Panchayat Office
-
పెన్షన్ కోసం 2 కిలోమీటర్లు పాక్కుంటూ వెళ్లిన 80 ఏళ్ల బామ్మ
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు. ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు. వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు. -
ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి.. మంత్రి ఆకస్మిక తనిఖీ..
లక్నో: యూపీలోని కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు . షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు. ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH .#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy — Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023 ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా? -
పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ ఇవ్వలేదని ఆక్రోశంతో పౌర కార్మికుడు పంచాయతీ కార్యాలయానికి చెప్పుల హారం వేసిన సంఘటన దేవనహళ్లి తాలూకా అవతి గ్రామంలో చోటుచేసుకుంది. పంచాయతీ పౌర కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్ప పీడీఓ శివరాజ్‌ను దసరా పండగకు కొత్త బట్టలు, బోనస్ అడిగాడు. అయితే పీడీఓ పట్టించుకోకపోవడంతో ఆగ్రహించిన కృష్ణప్ప సోమవారం రాత్రి కార్యాలయానికి వెళ్లి చెప్పుల హారం వేసాడు. తాలూకా పంచాయతీ అసిస్టెంట్ డైరెక్టర్ సునీల్ పౌర కార్మికులతో సమావేశమై వారికి సర్ది చెప్పారు. అనంతరం చెప్పుల హారాన్ని తొలగించారు. -
ఇంటి ముందే టీడీపీ సర్పంచ్ ప్రమాణస్వీకారం
ఈపూరు(వినుకొండ): పంచాయతీ కార్యాలయంలో నిర్వహించాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని.. టీడీపీకి చెందిన ఓ సర్పంచ్ తన ఇంటి ముందే వేడుకలా జరిపించుకున్నారు. పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి మరీ జరిపించారు. గుంటూరు జిల్లా చిట్టాపురంలో జరిగిన ఈ ఘటన విమర్శలపాలైంది. చిట్టాపురం సర్పంచ్‌గా నందిగం నిర్మలాదేవి ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరగాల్సి ఉంది. అయితే ఇందుకు విరుద్ధంగా పంచాయతీ కార్యదర్శి దిలీప్.. నిర్మలాదేవి ఇంటి ముందే టెంట్లు వేసి ఘనంగా జరిపించారు. దీనిపై కార్యదర్శిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో ప్రసాద్‌ను వివరణ కోరగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. -
పేరు సరే.. ఊరేది?
సాక్షి ప్రతినిధి కడప: ఆ పంచాయతీ పేరు రెవెన్యూ రికార్డుల్లో ఉంటుంది. పంచాయతీ కార్యాలయం కూడా ఉంటుంది. కానీ భౌతికంగా ఆ ఊరు మాత్రం కనపడదు. ఆ ఊరికే ప్రస్తుతం వేరే పేరు స్థిరపడిపోయి ఉంటుంది. కొత్త పేరునే స్థానికులు వినియోగిస్తుంటారు. గతంలో ఓ వెలుగు వెలిగిన వందలాది గ్రామాలు శిథిల శకలాలుగా మిగిలి నేడు కనుమరుగైపోయాయి. ఆనాటి గ్రామాల్లో నివసించిన వారు కొత్తగ్రామాలను ఏర్పాటు చేసుకోవడమో, ఇతర గ్రామాలకు వలసవెళ్లిపోవడమో, పేరు మార్చుకోవడమో జరిగింది. ఇలాంటి గ్రామాలు వైఎస్సార్ జిల్లాలో వందలాదిగా ఉన్నాయి. ఉదాహరణకు కత్తెరగండ్ల అనే పెద్ద గ్రామం పూర్వం ఉండేది. కాలక్రమంలో ఆ గ్రామం కనుమరుగైపోయి చిన్న గ్రామాలుగా విడిపోయింది. ప్రస్తుతం రికార్డుల్లో కత్తెరగండ్ల ఉన్నా.. ఆ పంచాయతీ కార్యాలయం చెన్నవరం అనే గ్రామంలో ఉంటుంది. కత్తెరగండ్లకు బదులుగా చెన్నవరం పేరునే స్థానికులు వినియోగిస్తారు. బందిపోట్లు, దివిటి దొంగల దాడులు, పాలెగాళ్ల ఒత్తిళ్లు, ఫ్యాక్షన్ గొడవలు, కలరా లాంటి వ్యాధులు, సాగు, తాగునీరు లేకపోవడం తదితర కారణాలతో ఆనాటి ఊళ్లు ఖాళీ అయిపోయాయని చరిత్రకారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉండి భౌతికంగా లేని ఊళ్లు జిల్లాలో 100కు పైగా ఉంటే.. రికార్డుల్లో లేకుండా పూర్తిగా కనుమరుగైన ఊళ్లు దాదాపు 500 ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► కాలగర్భంలో కలసిపోయిన ఒక్కో ఊరిది ఒక్కో కథ.. ► బద్వేలు ప్రాంతంలో దాదాపు 50 గ్రామాలు అదృశ్యమైపోయాయి. ► శ్రీఅవధూత కాశినాయన మండలంలోని కత్తెరగండ్ల కృష్ణదేవరాయల కాలంలో కుటీరపరిశ్రమలతో అలరారింది. ఈ ఊరు ఇప్పుడు శిథిలమైపోయింది. ఆ పేరు ఇప్పటికీ కొనసాగుతోంది. ► 13వ శతాబ్ది నుంచి రంపాడు అనే గ్రామం ఉంది. దండుబాటల కారణంతో దోపిడికి గురై గ్రామం కిలపడిపోయింది. కాలక్రమంలో ధర్మారంపాడు, పాపిరెడ్డిపల్లె, కొండపేట, లక్ష్మిగారిపల్లె తదితర గ్రామాలుగా మార్పు చెందింది. ఇప్పటికీ రంపాడు పేరుతోనే రికార్డులు ఉన్నాయి. ► గతంలో సిరులతో అలరారిన అక్కెంగుండ్ల గ్రామం దొంగల దాడులతో కాలగర్భంలో కలసిపోయింది. ► వాసుదేవాపురం, పగడాలపల్లె, నీలాపురం, టి.శేషంపల్లె, సంచర్ల, అనంతరాజుపురం గ్రామాల పేర్లు ఉన్నా ఊళ్లు మాత్రం కనబడవు. ► జమ్మలమడుగు మండలంలో తూగుట్లపల్లి, పాత కొండాపురం గ్రామాలు దోపిడీ దొంగల దాడులతో పూర్తిగా తుడిచి పెట్టుకునిపోయాయి. ఆనాటి బురుజులు, గంగమ్మ దేవాలయం మాత్రమే నేటి తరానికి సాక్ష్యాలు. ► రైల్వేకోడూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పలుగ్రామాలు అంతరించి పోయినా పేర్లు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. చాలా పెద్దవి కాశినాయన మండలంలోని రంపాడు, కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల, వాసుదేవపురం తదితర ఐదు రెవెన్యూ గ్రామాలు చరిత్రలో కలిసిపోయాయి. కొన్ని దోపిడి దొంగల దాడులు, వ్యాధులు, క్రూరమృగాల కారణంగా కిలపడిపోయాయి. కత్తెరగండ్ల, అక్కెంగుండ్ల గ్రామాలు చాలా పెద్దవి. ఒక్కో ఊరిలో వెయ్యికిపైగా కుటుంబాలుండేవి. వ్యవసాయం, పశుపోషణ, పరిశ్రమలతో కళకళలాడేవి. నేడు అవి పేర్లకే పరిమితయ్యాయి. – సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, నవల, కథా రచయిత, కాశినాయన మండలం రెవెన్యూ రికార్డుల్లోనే ఉంది అంబవరం పంచాయతిలో తూగుట్లపల్లి గ్రామం ఉంది. ఆ గ్రామానికి సంబంధించిన పొలాల వివరాలు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం గ్రామం ఆనవాలు ఎక్కడ కనిపించదు. ఒక్క ఇల్లు కూడాలేదు. – శ్రీనివాసులు, వీఆర్వో, అంబవరం పంచాయతి. దోపిడీలతోనే గ్రామాలు ఖాళీ బందిపోట్లు, దివిటి దొంగల దాడులతో అటవీ శివారు గ్రామాలు ఖాళీ కాగా, జబ్బులు, నీటి వసతి లేక, ఫ్యాక్షన్ గొడవలు, పాలెగాళ్ల దాడులతో కొన్ని గ్రామాలు కనుమరుగయ్యాయి. బందిపోట్లను ఎదుర్కొని నిలిచిన కొన్ని గ్రామాలు మాత్రమే కొండ ప్రాంతాల్లో ఉండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో గ్రామాలు కనుమరుగైనట్లు చరిత్ర చెబుతుంది. – తవ్వా ఓబుల్‌రెడ్డి, చరిత్ర పరిశోధకులు, మైదుకూరు -
గట్టు.. లోగుట్టు!
సాక్షి, గట్టు (గద్వాల): పంచాయతీకి అత్యంత కీలకమైన రివిజన్ రిజిస్టర్ గట్టు పంచాయతీలో మాయం చేశారు. పంచాయతీలో ఎన్ని గృహాలు ఉన్నాయి.. ఖాళీ స్థలాలు.. వ్యాపార దుకాణాలు ఇలా అన్ని రకాల వాటికి సంబంధించిన అత్యంత కీలమైనది రివిజన్ రిజిస్టర్. ప్రస్తుతం ఈ రిజిస్టర్ కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పని చేసి, ఇదే మండలంలో వేరే పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శికి, ప్రజాప్రతినిధి భర్తకు మధ్య పంచాయతీ నిధుల వాటాల పంపకాల్లో తేడాల కారణంగా ఓ నేత రివిజన్ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు పంచాయతీ నిధులకు సంబంధించిన జమ, ఖర్చుల రికార్డులు సైతం పంచాయతీలో కనిపించకుండా చేశారు. 2017 నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు ఎక్కడ జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు వారి హ యాంలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి పంచాయతీ రికార్డులో నమోదు చేసి, పాత తేదీల్లో పొజీషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజాగా గ్రామ పంచాయతీలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో పంచాయతీ స్థలాలను చదును చేస్తుండటంతో ఆయా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. రికార్డులు అప్పగించలే.. గట్టు పంచాయతీకి సంబంధించిన రివిజన్ రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను అప్పగించని వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం గట్టు పర్యటనకు వచ్చిన కలెక్టర్ శశాంక దృష్టికి గట్టు–1 ఎంపీటీసీ సభ్యురాలు మహేశ్వరి భర్త రామునాయుడు, మరికొందరు యువకులు రివిజన్ రిజిస్టర్ లేని విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఆరుగురు పంచాయతీ కార్యదర్శులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన తరుణంలో డీపీఓ గట్టు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ రికార్డులను అప్పగించని వారిపై ఫిర్యాదు చేశారు. కార్యదర్శులు రికార్డులతోపాటు పంచాయతీ నిధులు సైతం పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. రూ.40 లక్షలకు రికార్డులేవీ..? గట్టు పంచాయతీలో 13, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40,56,656లకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండానే డ్రా చేసుకున్న వ్యవహారంపై 2017లో జిల్లా పంచాయతీ అధికారి అప్పటి సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 2018లో పంచాయతీ నిధులు రూ.1,35,764 ఎలాంటి పనులు లేకుండా పంచాయతీ కార్యదర్శి, అప్పటి సర్పంచ్ స్వాహా చేసినట్లు అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గట్టు– 2 ఎంపీటీసీ సభ్యురాలు నాగవేణి, వార్డు సభ్యులు కలిసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు. -
ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్ : దుండిగల్ పంచాయతీ కార్యలయంలో ముగ్గురు ఉద్యోగులు ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. పంచాయతీ కార్యలయంలో 31 వేలు లంచం తీసుకుంటూ మేనేజర్ గోవింద్ రావు, జూనియర్ అసిస్టెంట్ కృష్ణా రెడ్డి , ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేందర్ రెడ్డి పట్టుబడ్డారు. ఒక కేసుకు సంబంధించి బాధితుల నుంచి 2 లక్షల 50 వేలు డిమాండ్ చేసినట్లు సమాచారం. -
కట్టుదిట్టంగా పంచాయతీ పాలన
సాక్షి, అక్కన్నపేట(హుస్నాబాద్): గత పంచాయతీల పాలనతో పోల్చుకుంటే ఈ సారి పంచాయతీల పాలన కట్టుదిట్టంగా మారనుంది. పల్లెల్లో పారదర్శకత పెంపొందించడంతో పాటు పంచాయతీకి వచ్చే నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పంచాయితీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. గ్రామ పంచాయతీలను పట్టిష్టం చేయడానికి ప్రభుత్వాలు పంచాయతీలపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.. సర్పంచ్‌లకు సవాలే.. గత పాలనలో సర్పంచ్‌లు ఆడిందే ఆట పాడిందే పాట అయ్యింది. కాని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు గ్రామాల్లో సమస్యలు వారికి స్వాగతం పలుకుతున్నాయి. గతంలో లాగా ఈ సారి ఆ పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ పని చేయాలన్న గ్రామస్తుల సమావేశంలో తీర్మానాలు చేసి వారి సమక్షంలో నిధుల వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రతీ సారి పంచాయతీకి మంజూరయ్యే నిధులు వాటి వినియోగానికి సంబంధించి విషయాలు ఎప్పకటిప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయితీలలో చేసే ప్రతి పని ఆన్లైన్లో పొందు పరచాల్సి ఉంటుంది. తీర్మానం లేకుండా చేస్తే పదవికి ముప్పే.. గతంలో లాగా గ్రామ పంచాయితీలలో తీర్మానాలు లేకుండా ఏ పని చేసినా వాటి బిల్లుల చెల్లింపులతో పాటు వారిపై వేటు పడే అవకాశం ఉంది.గతంలో సర్పంచ్‌లు ముందస్తుగా డబ్బులు ఖర్చు చేసి ఆ తర్వాత వచ్చిన నిధులను తీర్మానాలు చేయకుండానే తీసుకునేవారు.కానీ ఈ సారి ప్రతి పనికి ముందస్తుగా తీర్మానం చేసుకొని నిధులు వచ్చిన తర్వాతనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతా ఆన్లైన్.. ప్రియా(పంచాయితీ రాజ్ ఇనిస్టిట్యూషన్ అండ్ యూత్ అకౌంటింగ్) సాఫ్ట్వేర్ ద్వారా పంచాయతీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయి. గ్రామాలలో పనిచేసే ప్రతీ అభ్యర్థి ఏఏ పనులు చేస్తున్నారు. ఎన్ని నిధులు ఖర్చు చేస్తున్నారు.అనే విషయాన్ని తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది.పంచాయతీకి ఏ గ్రాంటు ద్వారా నిధులు మంజూరయ్యాయి అందులో ఎన్ని ఖర్చు చేశారో కూడా పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. గ్రామ జ్యోతి వెబ్సైట్ ద్వారా.. పంచాయితీలకు ఎంత బడ్డెట్ మంజూరైంది.మంజూరైన నిధులు దేనికి ఎంత ఖర్చుచేశారు. శానిటేషన్ వైద్యం, నీటి సరఫరా సోషల్ వర్కులు,సీసీ రోడ్డుల నిర్మాణం, సిబ్బంది వేతనాలు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పంచాయతీ ఖర్చు చేయగా ఇంకా పంచాయతీలో ఎన్ని నిధులు ఉన్నాయి. వాటి వివరాలను ఈ వెబ్సైట్లో పూర్తి స్థాయి సమాచారం ఉంటుంది. నేషనల్ పంచాయతీ పోర్టల్ యాప్.. పంచాయతీ పరిధిలో జరుగుతున్న పనుల వివరాలు గ్రామంలోని ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, కాలువలు, ఖాళీ స్థలాలు ఇతరత్రా గ్రామ స్థాయి సమాచారం ఇందులో జరుగుతున్న అభివృద్ధి పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫోటోలను యాప్లోఆన్లోడ్ ఆప్‌లోనే చేస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో కొనసాగుతున్న పనులకు సంబంధించి వివరాలతో పాటు ఎన్ని నిధులు ఖర్చు అయ్యాయో కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్‌ను గూగుల్ స్టోర్ నుంచి అప్ లోడ్ చేసుకోవచ్చు. పారదర్శకత పెరిగింది.. పంచాయితీలకు సంబంధించి నిధులు ఖర్చుల వివరాలు పూర్తి స్థాయి లో యాప్‌ల వెబ్సైట్లలో అందుబాటులో ఉండడంతో పంచాయితీలలో అవినీతి తగ్గడంతో పాటు పాలన పారదర్శకంగా ఉంటుంది.గతంలో జరిగిన పనులకు సంబంధించి వివరాలు నిధుల ఖర్చుల వివరాలు కొత్త పనుల ఎంపిక కోసం ఈ యాప్ తోడ్పడుతుంది.వీటిపై ఆయా గ్రామ పంచాయితీల పాలకులు,యవకులు,మహిళలకు అవగాహన ఏర్పరచుకోవాలి. – దమ్మని రాము, ఎంపీడీఓ హుస్నాబాద్ -
ఆన్లైన్.. ఆగమాగం
సాక్షి, చొప్పదండి : మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటికీ అప్‌గ్రేడ్ అయిన చొప్పదండిలో నూతన గృహ నిర్మాణదారులకు చిక్కులు తప్పడం లేదు. పురపాలన ప్రారంభమై ఆరునెలలు దాటినా ఇప్పటికీ ఒక్క నూతన నిర్మాణానికి కూడా అనుమతి రాకపోవడం పురపాలనలో నూతన గృహ నిర్మాణదారులకు తెచ్చిన కష్టాలను తెలియజేస్తోంది. ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం పురపాలనలో ఆన్లైన్ విధానం తీసుకువచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన చొప్పదండిలోనూ దీన్ని వర్తింపజేస్తున్నారు. దీంతో నూతన గృహ నిర్మాణ ఆశావహులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఆన్లైన్లో దరఖాస్తులు గతంలో నూతన గృహ నిర్మాణదారులు పంచాయతీ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకొనేవారు. భూమిపూజ చేసుకొని ఇంటి నిర్మాణం ప్రారంభించాక కూడా పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో 2016 నుంచి ఆన్లైన్ ద్వారా నిర్మాణ అనుమతుల మంజూరు విధానం ప్రవేశపెట్టారు. నూతన నిర్మాణాలను చేపట్టేవారు లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతి వచ్చాకే నిర్మాణాలను ప్రారంభించాల్సి ఉంటుంది. నిబంధనల మేరకు నిర్మాణాలను రూపొందించాలంటే ఇండ్లు కట్టడం పలువురికి గగనంగా మారింది. ఇబ్బందిగా నిబంధనలు మున్సిపల్ నూతన చట్టంలోని నిబంధనలు చిన్న స్థలాలు కలిగిన గృహ నిర్మాణదారులకు ఇబ్బందిగా పరిణమించాయి. జీవో 168 ప్రకారం మున్సిపాలిటీల్లో ఇండ్లు నిర్మాణం చేసే వారికి పలు నిబంధనలు రూపొందించారు. దీంతో గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో లైసెన్స్డ్ సర్వేయర్ ద్వారా దరఖాస్తు చేసేందుకే రూ. పదివేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక అనుమతి వచ్చేందుకు ఫీజులు ఏ మేరకు బాదుతారో తెలియని పరిస్థితి నెలకొంది. మున్సిపల్ అధికారులు నిర్ధేశించిన ఫీజు కూడా ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. నిర్మాణదారులకు వచ్చిన మొదటి ఇబ్బంది రోడ్ల వెడల్పుతోనే. గతంలో తొమ్మిది ఫీట్ల నుంచి మొదలుకొని పన్నెండు ఫీట్ల రోడ్లనే ఎక్కువగా గ్రామస్తులు ఉపయోగించేవారు. నిర్మాణ అనుమతుల సమయంలో రోడ్లు ముప్పై అడుగులు ఉంటేనే అనుమతి ఇస్తారు. పైగా మూడు అడుగులు సెట్ బ్యాక్ కోసం కూడా వదులాల్సి ఉంటుంది. దీంతో ఉన్న స్థలమంతా రోడ్లకే పోతే తాము ఎక్కడ నిర్మాణాలు చేయాలని చిన్న చిన్న ప్లాట్లు గల యజమానులు వాపోతున్నారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఒక్క అనుమతి కూడా ఇవ్వకపోగా, దరఖాస్తులు మాత్రం అయిదు వరకు వచ్చినట్లు మున్సిపల్ అధికారులు చెబుతున్నారు. దీంతో మున్సిపాలిటీ ఏర్పడిన ఆరునెలల్లో ఒక్క అనుమతి కూడా బయటకు వెళ్లక పోవడంతో ఇండ్ల నిర్మాణాలు చేసేదెట్లా అంటూ నిర్మాణ ఆ శావహకులు లబోదిబో మంటున్నారు. రెండేళ్లుగా కొనసాగుతోంది రెండేళ్లుగా మున్సిపాలిటీల్లో ఆన్లైన్ విధానం కొనసాగుతోంది. తమకు డిజిటల్ కీ రావడానికి ఆలస్యమైంది. దరఖాస్తుల విధానం ఆన్లైన్లో ఉండటం వల్ల నిబంధనలను ఖచ్చితంగా పాటించేందుకు దోహదపడుతోంది. మున్సిపల్ చట్టం ప్రకారం మేము వ్యవహరిస్తాం. – రాజేందర్ కుమార్, కమిషనర్ -
పంచాయతీ భవనం కోసం సెల్‌టవర్ ఎక్కాడు
తంబళ్లపల్లి: తమ గ్రామానికి మంజూరైన పంచాయతీ భవనాన్ని తమ గ్రామంలో నిర్మించకుండా వేరే గ్రామంలో నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఓ టీడీపీ కార్యకర్త సెల్‌టవర్ ఎక్కాడు. ఏడు గంటలుగా అక్కడే ఉండి హల్చల్ చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లిలో గల బురుజుపల్లికి పంచాయతీ భవనం లేదు. దానిని వేరే గ్రామంలో నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు. అయితే బురుజుపల్లి పంచాయతీ అని పేరుందని, అందువల్ల ఆ భవనాన్ని ఇక్కడే నిర్మించాలని గ్రామస్థులు పంచాయతీ అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశారు. ఎవరూ స్పందించకపోగా పనులను మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ కార్యకర్త అయిన రాజశేఖర్ అనే యువకుడు మంగళవారం ఉదయం తంబల్లపల్లి తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగాడు. సాయంత్రానికి పంచాయతీ అధికారి నుంచి తాత్కాలిక నిలుపుదల ఉత్త్ర్వులు జారీ చేసినా వినకుండా టవర్‌పైనే ఉండిపోయాడు. నీళ్లు, ఆహారం స్వీకరించకుండా నిరసన కొనసాగిస్తున్నాడు. . -
రెండోసారీ..!
♦ జీతాల కోసం ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల ఆందోళన ♦ కనిగిరి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా ♦ రెండోసారీ హామీ నెరవేర్చలేదంటూ ఆగ్రహం ♦ కమిషనర్, చైర్మన్‌తో వాగ్వాదం ♦ పత్తా లేని ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు ♦ నేటి నుంచి మళ్లీ నీటి సరఫరా బంద్ ♦ జీతాలు సర్దుబాటు చేయూలంటూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం కనిగిరి: ఇచ్చిన హామీ ప్రకారం జీతాలకు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్డబ్ల్యూఎస్ కార్మికులు గురువారం కనిగిరి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధ ర్నా చేశారు. 15 నెలలుగా జీతాలివ్వకుండా అధికారులు తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులు ఆకలితో అల్లాడుతుంటే హామీలతో మోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నుంచి సాగర్‌నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్డబ్ల్యూఎస్ కార్మికులకు 15 నెలల జీతాలు సుమారు 1.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కార్మికులకు హామీలు ఇచ్చి రెండో సారి కూడా మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి సాగర్ జలాలను కార్మికులు నిలిపి వేయనున్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ట్యాంక్ వద్ద రిక్షా కార్మికులకు సరఫరా అయ్యే వాల్‌ను నిలిపివేశారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జీ బాలిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ కార్మిక సంఘం నాయకులు ప్రసాద్‌రెడ్డిలు మాట్లాడుతూ మున్సిపాలిటీ నుంచి ఆర్డబ్ల్యూఎస్ శాఖకు జమ చేయాల్సిన రూ.60 లక్షలు ఇవ్వాలని, గత నెల 24న ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత నిధులు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ కె.వి. పద్మావతి మాట్లాడుతూ మున్సిపల్ కరువు నిధులు అడ్మినిస్ట్రేషన్ శాఖలో నిలిచి ఉన్నాయని, అవి రాగానే ఇస్తామని తప్పించుకున్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ మస్తాన్‌ను కార్మికులు నిలదీశారు. తాను సొంత నిధులు ఇచ్చేందుకు కమిషనర్ హామీ ఇవ్వాలని తెలిపారు. అందుకు కమిషనర్ నిరాకరించడంతో కార్మికులు చైర్మన్‌తో వాగ్వానికి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. శుక్రవారం నుంచి సాగర్‌నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించి వెళ్లి పోయారు. కమిషనర్‌పై కలెక్టర్ ఫైర్.. ఆర్డబ్ల్యూఎస్ కార్మికుల జీతాల చెల్లింపు విషయంపై కలెక్టర్ సుజాతశర్మ కమిషనర్ పద్మావతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు డబ్బులు ఇవ్వక, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ వారు ఇవ్వక ఎవరిస్తారు.. ఏం మీరు జీతాలు తీసుకోవడం లేదా.. అంటూ మండిపడ్డారు. పన్నులు వసూలు చేయండి కార్మికులకు జీతాలు ఇవ్వండని ఆదేశించారు. స్థానిక ఏఎంసీ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. కార్మికులకు జీతాలు అందక సమ్మెకు దిగుతున్న విషయాన్ని విలేకరులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ వివరణ ఇవ్వబోతుండగా ముందు పన్నులు కట్టించండి.. కార్మికులకు జీతాలు సర్దుబాటు చేయండంటూ ఆదేశిస్తూ వెళ్లిపోయారు. -
రేషన్ రావడం లేదని అధికారుల నిర్బంధం
కొల్చారం: రేషన్ దుకాణంలో నిత్యవసర వస్తువులు ఇవ్వడం లేదంటూ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితరులను గ్రామస్తులు పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామానికి చెందిన 240 మంది లబ్ధిదారులకు నాలుగు నెలలుగా రేషన్ అందడం లేదు... అలాగే నాలుగు నెలల క్రితం ఉన్నట్టుండి లబ్ధిదారుల పేర్లు కీ రిజిస్టర్ నుంచి మాయం అయ్యాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఆ క్రమంలో ఈ రోజు సాదాబైనామల గురించి సదస్సులో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో చంద్రయ్య, టెస్కో రాష్ట్ర డెరైక్టర్ అరిగె రమేష్ గ్రామానికి వచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహంతో అధికారులను పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉంచి బయట గడియపెట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి ఆర్డీవోతో మాట్లాడారు. బుధవారం నాటికి సగం మందికి బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మిగిలిన వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. -
గ్రామపంచాయతి కార్యాలయంలో మృతదేహం
గ్రామపంచాయతి కార్యాలయం వెనుక మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లిలో సోమవారం వెలుగుచూసింది. కార్యాలయం ఆవరణలో మృతదేహం ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్య చేసి ఉంటారని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. -
పంచాయతీ కార్యాలయాలపై విజిలెన్స్ దాడులు
కాకినాడ : ఉభయ గోదావరి జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు మంగళవారం అకస్మిక దాడులు చేశారు. కాకినాడ రూరల్, అచ్చంపేట, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు పంచాయతీ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయాల రికార్డులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. అలాగే రికార్డుల్లోని చోటు చేసుకున్న పలు పొంతన లేని అంశాలపై విజిలెన్స్ ఉన్నతాధికారులు పంచాయతి అధికారులను ప్రశ్నిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ రెడ్డి ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు. ఈ సందర్భంగా సదరు అధికారి వద్ద రూ. 25 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. -
పంచాయతీ ఆఫీసులో ప్రేమ వివాహం
నార్మెట్ట (వరంగల్) : గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రేమ వివాహం జరిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా నార్మెట్ట మండలం అంక్షాపూర్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంతోష్(24), రమ్య(20)లు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు వీరి ప్రేమను అంగీకరించకపోవడంతో.. గ్రామ పెద్దలను ఆశ్రయించారు. దీంతో గ్రామ పెద్దలు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రేమ జంటకు బుధవారం వివాహం జరిపించారు. -
పంచాయతీ కార్యాలయానికి తాళం
ఇల్లందుకుంట (కరీంనగర్ జిల్లా) : మూడు నెలలుగా గ్రామంలో తాగునీరు లేకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు. కార్యాలయంలో గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులను నిర్బంధించి బయట తాళం వేశారు. ఈ సంఘటన గురువారం కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం ముస్కాన్‌పేట గ్రామంలో చోటు చేసుకుంది. విషయం తెలిసిన ఎంపీపీ ఐలయ్య సంఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్తులతో చర్చించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు కార్యాలయం తాళం తీశారు. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
- వైఎస్సార్ ఫొటో ధ్వంసం చేసి పంచాయతీ కార్యాలయంలో టీడీపీ చోటా నేత ఫొటో - సర్పంచ్‌ను కాదని తెగులు తమ్ముళ్ల వీరంగం - పోలీసులకు, డీపీవోకు సర్పంచ్ ఫిర్యాదు పెనుమూరు : పెనుమూరు పంచాయతీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగించి కనీసం వార్డు మెంబర్ కూడా కాని దివంగత టీడీపీ నేత ఫొటోను తగిలించి తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి బి.నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోందన్నారు. గత నెల 30వ తేదీ కలవగుంట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాగమ్మ మెమోరియల్ ట్రస్ట్ బోధన సామగ్రి పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎంపీపీ హరిబాబు నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రుద్రయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు సలాం, తెలుగు యువత మండల అధ్యక్షుడు కార్తీక్, పలువురు నేతలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. కార్యాలయ గోడపై ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో తొలగించి పగుల కొట్టారన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఫొటో స్థానంలో మరణించిన స్థానిక టీడీపీ నేత భాస్కరనాయుడు ఫొటో పెట్టి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారని చెప్పారు. సర్పంచ్ అనుమతి లేకుండా నిబంధనలు అతిక్రమించి వార్డు మెంబర్ కూడా కాని టీడీపీ నేత ఫొటో పెట్టి నివాళులర్పించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భాస్కర్నాయుడుపై అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకోవాలని సూచించారు. కలవగుంట సర్పంచ్ ఆమీన్ మాట్లాడుతూ శనివారం పంచాయతీ కార్యాలయానికి వచ్చి చూడగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో తొలగించి, ఆ స్థానంలో టీడీపీ నాయకుడు భాస్కర్‌నాయుడు ఫొటో ఉందన్నారు. విచారించగా తెలుగుదేశం నాయకుల సమక్షంలో తెలుగు యువత అధ్యక్షుడు కార్తీక్ తన అనుచరులతో తప్ప తాగి వైఎస్ ఫొటో తొలగించి కాలు కింద వేసి తొక్కినట్లు తెలిసిందన్నారు. ఈమేరకు పెనుమూరు ఎస్ఐ శ్రీనివాసులు, ఎంపీడీవో శివరాజు, డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు కారేటి గోవిందరెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు. -
మంత్రి సాక్షిగా ఇరువర్గాల తోపులాట
నేరడగం(మాగనూర్) : నేరడగం పునరావాసగ్రామంలో పరిహారం విషయమై మా టామాటా పెరిగి మంత్రి లక్ష్మారెడ్డి సమక్షంలోనే రెండు వర్గాలు తోపులాటకు దిగాయి. మండలంలోని సంగెంబండ ప్రా జెక్ట్ పునరావాస గ్రామాలైన ఉజ్జెల్లి, నేరడగం గ్రామాలను లక్ష్మారెడ్డి బుధవారం సందర్శించారు. ముందుగా ఉజ్జెల్లివాసు లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని తమకు వర్తింప చేయాలని కోరారు. ఇం దుకు మంత్రి స్పందిస్తూ అర్హులైన వారికి ఇళ్లు ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం నేరడగం గ్రామంలో పంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసి న సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సమయంలో గ్రామస్థులు మాట్లాడు తూ తమ గ్రామంలో 746 ఇళ్లకు పరి హారం ఇచ్చేందుకు అధికారులు జాబి తాను తయారు చేశారన్నారు. అందులో పాతవాటి స్థానంలో 110 ఇళ్లను కొత్తగా నిర్మించుకున్నారని, వాటికి పరిహారం ఇప్పించాలని కోరారు. అందుకు మంత్రి స్పందిస్తూ పాత ఇళ్ల స్థానంలో నిర్మిస్తే వాటికి పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తానన్నారు. అదే సమయంలో ఓ వర్గం వారు కొత్త ఇళ్లను టేకుతో నిర్మించారని, గ్రామంలో లేని వారు, కొందరి బంధువులు అక్రమంగా ఇళ్లను నిర్మించారని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నెట్టుకున్నారు. పోలీ సుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఇరు వర్గాలు గొడవపడడం సరికాదని, ఐక్యతతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని హితవు పలికారు. మంత్రితోపాటు టీఆర్ఎస్ మక్తల్ నియోజకవర్గ ఇన్చార్జి మల్లప్ప, ఆశిరెడ్డి, సర్పంచులు రాజు, ఉసెనప్ప తదితరులు ఉన్నారు. -
ఈ కూలితో ఏం తినాలి?
గొలుగొండ : ‘ఉపాధి కూలికెళ్తే గిట్టుబాటు కాదు. ఉదయం నుంచి పని చేసినా కూలి అందలేదు. అలాంటప్పు డు పనికెళ్లి ఏం తినాలి?, ఎలా బతకాలి’.. అంటూ చోద్యం గ్రామానికి చెందిన వందలాది మంది కూలీలు శుక్రవారం రోడ్డెకాకరు. పనులకు వెళ్లకుండా ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించారు. చోద్యం గ్రామంలో 430 మంది కూలీలు ఉపాధి పనులకు రోజూ వెళ్తున్నారు. రెండు వారాలుగా పనికెళ్తున్నా కూలి సొమ్ము అందలేదు. డబ్బులు అందకపోవడంతో రెండ్రోజులుగా కూలీలు ఇబ్బంది పడ్డారు. అధికారులను నిలదీస్తే డబ్బులొచ్చాయి.. తీసుకోండన్నారు. తీరా వెళ్తే ఒక్కొక్కరికి రోజు కూలి రూ.40 నుంచి రూ.60కి మించలేదు. ఎంత పనిచేసినా కూలి డబ్బులు రాకపోవడంతో కూలీంతా ఆవేదన చెందారు. అధికారులు కొలతలు తప్పుగా గుర్తించడం వల్లే కూలి డబ్బులు తక్కువగా వచ్చాయని, మళ్లీ కొలతలు తీయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప పనులకు వెళ్లమన్నారు. ఈ పంచాయతీలో ఏడాదిగా పనులు పూర్తిస్థాయిలో చేస్తున్నా సక్రమంగా కూలి ఇవ్వడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే మండల కేంద్రం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం నేత సుర్ల బాబ్జి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పంచాయతీ కార్యాలయంలో బైఠాయింపు అనకాపల్లి: తమకు కేటాయించిన ఉపాధి పనులను అర్ధాంతరంగా నిలిపి వేసినందుకు నిరసనగా సత్యనారాయణ పురం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు శుక్రవారం బైఠాయించారు. తమ పనులను ఎవరు నిలిపివేశారని సర్పంచ్‌ను నిలదీశారు. సుమారు 400 మంది కూలీలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇద్దరు గ్రామస్తులు, ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కూలీలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. -
ఏసీబీ వలలో పంచాయతీ అధికారి
విజయవాడ టౌన్: విజయవాడలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పంచాయతీ అధికారి ఎ. నాగరాజువర్మ బుధవారం అధికారులకు చిక్కాడు. నిందితుడు రూ. 2లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
చనిపోరుున వారికీ ‘అభయహస్తం’ !
పర్వతగిరి : అభయహస్తం జాబితాలో చనిపోరుునవారికీ చోటుదక్కింది. అదే సమయంలో అర్హులకు మొండి చేయే మిగిలింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి గ్రామపంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. ఆరు నెలల తర్వాత అభయహస్తం పింఛన్ల డబ్బులు విడుదల కాగా... పంచాయతీ కార్యాలయంలో అధికారులు శనివారం ఆ పథకం లబ్ధిదారుల జాబితా ప్రదర్శించారు. గ్రామంలో మొత్తం 55 మంది లబ్ధిదారులు ఉండగా... ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఆరు నెలల డబ్బులు అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే అభయహస్తం లబ్ధిదారుల జాబితా చూసిన స్థానిక సర్పంచ్ గోనె విజయలక్ష్మి, గ్రామస్తులు అవాక్కయ్యారు. అర్హులైన వారిని పక్కనబెట్టి ఐదేళ్ల క్రితం చనిపోయిన తొమ్మిది మందికి డబ్బులు మంజూరు చేయడంపై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్కెర్ల వీరమ్మ, చెన్నూరి కట్టమ్మ, తోపుచర్ల అనసూర్య, తీగల సాయమ్మ, బాసాని సోమక్క, కొప్పు చంద్రమ్మ, ఉడుగుల కొంరమ్మ, చీదురు లక్ష్మి, ఎండీ.అంకూస్ ఎప్పుడో చనిపోయూరని, వారికి అభయహస్తం జాబితాలో చోటుకల్పించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. అర్హులై ఉండి జాబితాలో పేర్లు రాని వారి వివరాలను ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. అనంతరం ఆ తొమ్మిది మంది పోను మిగిలిన లబ్ధిదారులకు ఆరు నెలల పింఛన్ డబ్బులు ఒక్కొక్కరికి రూ.3 వేల చొప్పున అందజేశారు. -
మంత్రాల నెపంతో ఇద్దరు అరెస్ట్
మెదక్: మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని కోనేయిపల్లి(పీటీ) గ్రామంలో మంత్రాలతో పిల్లల ప్రాణాలను తీస్తున్నారనే అనుమానంతో ఇద్దరిని గ్రామస్తులు గ్రామపంచాయతీ ఆఫీసులో బంధించారు. వివరాలు...కుమ్మరి సత్తయ్య, మల్లె యాదగిరి అనే ఇద్దరు గ్రామానికి దగ్గరలోని అడవిలో నగ్నంగా నిలబడి మంత్రాలు ఉచ్ఛరిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది వారిని గుర్తించారు. దీంతో వారిని పట్టుకుని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు కోనేయిపల్లి గ్రామానికి చేరుకుని ఆ ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని, కోనేయపల్లిలోనే వారిని చంపేయాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలతో మరికొంత మంది పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని వారిద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. (తూప్రాన్) -
నీళ్ల కోసం పంచాయతీ కార్యాలయం ఎదుట ధర్నా
దుబ్బాక : ఏడాది నుంచి దోసెడు నీళ్లు రావడం లేదంటూ శనివారం దుబ్బాక నగర పంచాయతీ కార్యాలయం ఎదుట నాల్గొవ వార్డుకు చెందిన మహిళలు ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ వార్డులో నీటి గోస ఉందని చాలసార్లు నగర పంచాయతీ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గల్లీలోకి నీరు రాకున్నా నల్లా బిల్లులు మాత్రం వసూలు చేస్తున్నారని, బిల్లులు చెల్లించని వాళ్లవి నల్లా కనెక్షన్లను తొలగిస్తున్నారని, నీరే సరిగా సరఫరా చేయకున్నా బిల్లులెందుకు వసూలు చేస్తున్నారని నగర పంచాయతీ సిబ్బందిని నిలదీశారు. నల్లాల ద్వారా నీటి సరఫరాను పునరుద్ధరించకుంటే నగర పంచాయతీ కార్యాలయాన్ని దిగ్భందిస్తామని మహిళలు హెచ్చరించారు. -
ఆగ్రహం.. అనుగ్రహం
దామరచర్ల : రాష్ట్ర ప్రభుత్వం దామరచర్ల మండలంలో నిర్మించతలపెట్టిన థర్మల్ విద్యుత్ పవర్‌ప్లాంట్ నిర్మాణానికి సేకరించిన అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు శనివారం చేపట్టిన గ్రామసభల్లో తొలుత ఆగ్రహించిన ప్రజలు ఆ తర్వాత అనుగ్రహించారు. 7,500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల పవర్ ప్లాంట్ నిర్మాణానికి గాను మండలంలోని ముదిమాణిక్యం, వీర్లపాలెం, తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, తిమ్మాపురం, కొండ్రపోల్, కేజేరెడ్డి కాలనీ, వాచ్యాతండా, బాలాజీనగర్ గ్రామ పంచాయతీల పరిధిలో సుమారు 10,500 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ భూమిని అటవీయేతర భూమిగా మార్చేందుకు గ్రామ పంచాయతీల తీర్మానం కోసం గ్రామసభలు నిర్వహించారు. ఐదు గ్రామాల్లో ఆగ్రహం.. అధికారులు గ్రామసభలు నిర్వహించేందుకు తమ గ్రామాలకు వస్తున్నారని తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున పంచాయతీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. తాళ్లవీరప్పగూడెం, నర్సాపురం, కల్లెపల్లి, బాలాజీనగర్, ముదిమాణిక్యం, కేజేరెడ్డి కాలనీ గ్రామాల్లో తొలుత అగ్రహం వ్యక్తం చేసి గ్రామసభలను బహిష్కరిం చారు.ఉన్న ఫలంగా తాముసాగు చేసుకున్న భూములను ప్రభుత్వం ఎలాంటి హామీలు లేకుండా లాగేసుకుంటే ఉపాధి కోల్పోయి మా కుటుంబాలు వీధిన పడతాయని, గ్రామ పంచాయతీ తీర్మానించవద్దని, ఎవరు కూడా పంచాయతీ ఆవరణలో అడుగుపెట్టవద్దని హెచ్చరించారు. దీంతో తాళ్లవీరప్పగూడెం, కల్లెపల్లి గ్రామాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కల్లెపల్లి గ్రామంలో రెండు వర్గాలుగా ఏర్పడి అనుకూలంగా, వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తోపులాట వరకు పరిస్థితి రావడంతో సీఐ జోక్యం చేసుకొని అడ్డుకున్నారు. బాలాజీనగర్‌లో గ్రామసభ తీర్మానానికి ఎవరూ అంగీకరించలేదు. గాంధీనగ రం గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. కేజేరెడ్డి కాలనీలో బహిష్కరించారు. ముదిమాణిక్యం గ్రామంలో క్వారీ కార్మికులు భూములు కోల్పోతే ఉపాధి పోతుందని, పరిశ్రమ ఏర్పడితే కాలుష్యంతో పొలాల్లో పంటలు పండకుండా పోతాయని గ్రామసభను అడ్డుకున్నారు. కాగా ముది మాణిక్యం, తాళ్లవీరప్పగూడెం గ్రామ సభలకు జేసీ సత్యనారాయణ హాజరై ప్రజల సందేహాలను నివృత్తి చేయడంతో తీర్మానం ఆమోదించారు. కేజేరెడ్డి కాలనీ, బాలాజీనగర్, కల్లెపల్లి గ్రామాల్లో అధికారులు నచ్చ జెప్పడంలో గ్రామస్తులు చివరికి ఆమోదం తెలిపారు. నాలుగు గ్రామాల్లో ప్రశాంతంగా.. వీర్లపాలెం,కొండ్రపోల్, వాచ్యతండా, తిమ్మాపురం గ్రామాల్లో ప్రజలు గ్రామసభలకు హాజరై ప్రశాంత వాతావరణంలో పంచాయతీయ తీర్మానం సంతకాలు చేసి థర్మల్ విద్యుత్ ప్లాంట్ కావాలని కోరారు. భూములు కోల్పోయిన వారికి పరిహారం, ఉ ద్యోగావకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. భారీగా పోలీసుల మోహరింపు.. గ్రామసభలు నిర్వహించిన 10 గ్రామాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మిర్యాలగూడ, సూర్యాపేట డీఎస్పీలు సందీ ప్ గోనె, బషీర్ ఆధ్వర్యంలో 20 మంది సీఐ లు, 30 మంది ఎస్ఐలు, సుమారు 400 మం ది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గ్రామసభల్లో పాల్గొన్న అధికారులు.. వీర్లపాలెంలో మిర్యాలగూడ ఆర్డీఓ బి. కిషన్‌రావు, తాళ్లవీరప్పగూడెంలో భువనగిరి ఆర్డీఓ ఎన్.మధుసూదన్, ముదిమాణిక్యంలో ఎస్డీసీ ఏఎమ్మార్పీ చంద్రశేఖర్‌రెడ్డి, తిమ్మాపురంలో సూర్యాపేట ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, కల్లెపల్లిలో జెడ్పీ సీఈఓ దామోదర్‌రెడ్డి, బాలాజీ నగర్లో ఏఎమ్మార్పీ ఎస్డీసీ సూర్యాపేట ఎ.భాస్కర్‌రావు, నర్సాపురంలో శ్రీనివాసులు,. నల్లగొండ ఎస్డీసీ, కేఆర్ఆర్సీ, కేజేరెడ్డి కాలనీలో దేవరకొండ ఆర్డీఓ జి. రవి, కొండ్రపోల్‌లో నల్లగొండ ఆర్డీఓ ఈ. వెంకటాచారి, వాచ్యతండాలో ఏఎమ్మార్పీ స్పెషల్ కలెక్టర్ పీఏ ప్రభాకర శ్రీనివాస్‌తోపాటు 10 మంది తహసీల్దార్లు పాల్గొన్నారు. అపోహలకు పోవద్దు-జేసీ ప్రజలు ఎవరో చెప్పిన మాటలు విని అపోహలకు పోవద్దని జేసీ సత్యనారాయణ కోరా రు. తాళ్లవీరప్పగూడెం పంచాయతీ కార్యాల యంలో ఆయన మాట్లాడారు. మండలంలో ని ప్రైవేటు పరిశ్రమలతో ప్రభుత్వం నెల కొల్పే పరిశ్రమను పోల్చుకోవద్దని సూచించా రు. బాధితులను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు.ప్రజామోదం తర్వాతే పనులు చేపడుతామన్నారు. మండలంలోని పది గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ ముగిసిందన్నారు. -
వామ్మో.. ఇవేం బిల్లులు
పెద్దేముల్: గ్రామ పంచాయతీ కార్యాలయాలకు కరెంట్ బిల్లులు రూ.లక్షల్లో వస్తుండడంతో సర్పంచులు కంగుతింటున్నారు. యేడాదికి రూ. ఐదువేలు ఆదాయం రాని పంచాయతీలకు రూ.లక్షల్లో బిల్లులు వస్తే ఎలా చెల్లించాలని పలు గ్రామాల సర్పంచులు వాపోతున్నారు. మూడు రోజులుగా మండలంలోని సర్పంచులకు విద్యుత్ అధికారులు కరెంట్ బిల్లులు, నోటీసులు పంపిస్తున్నారు. మండలంలో మొత్తం 25 గ్రామ పంచాయతీలు, 27 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. పంచాయతీ కార్యాలయం, వీధిదీపాలు, తాగునీరు సరఫరా చేసేందుకు వాడుకున్న కరెంట్‌కు బిల్లులు చెల్లించాలని విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. నోటీసులు చూసిన సర్పంచులు అవాక్కవుతున్నారు. ఎన్నడూ లేని విధంగా పంచాయతీలకు కరెంట్ బిల్లులు రావడం ఏమిటని వారు ఆశ్చర్యపోతున్నారు. పంచాయతీ ఏర్పడిననాటి నుంచి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని కచ్చితంగా చెల్లించాలని అధికారులు చెబుతున్నారు. పంచాయతీ కార్యాలయాల్లో విద్యుత్ మీటర్లు లేవు, బిల్లులు ఎలా వేస్తున్నారో చెప్పాలని సర్పంచులు కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ రావడం లేదు.. రూ.లక్షలకు లక్షలు బిల్లులంటే ఎట్లా కట్టేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.