిస్థితులు నెలకొనడంతో పోలింగ్‌ నిర్వహణ కోసం ఎన్నికల సంఘం యుద్ధప్రాతిపదికన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈవీఎంల చరిత్రలోనే తొలిసారిగా 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానం పోలింగ్‌ నిర్వహణ ఎన్నికల సంఘానికి సవాల్‌గా మారింది. దీంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టింది. పోలింగ్‌కు కేవలం వారం రోజులే గడువుండటంతో ఏర్పాట్లను వేగవంతం చేసింది. ఈ స్థానం పోలింగ్‌ ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఆరా తీస్తోంది.

అనేక ఊహాగానాలు, ఉత్కంఠకు తెరదించుతూ నిజామాబాద్‌ స్థానానికి ఈవీఎంల ద్వారానే షెడ్యూల్‌ ప్రకారమే పోలింగ్‌ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన నేప థ్యంలో పోలింగ్‌ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ధునాతన ఎం–3 రకం ఈవీఎంలను జిల్లాకు తెప్పించింది. వీటి పనితీరును పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లు ఈసీఐఎల్, బెల్‌ కంపెనీలకు చెందిన ఇంజినీర్లు జిల్లా కు చేరుకున్నారు. సుమారు 600 మంది పైగా ఇంజినీర్లు వీటి పరిశీలన కోసం నగరానికి వచ్చారు. కొందరు ఇంజనీర్లను జగిత్యాల జిల్లాకు పంపినట్లు తెలుస్తోంది. వీరికి నగరంలోని వివిధ ప్రాంతాల్లో వసతి సౌకర్యం కల్పించారు. ప్రైవేటు హోటళ్లు, లాడ్జీలు, హాస్టళ్లను కేటాయించారు.
ప్రారంభమైన ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌.. 
నియోజకవర్గం పరిధిలో మొత్తం 1,788 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి ఒక్కో కంట్రోల్‌ యూనిట్, వీవీపీఏటీలతో పాటు 12 బ్యాలె ట్‌ యూనిట్లను అమర్చి పోలింగ్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈవీఎంలు ప్రత్యేక కంటెనర్లలో  బుధవారం జిల్లాకు వచ్చాయి. నగర శివారులోని విజయలక్ష్మి గార్డెన్‌లో అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షం లో ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ (ఎఫ్‌ఎల్‌సీ) ప్రక్రియ చేపట్టారు. ర్యాండమ్‌ చెకింగ్‌ వంటి ప్రక్రి యలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈవీఎంలలో బ్యాలె ట్‌ పేపర్‌ అమర్చడం వంటివి చేయాల్సి ఉంటుంది. వారం రోజులే గడువుండటంతో మూడు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.

 జిల్లాకు కేంద్ర ఎన్నికల ఉన్నతాధికారులు.. 
నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానం ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌ సుదీప్‌జైన్‌ బుధవారం జిల్లాకు చేరుకున్నారు. హెలిక్యాప్టర్‌ ద్వారా నిజామాబాద్‌కు వచ్చిన ఆయన ఏర్పాట్లను దగ్గరుండి సమీక్షిస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈఓ బుద్ద ప్రకాష్, ఈసీఐ కన్సల్టెంట్‌ నిఖిల్‌కుమార్‌ లు  కూడా జిల్లాకు చేరుకున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం ప్రత్యేక అధికారిగా నియమితులైన రాష్ట్ర  వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా కూడా జిల్లాకు వచ్చారు.

సాంకేతిక నిపుణుల సేవల వినియోగం.. 
ఈ ఎన్నికల్లో  ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఒక కంట్రోల్‌ యూనిట్, ఒక వీవీ ప్యాట్, 12 బ్యాలెట్‌ యూనిట్స్‌ ఉపయోగిస్తామన్నామని సుదీప్‌జైన్‌ పేర్కొన్నారు. సాంకేతిక కారణాల వల్ల సమస్య వస్తే దానినే మార్చడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అంటే 12 బీయుఎస్‌లో ఒక బ్యాలెట్‌ యూనిట్‌ సమస్య వస్తే దాని స్థానంలో అక్కడే మరో బ్యాలెట్‌ యూనిట్‌ అమర్చాలని, దీనికి అవసరమైన సాంకేతికత చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంతో మంది నిష్ణాతులు, అనుభవజ్ఞులైన  సాంకేతిక నిపుణు లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నందున వారి సేవలను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందన్నారు. అధికారులు అత్యంత  నమ్మకంగా విధులు నిర్వర్తించాలన్నారు. 

ప్రపంచంలోనే మొదటిసారి :
నిజామాబాద్‌ లోక్‌సభ నియోజక వర్గం ఎన్నిక ఒక చరిత్రకు నాంది కానున్నదని  కేంద్ర డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ సుదీప్‌జైన్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల సం ఘం ఉన్నతాధికారులతో కలిసి కలెక్టరేట్‌లో ఎన్‌ఎల్‌ఎమ్‌టీ నిష్ణాతులతో సమావేశమయ్యారు. సుదీప్‌జైన్‌ మాట్లాడుతూ దేశంలో ఇప్పటివరకు ఎం–2 ఈవీఎంఎస్‌ ద్వా రా, నాలుగు బ్యాలెట్‌ యూనిట్లతో మాత్రమే ఎన్నికలు నిర్వహించామన్నారు.ఇక్కడ 185 మంది బరిలో ఉండటంతో ఎం–3 ఈవీఎంలతో 12 బ్యాలెట్‌ యూనిట్లను ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచంలో ఇంత వరకు ఎం–3 ద్వారా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. ఒక చరిత్రకు నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గం వేదిక అవుతుందని చెప్పారు.

వందల సంఖ్యలో సాంకేతిక నిపుణులు : ఈసీ కన్సల్టెంట్‌ నిఖిల్‌కుమార్‌ 
ఎన్నికల్లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా సరైన పద్ధతులలో నిబంధనల ప్రకారం పోలింగ్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల సంఘం కన్సల్టెంట్‌ నిఖిల్‌ కుమార్‌ పేర్కొన్నారు. వందల సంఖ్యలో ఈసీఐఎల్, బెల్‌ నిపుణు లు ఈ ఎన్నికల్లో విధులు నిర్వహిస్తూ సాంకేతిక సహకారం అందించనున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ఎం రామ్మోహన్‌ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం పోలింగ్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

ఇందుకు అధికారులను సన్నద్ధం చేశామని, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు సీఈవో బుద్ద ప్రకాష్, ఎన్నికల సాధారణ పరిశీలకులు గౌరవ్‌ దాలియా, ప్రత్యేక అధికారి రాష్ట్ర  వ్యవసాయ శాఖ కమిషనర్‌ రాహుల్‌ బొజ్జా, సీపీ కార్తికేయ, సంయుక్త కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, జిల్లా రెవెన్యూ అధికారి అంజయ్య, బెల్, ఈసీఐఎల్‌ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement