అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : నగర పాలక సంస్థ ఎన్నికలను అడ్డం పెట్టుకుని ఓ స్టేషన్ పోలీసులు వసూళ్ల పర్వానికి తెర తీశారు. పోటీలో ఉన్న కార్పొరేటర్ అభ్యర్థులతో పోలీస్‌స్టేషన్‌లో తరచూ నిర్వహించే సమావేశాలకు అయ్యే ఖర్చును పూడ్చుకునే పేరిట అభ్యర్థుల నుంచి బలవంతపు వసూళ్లు చేస్తున్నట్లు తెలిసింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. రాష్ట్రపతి పాలనలో ప్రతి పనికీ ఎన్నో ఆంక్షలు ఉన్నందున అభ్యర్థులకు వాటిని వివరించి చెప్పాల్సిన బాధ్యతను ఎన్నికల సంఘం రెవెన్యూ, పోలీసు శాఖలకు అప్పగించింది. ఈ క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు సైతం ఆయా స్టేషన్‌ల పరిధిల్లో శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు ముందస్తుగా అభ్యర్థులకు సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు ఓటర్లను చైతన్య వంతుల్ని చేయాలని చెప్పారు.
అంతే...అధికారులు అలా చెప్పారో...లేదో ఓ స్టేషన్‌లోని అధికారి సలహా, సూచనలతో కొందరు ఖాకీలు కాలనీలపై పడ్డారు. అభ్యర్థులే కాక చోటా లీడర్ల నుంచి రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా వసూళ్లు చేశారు. ఇదేంటని అడిగితే మీ సమావేశాలకు చేసే ఖర్చులు కూడా మేమే భరించాలా? అంటూ బుకాయిస్తున్నారు. దీంతో అభ్యర్థులు పోలీసులతో వ్యతిరేకంగా ఎందుకు ఉండాలి అని నోరు మెదపడం లేదు. ఇప్పటికే సుమారు 12 మందికి పైగా అభ్యర్థులతో డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తున్న అభ్యర్థులు
పోలీసుల ఖర్చులకు డబ్బిచ్చామనే ధైర్యంతో కొందరు అభ్యర్థులు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆ స్టేషన్ పరిధిలో ముగ్గురు అభ్యర్థులు ఎన్నికల నిబందనలను అతిక్రమించి బహుమతులు పంపిణీ చేస్తుండగా రెవెన్యూ శాఖాధికారులు (ఎన్నికల ప్రత్యేక అధికారులు) పట్టుకుని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వసూళ్లలో బాగా ఆరి తేరిన కానిస్టేబుళ్లనే ఓ అధికారి బరిలోకి దింపినట్లు తెలుస్తోంది.