విజయవాడ, సాక్షి: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏపీ పర్యటనలో నిరసన సెగ తగిలింది. అంబేద్కర్‌పై షా చేసిన వ్యాఖ్యల ఆధారంగా ‘‘ గో బ్యాక్ అమిత్ షా’’ నినాదాలతో నగరంలో ఆదివారం వామపక్షాలు నిరసన చేపట్టాయి. అంబేద్కర్‌ని అవమాన పరిచిన అమిత్ షా రాజీనామా చేయాలని, ఆయన వెంటనే వెనక్కి వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేశారు వాళ్లు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రధాని మోది అమిత్ షాకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య. రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడికి మీరు ఇచ్చిన గౌరవం ఇదేనా. అంబేద్కర్ ను అవమానించిన షా.. తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని అన్నారు.
‘‘పార్లమెంట్ వేదికగా నిండు సభలో అవమానించారు. పైగా ఆయన తన వ్యాఖ్యల్ని సమర్ధించుకుంటున్నారు. అమిత్ షా ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలి’’ అని సీపీఎం నేత ఉమా మహేశ్వరరావు అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఇతర వామపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు.
కేంద్ర సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి: అమిత్ షా
నగరంలోని నోవాటెల్ హోటల్‌లో ఏపీ బీజేపీ (BJP) నేతలతో ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా (Amit shah) సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు ఈ భేటీ కొనసాగింది. కీలక అంశాలపై రాష్ట్ర భాజపా నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు.
ఏపీకి కేంద్రం అందిస్తున్న సాయం, రాష్ట్ర అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాష్ట్రంలో భాజపా బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ‘హైందవ శంఖారావం’ సభ విజయం పట్ల పార్టీ, వీహెచ్‌పీ నేతలకు అమిత్‌షా అభినందనలు తెలిపారు. తిరుమల తొక్కిసలాట ఘటనపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. దీనిపై కేంద్రహోంశాఖ దృష్టిపెట్టిందని అమిత్‌షా చెప్పారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేతలు ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్ వేడుకల్లో షా..
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) 20వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకల్లో కేంద్ర మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కృష్ణా జిల్లా కొండపావులూరులోని 10వ NDRF బెటాలియన్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ (NIDM) సౌత్ క్యాంపస్‌ను అమిత్ షా ప్రారంభించారు. అనంతరం ముగ్గురు మొక్కలు నాటారు. అంతకు ముందు..
నగరంలోని నోవాటెల్‌లో అమిత్ షాతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పది నిమిషాలపాటు భేటీ అయ్యారు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసి కొండపావులూరు చేరుకున్నారు. అంతకంటే ముందే పవన్ అక్కడికి చేరుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment