కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక, మున్సిపల్, స్థానిక ఎన్నికలు ప్రశాంతం గా జరగడానికి జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఇందుకోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సహాయం తీసుకోనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం వెబ్ కెమెరాలను, మోబైల్ వాహనాలను ఉపయోగించనున్నారు.
2,256 పోలింగ్ కేంద్రాలు
జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో 2,256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 226, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, ఆసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 ఉన్నాయి. వీటిలో 650 అత్యంత సమస్యాత్మక, 820 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటిని పూర్తిస్థాయిలో నిర్ధారించడానికి కసరత్తు జరుగుతోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ నెట్, ఫోన్ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంకా 2,500 మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉపయోగించుకోకున్నారు. వీరికి వెబ్ కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చి మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల వరకు రొటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి.
ఫొటో, వీడియోగ్రాఫర్ల చిత్రీకరణ
జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 4,512 మంది ఫొటో, వీడియోగ్రాఫర్ల వివరాలు సేకరించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ఫొటో, ఒక వీడియోగ్రాఫర్‌ను నియమించనున్నారు. ఇందుకు 2,256 మంది ఫొటోగ్రాఫర్లు, 2,256 మంది వీడియోగ్రాఫర్లు పనిచేయనున్నారు. అధికారులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, మండలాల, డివిజన్‌వారీగా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో నిర్వహిస్తున్నారు. ఇంకా 10 నుంచి 15 గ్రామాలకు ఒక రూట్‌లో మోబైల్ వాహానాలు సంచరించే అవకాశాలున్నాయి. కాగా, వెబ్ కెమెరాలను పోలింగ్ కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషనర్ కార్యాలయం, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. దీంతో పోలింగ్ విధానాన్ని అటు ఈసీ అధికారులు, ఇటు కలెక్టరేట్ అధికారులు ఏక కాలంలో చూసుకోవడానికి వీలుంటుంది. ఫలితంగా ఏమైన సంఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
విధులు.. భత్యం..
ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ విద్యార్థికి రూ.500 ఇవ్వనున్నారు. పోలింగ్ ముందురోజే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఒక రాత్రి, ఒక పగలు విద్యార్థులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. నెట్ సౌకర్యం, వెబ్‌కాస్టింగ్‌లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెళ్లాల్సిన పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందు రోజే చెబుతారు. రెవెన్యూ డివిజన్లవారీగా నియమించి పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు
Published Fri, Mar 14 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM
Advertisement
Advertisement