ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ డీఎస్‌డీఓ రావూరి రాజు, డబ్బులు పట్టుకు వచ్చిన వాచ్‌మన్ గురుచరణ్
మహబూబాబాద్ రూరల్: ఏసీబీ వలకు మరో అధికారి చిక్కాడు. మహబూబాబాద్ జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ (డీఎస్‌సీడీఓ) అధికారి రావూరి రాజు రూ.2 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు. అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్సీ (బాలుర) వసతి గృహం వార్డెన్ పూనమల్ల బాలరాజు 2019 నవంబర్‌లో విధుల పట్ల నిర్లక్ష్యం చేయడంతో సస్పెండ్ అయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తిరిగి మరిపెడ ఎస్సీ బాలుర హాస్టల్ వార్డెన్‌గా నియామకమయ్యాడు. 2019 నవంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు బాలరాజు తన సస్పెన్షన్ పీరియడ్‌కు సంబంధించిన సప్లిమెంటరీ బిల్స్ కోసం డీఎస్‌సీడీఓ రాజును సంప్రదించాడు. డీఎస్‌సీడీఓ ఆ బిల్స్ చేసి బాలరాజుకు పంపాడు.
మొత్తం రూ.7 లక్షలు వార్డెన్ బాలరాజు ఖాతాలో జమ అయ్యాయి. దీంతో డీఎస్‌సీడీఓ ఆ బిల్స్ చేసినందుకు బాలరాజును రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో బాలరాజు.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రూ.2 లక్షల మొత్తాన్ని డీఎస్‌సీడీఓ వాచ్‌మన్ గురుచరణ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కొండపల్లి గోపాల్‌రావునగర్ కాలనీలో నివాసం ఉండే డీఎస్‌సీడీఓ రాజు ఇంటికి పంపాడు. అప్పటికే మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు వెంటనే ఆయన ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. అక్కడి నుంచి డీఎస్‌డీఓను తన కార్యాలయానికి తీసుకెళ్లి పట్టుకున్న డబ్బులకు పరీక్షలు నిర్వహించారు. వేలిముద్రల ఆధారంగా రాజు రూ.2 లక్షల నగదును లంచంగా తీసుకున్నట్లు గుర్తించారు. డీఎస్‌డీఓ, వాచ్‌మన్‌ను అదుపులోకి తీసుకుని నగదును సీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment