
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత
లేదంటే ఎన్నికలు జరగనివ్వం
హామీల అమలు కోసం జనవరి 3న ఇందిరాపార్కు వద్ద సభ
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరగనివ్వబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీని అమలు చేయకుంటే ఉద్యమిస్తామన్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్‌తో జనవరి 3న ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని కవిత ప్రకటించారు. 40కి పైగా బీసీ సంఘాల నాయకులతో శుక్రవారం కవిత తన నివాసంలో భేటీ అయ్యారు.
బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై ఆమె బీసీ సంఘాల నాయకులతో చర్చించారు. అనంతరం సమావేశంలో చర్చించిన అంశాలను మీడియాతో పంచుకున్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు అంశంపై స్పష్టత ఇవ్వడం లేదు’అని కవిత పేర్కొన్నారు.
జనవరి 3న సినిమా చూపిస్తాం
‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు జరుపుతాం. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక సమర్పణ, బీసీల జనాభా సంఖ్యను వెల్లడించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. బీసీల సంక్షేమానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అనేక పథకాల అమలును కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసింది. మొత్తంగా బీసీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్‌తో జనవరి 3న జరిపే సభ ద్వారా ప్రభుత్వానికి సినిమా చూపిస్తాం’అని కవిత ప్రకటించారు.