కడప అర్బన్, న్యూస్‌లైన్: ఈనెల 30న జరగనున్న కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో స్వేచ్ఛాయుత, ప్రశాంత పోలింగ్‌కు గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 640 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో సమస్యాత్మకమైనవిగా గుర్తించిన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తును ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పోలింగ్ బందోబస్తు విధుల్లో ఏపీఎస్‌పీకి చెందిన ఒక కంపెనీ బలగాలు కూడా పాల్గొంటున్నాయని, వీరితోపాటు 2800 మంది పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉంటారని ఎస్పీ వివరించారు. పోలింగ్ కేంద్రాలకు వంద మీటర్ల దూరంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గుంపులుగా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణకు ఎస్‌ఐల నేతృత్వంలో 84 మొబైల్ బృందాలు, సీఐల నేతృత్వంలో 27 స్టైకింగ్ బలగాలు, డీఎస్పీ లేదా సీఐల నేతృత్వంలోని 20 ప్రత్యేక స్టయికింగ్ బలగాలు రంగంలో ఉంటాయని వివరించారు. ప్రచార గడువు శుక్రవారం సాయంత్రానికి ముగిసిందని, ఎక్కడైనా అభ్యర్థులు ప్రచారం నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే ఎలాంటి చర్యలకు పాల్పడినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలుస్వేచ్చగా ఓటుహక్కు వినియోగించుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టామన్నారు.