ఇందూరు అడ్డాగా మార్బుల్స్ దందా | Marbles danda in induru | Sakshi
Sakshi News home page

ఇందూరు అడ్డాగా మార్బుల్స్ దందా

Published Mon, Jul 14 2014 3:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:15 AM

ఇందూరు అడ్డాగా మార్బుల్స్ దందా

ఇందూరు అడ్డాగా మార్బుల్స్ దందా

సుభాష్‌నగర్ : ఇందూరు అడ్డాగా మార్బుల్ అక్రమ రవాణా కొనసాగుతోంది. నగరం నడిబొడ్డు నుంచి నిత్యం పదుల సంఖ్యలో లారీల్లో మార్బుల్ అక్రమ రవాణా జరుగుతున్నప్పటికి సంబంధిత అధికారులు స్పందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి అధికారులు వెనుకంజ వేస్తున్నారని తెలుస్తుంది.

మార్బుల్ లారీలు నగర శివారులోని ఓ ప్రత్యేకమైన స్థలంలో నిలి పి, హైదరాబాద్‌లో నో ఎంట్రీ సమయం ముగిసిన అనంతరం ఇక్కడి నుంచి బయలు దేరుతున్న విషయం కూడా అధికారులకు తెలిసినా, వాటిని నియంత్రించేం దుకు ముందుకు రావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
 
డిమాండ్‌తో..
నగరం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, మార్బుల్ వినియో గం విపరీతంగా పెరిగింది. దీంతో దానిని అవకాశంగా తీసుకున్న మార్బుల్ వ్యాపారులు, అక్రమ రవాణాతో పాటు అధిక సామర్థ్యంతో మార్బల్‌ను నగరంతోపాటు హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు.ఈ విలువైన మార్బల్‌ను కొంతకాలంగా రాజస్థాన్ నుంచి సాలూర చెక్‌పోస్టు మీదుగా నగరంలో నుంచి కామారెడ్డి చెక్‌పోస్టు ద్వారా హైదరాబాద్‌కు తరలుతోంది.
 
 ఇలా రవాణా జరుగుతున్న మార్బల్‌పై 14.5 శాతం పన్నును వాణిజ్య పన్నుల శాఖకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే చెక్‌పోస్టుల వద్ద అధికారులు మామూళ్లు తీసుకుని లారీలను వదలడం వల్ల, ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. ఇలా రవాణా జరుగుతున్న మార్బుల్ ద్వారా, రోజుకు సుమారుగా రూ. 3 లక్షల మేర నష్టం వాటిల్లుతోంది. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారుల జేబులు నిండుతున్నాయి. అక్రమ వ్యాపారుల రూపాయలు లక్షల్లో ఆర్జిస్తున్నారు.
 
ఓ ట్రాన్స్‌పోర్టు ద్వారా..
రాజస్థాన్ నుంచి మార్బల్‌ను అక్రమంగా తరలించేందుకు ప్రత్యేకంగా ఓ ట్రాన్స్‌పోర్టు లారీలు నడుస్తున్నట్లు సమాచారం. ఈ ట్రాన్స్‌పోర్టు నుంచి బయలుదేరే 10 టైర్ల లారీల్లో 25 టన్నులు రవాణా చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా 40 టన్నుల సామర్థ్యంతో రవాణా జరుపుతున్నారు. సామర్థ్యానికి మించి లారీల్లో మార్బల్‌ను రవాణా చేస్తున్నప్పటికి, సంబంధిత రవాణాశాఖాధికారులు కూడా వీటిపై కన్నేయక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. చీటికి మాటికి ఇతరత్రా లారీలను వేధించే రవాణాశాఖాధికారులు, ఈ ట్రాన్స్‌పోర్టు లారీలు కనిపించగానే చేతులు ముడుచుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement