గెలుపే లక్ష్యంగా.. | Anxiety of congress and trs for victory of elections | Sakshi
Sakshi News home page

గెలుపే లక్ష్యంగా..

Published Tue, Mar 25 2014 2:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM

Anxiety of congress and trs for victory of elections

 ఇందూరు, న్యూస్‌లైన్ : త్వరలో జరగనున్న పరిషత్, బల్దియా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుపే లక్ష్యంగా పార్టీలు ముందుకు కదులుతున్నాయి. జెడ్పీ, బల్దియా పీఠాలు కైవసం చేసుకోవడంతోపాటు, ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలవడం సులభమవుతుందని ఆశి స్తున్నాయి. దీంతో రాజకీయంగా బలపడవచ్చని ఆయా పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకోసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో ప్రజా, ధనబలం ఉన్న అభ్యర్థులకే పార్టీ టికె ట్లు ఇచ్చి బరిలోకి దింపి రం గం సిద్ధం చేశాయి. ఇక మిగిలింది ఓటర్లను తమవైపు తిప్పుకోవడమే. ఎలా చేస్తే ఓటర్ల మనసును గెలుస్తాం, ఏ విధంగా ప్రచారం చేసి ప్రతిపక్ష పార్టీల ఎత్తుగడలను దాటుతామనే ఆలోచనలో పార్టీల ముఖ్య నాయకులు తలమునకల య్యారు.

 ఇందుకోసం రాజకీయ విశ్లేషకులు, నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఇటు కాంగ్రె స్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ, వైఎస్‌ఆర్ సీపీలు అన్ని మం డలాల్లో తమ పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నాయి. నామినేషన్‌ల పర్వం ముగిసిన మరుసటి రోజు నుంచే ప్రచారం మొదలైన నేపథ్యంలో, అభ్యర్థికి మద్దతు గా ప్రజాబలం ఉన్న జిల్లా నాయకుడిని ప్రచారకర్తగా నియమిస్తున్నారు. పోటీ పార్టీలకు తగ్గకుండా ప్రచారం నిర్వహించాలని ఆయా  పా ర్టీల రాష్ట్ర నేతలు జిల్లా నేతలకు గట్టి ఆదేశాలు జారీచేశారు. జిల్లా నాయకు లు మండల నాయకులకు ఎన్నికల బా ధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో పరి షత్ ఎన్నికలను సవాల్‌గా తీసుకుని కాలుదువ్వడానికి సై అంటున్నారు.

 డబ్బులు ఉన్నవారికే టికెట్టు..
 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఒక్కో పార్టీ నుంచి ముగ్గురు నుంచి నలుగురు నామినేషన్‌లు వేశారు. అయితే వీరిలో ప్రజాబలం ఉన్న అభ్యర్థులను పక్కనపెట్టి ధనబలం ఉన్న అభ్యర్థులకే ఆయా పార్టీలు పార్టీ టికెట్లను ఇస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ రానివారు పార్టీలు వీడడం, స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగడం చేస్తున్నారు. పోటీనుంచి తప్పుకుంటే మండల, జిల్లాస్థాయి పదవి ఇస్తామని  బుజ్జగించినా వారు వినడంలేదు. దీంతో మనస్తాపం చెందిన పలువురు అభ్యర్థులు చెప్పకుండానే పార్టీలను వీడుతున్నారు. ఇది వరకే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ టికెట్లు దక్కని పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి, తిట్లతో దుమ్మెత్తి పోసిన సంగతి తెలిసిందే. ఇంత జరిగినా తర్వాత కూడా జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్లను సైతం అమ్ముకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా పార్టీలో ఉంటూ సేవచేచేసిన వారికి పార్టీలు టికెట్లు విస్మరించడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 జెడ్పీ పీఠం అభ్యర్థుల పేర్లు గోప్యం..
 జిల్లాపరిషత్ చైర్మన్ పీఠం కోసం పోటీలో ఉంచే అభ్యర్థి పేరును ఇంకా ఏ పార్టీలు ప్రకటించలేదు. జడ్పీ పీఠం బీసీ జనరల్ రిజర్వు కావడంతో పురుష, మహిళా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీ పార్టీలో ముగ్గురు అభ్యర్థుల చొప్పున పేర్ల జాబితాను తయారు చేశారు. ఆ ముగ్గురిలో ఒకరిని రేసులో ఉంచడానికి ముఖ్య నాయకుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ మండలానికి చెందిన పుప్పాల శోభ పేరు తెరపైకి వచ్చింది. కాని ఇంకా ఖరారు కాలేదు. పీఠం రేసులో తనకు అవకాశం ఇవ్వాలంటూ పేరు, పలుకుబడి, ధనబలం ఉన్న పోటీ అభ్యర్థులు సంబంధిత పార్టీ పెద్దలను కలుస్తున్నట్లు తెలిసింది. ఒకరకంగా అభ్యర్థి పేరు ఖరారు చేసినప్పటికీ పార్టీ పెద్దలు గోప్యంగా ఉంచుతున్నారు. ఇటు జెడ్పీటీసీ,ఎంపీటీసీ స్థానాల్లో నామినేషన్‌లు ఎక్కువగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ నుంచే వచ్చాయి. జెడ్పీ పీఠం రేసులో ప్రధానంగా ఈ రెండు పార్టీలే పోటీలో కీలకం కానున్నాయి.

 పంచడానికి రంగం సిద్ధం..
 పరిషత్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు దాదాపుగా పార్టీ టికెట్లను ఖరారు చేసిన ఆయా పార్టీలు, పార్టీ ఫండ్‌ను అందజేయడానికి సిద్ధం చేస్తున్నాయి. ధనబలం ఉన్న అభ్యర్థులకు, పార్టీపరంగా మరికొంత డబ్బును ఇస్తే గెలవడం సాధ్యమవుతుందనే ఉద్దేశంతో పార్టీ ఫండ్‌ను ఇవ్వడానికి పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. పోటీ అభ్యర్థులు గ్రామాల్లోని సర్పంచ్, ద్వితీయశ్రేణి నాయకులు, కుల సంఘాలతో రహస్య మంతనాలు జరిపి ప్యాకేజీలకు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. డబ్బులు, మద్యం పంచడానికి టీంలుగా విభజించి వారికి జోరుగా దావత్‌లు ఇస్తున్నారు. యూత్ సభ్యులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరి ఓటరన్న ఎవరిని గెలిపిస్తాడో కొద్దిరోజులు వేచిచూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement