నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోలింగ్ నిర్వహణపై స్పష్టత వచ్చింది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. నిర్ణీత తేదీనే ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినట్లు అధికార వర్గాల తెలిసింది.
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ ఎంపీ స్థానంలో భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో ఉన్న విషయం తెలిసిందే. పసుపు, ఎర్రజొన్న రైతులు నామినేషన్లు దాఖలు చేయడంతో అభ్యర్థుల సంఖ్య 185కి చేరింది. దీంతో సాధారణ ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహణ సాధ్యపడడం లేదు. బ్యాలెట్ ద్వారా పోలింగ్ జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మొదట్లో భావించింది. దీనికంటే అధునాతన ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపడం ఉత్తమం అని భావించిన ఎన్నికల సంఘం.. ఈ మేరకు ఆదివారం స్పష్టతనిచ్చింది.
11 న పోలింగ్!
పార్లమెంట్ ఎన్నికల బరిలో 185 మంది ఉండడంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎం–3 ఈవీఎంలను వినియోగించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎం–3 ఈవీఎంల కోసం
అధికారులు అన్వేషించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎం–3 ఈవీఎంలను తెప్పించాలనుకున్నారు. నియోజకవర్గంలో మొత్తం 1,788 పోలింగ్ బూత్‌లకు సరిపడా ఈవీఎంలను మళ్లీ సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు 26,820 బ్యాలెట్ యూనిట్లు, 2,240 కంట్రోల్ యూనిట్లు, 2600 వీవీ ప్యాట్‌లు అందించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఈసీఐఎల్‌ను ఆదేశించింది. అవి జిల్లాకు చేరగానే వాటిని ఫస్ట్ లెవల్ చెకప్, ర్యాండమ్ చెకింగ్ వంటి ప్రక్రియలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఇంజినీర్లతోపాటు అదనపు ఇంజినీర్లు అవసరం. ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కొంత సమయం పట్టే అవకాశాలున్నాయి. అయినా నిర్ణీత తేదీనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈవీఎంల అవగాహన కేంద్రం ఎత్తివేత..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఓటర్లలో అవగాహన కలిగించేందుకు కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈవీఎం అవగాహన కేంద్రాన్ని ఎత్తేశారు. బ్యాలెట్ యూనిట్, వీవీపీఏటీ, కంట్రోల్ యూనిట్ వంటి వాటిపై కలెక్టరేట్‌కు వచ్చే వారికి అవగాహన కల్పించేందుకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన సందర్భంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ యంత్ర పరికరాలను తీసేశామని, ఈసీ ఆదేశాలిచ్చాక మళ్లీ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా పోలింగ్ నిర్వహణపై ఆ విధులు నిర్వర్తించనున్న అధికారులు, సిబ్బందికి తొలి విడత శిక్షణ ఇప్పటికే పూర్తి చేసిన అధికారయంత్రాంగం.. రెండో విడత శిక్షణపై సందిగ్ధత నెలకొంది. పోలింగ్ తేదీకి కొద్ది రోజుల ముందు సిబ్బందికి ప్రత్యేకంగా రెండోసారి శిక్షణ తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. శిక్షణ తరగతులపై జిల్లా అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment