మీరెక్కడ సారూ! | negligence on ruling in panchayat office | Sakshi
Sakshi News home page

మీరెక్కడ సారూ!

Published Sat, Aug 23 2014 3:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

negligence on ruling in panchayat office

ఇందూరు : గ్రామాల పరిపాలనను శాసించే జిల్లా పంచాయతీ కార్యాలయానికి  రెండుమూడు నెలలుగా గ్రహణం పట్టుకుంది. ఉద్యోగుల కొరతకు తోడు జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు కార్యాలయం వైపు కన్నెత్తి చూడకపోవడంతో ఫైళ్లతో సహా, ఇతర పనులన్నీ పెండింగ్ పడిపోయాయి. మరో పక్క ప్రజలు గ్రామాల నుంచి వచ్చి డీపీఓకు సమర్పించిన ఫిర్యాదులు పరిష్కారం లభించడం లేదు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు సైతం మోక్షం లభించడంలేదు. మార్చిలో పంచాయతీ కార్యదర్శి పోస్టుల ఫలితాల అనంతరం మెరిట్ మార్కులు, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి భర్తీ చేయాల్సిన పోస్టులు నేటి వరకు అలాగే ఉన్నాయి.

తప్పులను సరిదిద్దుతున్నామనే సాకును చెప్పి ప్రస్తుతం ఆ ఫైలు సంగతే మరిచిపోయారు. నత్త నడక కన్నా నెమ్మదిగా డీపీఓ పాలన సాగుతుందని విమర్శలు వస్తున్నాయి. అత్యవసర ఫైళ్లకు తప్పా ఇతర ఫైళ్లపై డీపీఓ సంతకాలు పెట్టడం లేదని తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగుల కొరత ప్రస్తుతం పని చేస్తున్న నలుగురైదుగురు ఉద్యోగులపైనే పడుతోంది. ఇదిలా ఉండగా డీపీఓ వైఖరిపై పంచాయతీ కార్యదర్శులతో పాటు కార్యాలయ ఉద్యోగులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

 పనితనమే కారణం...
 ప్రతీది భూతద్దంలో పెట్టి చూడటం డీపీఓకు బలమూ,బలహీనతగా మారుతోందని అంటున్నారు. డీపీఓ కాస్త భిన్నంగా పనిచేస్తారని పేరుంది. సురేశ్ బాబు జిల్లాకు వచ్చి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతోంది. విధుల్లోనే కాకుండా పనిని పూర్తి చేయడంలో ఒకటికి రెండు సార్లు పరిశీలించి, తప్పులను సవరించే మనస్తత్వం ఆయనది. సెక్షన్ ఉద్యోగి ఏదైనా ఫైలు తీసుకుని ఆయన వద్దకు వెళ్తే క్షుణ్ణంగా పరిశీలించి మళ్లీ మళ్లీ తెప్పించుకుంటారని సిబ్బంది అంటుంటారు.

ఇలాంటి వైఖరి కలిగిన సురేశ్‌బాబు గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో చాల నిష్పక్షపాతంగా వ్యవహరించారు. తరువాత అసెంబ్లీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో డీపీఓకు పెద్ద బాధ్యతలు అప్పగించారు. రిటర్నింగు అధికారిగా పని చేశారు. ఎన్నికలు పూర్తయ్యాయో లేదో మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం, ఆ తరువాత మొన్నటి వరకు సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం రావడంతో మరింత బిజీ అయ్యారు. ఇలా రెండు మూడు నెలలుగా తన సొంత కార్యాలయ పనులను, ఫైళ్లను వదులుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల్లో పూర్తిగా లీనమయ్యారు.

దీంతో ఆ ప్రభావం కాస్త కార్యాలయంపై బాగానే పడింది. అత్యవసర ఫైళ్లను డీపీఓ ఎక్కడుంటే అక్కడికి తీసుకెళ్లి సంతకాలు పెట్టిస్తున్నారు. రిటైర్డు కార్యదర్శుల పెన్షన్, మెడికల్ బిల్లులు, కోర్టు సంబంధిత పేషీలు, పేబిల్స్, జీపీ సంబంధిత, బి2,బి1,బి5,బి6 సెక్షన్‌లతో పాటు మిగతా ఫైళ్లు కార్యాలయంలోని డీపీఓ చాంబర్‌లో కుప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తున్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా 718 గ్రామ పంచాయతీల్లో నిర్వహించాల్సిన గ్రామ సభలు, పారిశుధ్య వారోత్సవాలు క్షేత్ర స్థాయిలో తూతూ మంత్రంగా జరిగాయి. పారిశుధ్య సమస్యతో గ్రామాలు, తండాలు కొట్టుమిట్టాడుతున్నా డీపీఓ అక్కడికి వెళ్లి పర్యటించిన దాఖలాలు లేవు.

 దర్శనమివ్వండి ‘బాబూ’
 పనుల్లో బిజీగా ఉన్నా డీపీఓ సురేశ్‌బాబు తన కార్యాలయానికి ఎప్పుడు వస్తున్నారో.. ఎప్పుడు వెలుతున్నారో తెలియడం లేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గత పక్షం రోజులుగా డీపీఓ కార్యాలయానికి రాలేదని చెబుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం గ్రామాల నుంచి వస్తున్న వారు డీపీఓ కోసం నిరీక్షించి ఆయన రాకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నారు. సర్పంచుల పరిస్థితి కూడా అంతే ఉంది. డీపీఓ దర్శన భాగ్యం దొరక్కపోవడంతో రెండవ శ్రేణి అధికారులకు సమస్యలను విన్నవించి వెళుతున్నారు. భర్తీ కావాల్సిన 66 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు చెందిన అభ్యర్థులు కూడా డీపీఓ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement