ఇందూరుతో ‘రావూరి భరద్వాజ’కి అనుబంధం
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ శుక్రవార రాత్రి హైదరాబాద్‌లో అకాల మరణం పొందడంతో జిల్లా సాహితీలోకం దిగ్భ్రాంతి చెందింది. భరద్వాజకు జిల్లాతో విడదీయలేని అనుబంధముంది. కొన్నినెలల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆయన రాసిన ‘పాకుడు రాళ్లు’ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించింది. ఇటీవలే ఢిల్లీలో ఆ అవార్డును అందుకున్నారాయన. విశ్వనాథ సత్యనారాయణ, సి. నారాయణరెడ్డి తర్వాత 23ఏళ్లకు ఆ స్థాయి గౌరవం దక్కించున్న తెలుగువాడు భరద్వాజ.
జిల్లాకేంద్రంలో ఇందూరు భారతి ఆధ్వర్యంలో నిర్వహించిన మూడు కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్ఞాన్‌పీఠ్ అవార్డు ప్రకటన తర్వాత జూన్‌లో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో రావూరిని సన్మానించారు. భరద్వాజ మృతి సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా కవులు వి.పి.చందన్‌రావు, కందాలై రాఘవాచార్య, ఘనపురం దేవేందర్, మేక రామస్వామి, పడాల రామారావు, కాసర్ల నరేశ్‌రావు, తిరుమల శ్రీనివాస్, నరాల సుధాకర్, ఆయాచితం వెంకటేశ్వర్లు తదితరులు ఆవేదన వ్యక్తంచేశారు.