త్వరలోనే స్థానిక ఎన్నికలంటూపీఏసీ భేటీలో సీఎం రేవంత్ స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. త్వరలోనే ఎన్నికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పీఏసీ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి తాజాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది.
వాస్తవానికి సంక్రాంతి పండుగ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, 15, 20 రోజుల్లోనే మొదట జీపీ, ఆ తర్వాత మండల ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహాగానాలు గతంలోనే వచ్చాయి. తాజాగా ఈ నెలాఖరులోగా రైతు భరోసా, ఇందిరమ్మ రైతు కూలీ భరోసా చెల్లింపు మొదలుపెట్టాక, ఎన్నికల షెడ్యూల్ ఇస్తే మంచిదనే సూచనలు అధికారపార్టీకి అందినట్టు తెలుస్తోంది.
ఫిబ్రవరి మొదటివారంలోగా నోటిఫికేషన్ ఇచ్చి రెండువారాల్లో ఒక ఎన్నిక, మరో వారం, పదిరోజుల గడువు ఇచ్చి మరో ఎన్నిక పూర్తి చేస్తే అన్నివిధాలా బావుంటుందనే అభిప్రాయం అధికారవర్గాల్లో వినిపిస్తోంది. మార్చి నెలలో ఇంటర్, టెన్త్ పరీక్షలు ఉన్నందున అంతకు ముందే ఎన్నికలు జరిపితే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలోనే మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున, పనిలో పనిగా స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచిదని భావిస్తున్నారు.
ముందుగా పంచాయతీల ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ నిధుల వ్యయం పూర్తిచేయాల్సి ఉన్నందున, వేసవి ముగిశాక లేదా మేలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై....
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచి్చన హామీ మేరకు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంపుదలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే పూర్తయ్యింది. దీనికి సంబంధించిన నివేదికను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆయా అంశాలపై పరిశీలన చేపట్టిన డెడికేటెడ్ కమిషన్ బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపై ఇంకా నివేదికను సమర్పించలేదు.
దీనిని పరిశీలించాక ఎంతశాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీకి పంపించనుంది. ఈ ఉత్తర్వులు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment