రెండోసారీ..!
♦ జీతాల కోసం ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికుల ఆందోళన
♦ కనిగిరి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా
♦ రెండోసారీ హామీ నెరవేర్చలేదంటూ ఆగ్రహం
♦ కమిషనర్, చైర్మన్‌తో వాగ్వాదం
♦ పత్తా లేని ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు
♦ నేటి నుంచి మళ్లీ నీటి సరఫరా బంద్
♦ జీతాలు సర్దుబాటు చేయూలంటూ అధికారులపై కలెక్టర్ ఆగ్రహం
కనిగిరి: ఇచ్చిన హామీ ప్రకారం జీతాలకు నగదు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికులు గురువారం కనిగిరి నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధ ర్నా చేశారు. 15 నెలలుగా జీతాలివ్వకుండా అధికారులు తమ జీవితాలతో ఆటలాడుకుంటున్నారని మండిపడ్డారు. కార్మికులు ఆకలితో అల్లాడుతుంటే హామీలతో మోగిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం నుంచి సాగర్‌నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికులకు 15 నెలల జీతాలు సుమారు 1.50 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కార్మికులకు హామీలు ఇచ్చి రెండో సారి కూడా మోసం చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం నుంచి సాగర్ జలాలను కార్మికులు నిలిపి వేయనున్నారు. ఈ మేరకు ఏఐటీయూసీ నాయకులు, కార్మిక సంఘ నాయకులు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం ట్యాంక్ వద్ద రిక్షా కార్మికులకు సరఫరా అయ్యే వాల్‌ను నిలిపివేశారు.
ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి జీ బాలిరెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ కార్మిక సంఘం నాయకులు ప్రసాద్‌రెడ్డిలు మాట్లాడుతూ మున్సిపాలిటీ నుంచి ఆర్‌డబ్ల్యూఎస్ శాఖకు జమ చేయాల్సిన రూ.60 లక్షలు ఇవ్వాలని, గత నెల 24న ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడత నిధులు రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో కమిషనర్ కె.వి. పద్మావతి మాట్లాడుతూ మున్సిపల్ కరువు నిధులు అడ్మినిస్ట్రేషన్ శాఖలో నిలిచి ఉన్నాయని, అవి రాగానే ఇస్తామని తప్పించుకున్నారు. దీనిపై మున్సిపల్ చైర్మన్ మస్తాన్‌ను కార్మికులు నిలదీశారు. తాను సొంత నిధులు ఇచ్చేందుకు కమిషనర్ హామీ ఇవ్వాలని తెలిపారు. అందుకు కమిషనర్ నిరాకరించడంతో కార్మికులు చైర్మన్‌తో వాగ్వానికి దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో సమస్య సద్దుమణిగింది. శుక్రవారం నుంచి సాగర్‌నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించి వెళ్లి పోయారు.
కమిషనర్‌పై కలెక్టర్ ఫైర్..
ఆర్‌డబ్ల్యూఎస్ కార్మికుల జీతాల చెల్లింపు విషయంపై కలెక్టర్ సుజాతశర్మ కమిషనర్ పద్మావతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు డబ్బులు ఇవ్వక, ఆర్‌డబ్ల్యూఎస్‌శాఖ వారు ఇవ్వక ఎవరిస్తారు.. ఏం మీరు జీతాలు తీసుకోవడం లేదా.. అంటూ మండిపడ్డారు. పన్నులు వసూలు చేయండి కార్మికులకు జీతాలు ఇవ్వండని ఆదేశించారు. స్థానిక ఏఎంసీ గెస్ట్ హౌస్‌లో కలెక్టర్ ఎమ్మెల్యే, ప్రజా ప్రతినిధులు, అధికారులతో మాట్లాడారు. కార్మికులకు జీతాలు అందక సమ్మెకు దిగుతున్న విషయాన్ని విలేకరులు, ప్రజాప్రతినిధులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిషనర్ వివరణ ఇవ్వబోతుండగా ముందు పన్నులు కట్టించండి.. కార్మికులకు జీతాలు సర్దుబాటు చేయండంటూ ఆదేశిస్తూ వెళ్లిపోయారు.