the municipal elections
-
మున్సిపోల్స్‌కు గట్టి బందోబస్తు: ఎస్పీ
కడప అర్బన్, న్యూస్‌లైన్: ఈనెల 30న జరగనున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత, ప్రశాంత పోలింగ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 640 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో ఏపీఎస్పీకి చెందిన ఒక కంపెనీ బలగాలు కూడా పాల్గొంటున్నాయని, వీరితోపాటు 2800 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు ఎస్ఐల నేతృత్వంలో 84 మొబైల్ బృందాలు, సీఐల నేతృత్వంలో 27 స్టైకింగ్ బలగాలు, డీఎస్పీ లేదా సీఐల నేతృత్వంలోని 20 ప్రత్యేక స్టయికింగ్ బలగాలు రంగంలో ఉంటాయని వివరించారు. ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగిసిందని, ఎక్కడైనా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలుస్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు. -
కార్పొరేటర్ అభ్యర్థుల నుంచి ‘ఖాకీ’ వసూళ్లు
అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నగర పాలక సంస్థ ఎన్నికలను అడ్డం పెట్టుకుని ఓ స్టేషన్ పోలీసులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. పోటీలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో పోలీస్‌స్టేషన్‌లో తరచూ నిర్వహించే సమావేశాలకు అయ్యే ఖర్చును పూడ్చుకునే పేరిట అభ్యర్థుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాష్ట్రపతి పాలనలో ప్రతి పనికీ ఎన్నో ఆంక్షలు ఉన్నందున అభ్యర్థులకు వాటిని వివరించి చెప్పాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం రెవెన్యూ, పోలీసు శాఖలకు అప్పగించింది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆయా స్టేషన్ల పరిధిల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ముందస్తుగా అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఓటర్లను చైతన్య వంతుల్ని చేయాలని చెప్పారు. అంతే...అధికారులు అలా చెప్పారో...లేదో ఓ స్టేషన్‌లోని అధికారి సలహా, సూచనలతో కొందరు ఖాకీలు కాలనీలపై పడ్డారు. అభ్యర్థులే కాక చోటా లీడర్ల నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా వసూళ్లు చేశారు. ఇదేంటని అడిగితే మీ సమావేశాలకు చేసే ఖర్చులు కూడా మేమే భరించాలా? అంటూ బుకాయిస్తున్నారు. దీంతో అభ్యర్థులు పోలీసులతో వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి అని నోరు మెదపడం లేదు. ఇప్పటికే సుమారు 12 మందికి పైగా అభ్యర్థులతో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తున్న అభ్యర్థులు పోలీసుల ఖర్చులకు డబ్బిచ్చామనే ధైర్యంతో కొందరు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ స్టేషన్ పరిధిలో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల నిబందనలను అతిక్రమించి బహుమతులు పంపిణీ చేస్తుండగా రెవెన్యూ శాఖాధికారులు (ఎన్నికల ప్రత్యేక అధికారులు) పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వసూళ్లలో బాగా ఆరి తేరిన కానిస్టేబుళ్లనే ఓ అధికారి బరిలోకి దింపినట్లు తెలుస్తోంది. -
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలు
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సార్వత్రిక, మున్సిపల్, స్థానిక ఎన్నికలు ప్రశాంతం గా జరగడానికి జిల్లా అధికార యంత్రాంగం దృష్టిసారించింది. ఇందుకోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సహాయం తీసుకోనున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టాలని చూస్తున్నారు. ఇందుకోసం వెబ్ కెమెరాలను, మోబైల్ వాహనాలను ఉపయోగించనున్నారు. 2,256 పోలింగ్ కేంద్రాలు జిల్లా వ్యాప్తంగా పది నియోజకవర్గాల్లో 2,256 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్ నియోజకవర్గంలో 226, చెన్నూర్‌లో 208, బెల్లంపల్లిలో 190, మంచిర్యాలలో 245, ఆసిఫాబాద్‌లో 254, ఖానాపూర్‌లో 218, ఆదిలాబాద్‌లో 230, బోథ్‌లో 223, నిర్మల్‌లో 222, ముథోల్‌లో 241 ఉన్నాయి. వీటిలో 650 అత్యంత సమస్యాత్మక, 820 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉంచవచ్చని అధికారులు భావిస్తున్నారు. వీటిని పూర్తిస్థాయిలో నిర్ధారించడానికి కసరత్తు జరుగుతోంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఇంటర్ నెట్, ఫోన్ సౌకర్యం కల్పించేందుకు కలెక్టర్ బీఎస్ఎన్ఎల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంకా 2,500 మంది బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులను ఉపయోగించుకోకున్నారు. వీరికి వెబ్ కాస్టింగ్‌పై శిక్షణ ఇచ్చి మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల వరకు రొటేషన్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఫొటో, వీడియోగ్రాఫర్ల చిత్రీకరణ జిల్లావ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 4,512 మంది ఫొటో, వీడియోగ్రాఫర్ల వివరాలు సేకరించారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఒక ఫొటో, ఒక వీడియోగ్రాఫర్‌ను నియమించనున్నారు. ఇందుకు 2,256 మంది ఫొటోగ్రాఫర్లు, 2,256 మంది వీడియోగ్రాఫర్లు పనిచేయనున్నారు. అధికారులు ఎన్నికల పనుల్లో బిజీగా ఉన్నారు. ఎన్నికల ఏర్పాట్లు, మండలాల, డివిజన్‌వారీగా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌ల్లో నిర్వహిస్తున్నారు. ఇంకా 10 నుంచి 15 గ్రామాలకు ఒక రూట్లో మోబైల్ వాహానాలు సంచరించే అవకాశాలున్నాయి. కాగా, వెబ్ కెమెరాలను పోలింగ్ కేంద్రాల నుంచి హైదరాబాద్‌లోని ఎన్నికల కమిషనర్ కార్యాలయం, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయానికి అనుసంధానం చేస్తారు. దీంతో పోలింగ్ విధానాన్ని అటు ఈసీ అధికారులు, ఇటు కలెక్టరేట్ అధికారులు ఏక కాలంలో చూసుకోవడానికి వీలుంటుంది. ఫలితంగా ఏమైన సంఘటనలు జరిగితే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. విధులు.. భత్యం.. ఎన్నికల విధులు నిర్వహించే ప్రతీ విద్యార్థికి రూ.500 ఇవ్వనున్నారు. పోలింగ్ ముందురోజే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఒక రాత్రి, ఒక పగలు విద్యార్థులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. నెట్ సౌకర్యం, వెబ్‌కాస్టింగ్‌లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెళ్లాల్సిన పోలింగ్ కేంద్రాలను అధికారులు ముందు రోజే చెబుతారు. రెవెన్యూ డివిజన్లవారీగా నియమించి పోలింగ్ కేంద్రాలు కేటాయిస్తారు. -
మోగిన ‘పుర’ భేరి
నేటి నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్ 30న మున్సిపల్ పోలింగ్ ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు సాక్షి, చిత్తూరు: హైకోర్టు ఉత్తర్వులతో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, నగరి, పలమనేరు మునిసిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 169 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మదనపల్లెలో 35 వార్డులకు, శ్రీకాళహస్తిలో 35, పుంగనూరులో 24, పలమనేరులో 24, నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు కార్పొరేషన్లో 50 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. తిరుపతి కార్పొరేషన్లో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానందున సాంకేతిక కారణాలతో ఇక్కడ ఎన్నికలువాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ఉత్తర్వులు కలెక్టర్ నుంచి ఆయా మున్సిపల్ ఎన్నికల అధికారులుగా ఉన్న కమిషనర్లకు అందాయి. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల తేదీలు ఇలా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మార్చి10న ఆయా మునిసిపాలిటీల్లో ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. కౌన్సిలర్లుగా పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు అదే రోజు (10వ తేదీ) 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలుకు 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 15న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. తుది జాబితాను 18న ప్రకటిస్తారు. అదే రోజు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్ 7వ తేదీ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది. అమలులోకి ఎన్నికల కోడ్ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు నిర్వహిస్తోంది మునిసిపాలిటీల్లోనే అయినా మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం కమిషనర్ నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దీంతో జిల్లాలోని 66 మండలాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నిబంధనలు పాటించాల్సిందే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. అధికారులు, ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు. ఎన్నికల నియమావళికి లోబడే అభ్యర్థులు ప్రచారం సాగించాల్సి ఉంటుంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బులు పంచడం, మద్యం సరఫరా చేయడం వంటివి నిషేధం. ఎన్నికల నిర్వహణకు నిబంధనల అమలులో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నిబంధనలకు లోబడే చేయాల్సి ఉంటుంది. మునిసిపాలిటీల్లో తాగునీరు, ఇతర ప్రధాన సమస్యలు తీవ్రంగా ఉన్న చోట పనులు ఆపకుండా ఎన్నికల కమిషన్ అనుమతితో సాగించవచ్చు. ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి ఉపయోగపడే పనులు చేపట్టరాదు. అలాగే వ్యక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోరాదు. నియామకాలు చేపట్టరాదు.