మోగిన ‘పుర’ భేరి
- నేటి నుంచి అమల్లోకి ఎన్నికల కోడ్
- 30న మున్సిపల్ పోలింగ్
- ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు
- తిరుపతి కార్పొరేషన్‌కు ఎన్నికలు లేవు
సాక్షి, చిత్తూరు: హైకోర్టు ఉత్తర్వులతో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి నోటిఫికేషన్‌ను సోమవారం జారీ చేశారు. చిత్తూరు జిల్లాలోని చిత్తూరు కార్పొరేషన్, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, పుంగనూరు, నగరి, పలమనేరు మునిసిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 169 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తారు. మదనపల్లెలో 35 వార్డులకు, శ్రీకాళహస్తిలో 35, పుంగనూరులో 24, పలమనేరులో 24, నగరిలో 27, పుత్తూరులో 24 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.
చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు ఎన్నికలు జరుగుతాయి. తిరుపతి కార్పొరేషన్‌లో డివిజన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి కానందున సాంకేతిక కారణాలతో ఇక్కడ ఎన్నికలువాయిదా పడ్డాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ ఉత్తర్వులు కలెక్టర్ నుంచి ఆయా మున్సిపల్ ఎన్నికల అధికారులుగా ఉన్న కమిషనర్లకు అందాయి. ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నం కావాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికల తేదీలు ఇలా
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మార్చి10న ఆయా మునిసిపాలిటీల్లో ఫొటో ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తారు. కౌన్సిలర్లుగా పోటీ చేయదలచుకున్న అభ్యర్థులు అదే రోజు (10వ తేదీ) 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్లు దాఖలుకు 14వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ నెల 15న నామినేషన్లను స్క్రూటినీ చేస్తారు. తుది జాబితాను 18న ప్రకటిస్తారు. అదే రోజు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. మార్చి 30న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 2న ఓట్లను లెక్కిస్తారు. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఏప్రిల్ 7వ తేదీ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డెప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుంది.
అమలులోకి ఎన్నికల కోడ్
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయడంతో జిల్లా అంతటా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికలు నిర్వహిస్తోంది మునిసిపాలిటీల్లోనే అయినా మండల కేంద్రాలు, గ్రామాల్లో సైతం ఎన్నికల కోడ్ వర్తిస్తుందని ఎన్నికల సంఘం కమిషనర్ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. దీంతో జిల్లాలోని 66 మండలాల్లో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.
నిబంధనలు పాటించాల్సిందే
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు.
అధికారులు, ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పేరిట అధికార దుర్వినియోగానికి పాల్పడరాదు.
ఎన్నికల నియమావళికి లోబడే అభ్యర్థులు ప్రచారం సాగించాల్సి ఉంటుంది.
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, డబ్బులు పంచడం, మద్యం సరఫరా చేయడం వంటివి నిషేధం.
ఎన్నికల నిర్వహణకు నిబంధనల అమలులో అధికారులు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు ఎన్నికల ఖర్చు నిబంధనలకు లోబడే చేయాల్సి ఉంటుంది.
మునిసిపాలిటీల్లో తాగునీరు, ఇతర ప్రధాన సమస్యలు తీవ్రంగా ఉన్న చోట పనులు ఆపకుండా ఎన్నికల కమిషన్ అనుమతితో సాగించవచ్చు.
ప్రత్యేకంగా ఒక ప్రాంతానికి ఉపయోగపడే పనులు చేపట్టరాదు. అలాగే వ్యక్తులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోరాదు.
నియామకాలు చేపట్టరాదు.