సాక్షి, విజయవాడ: అంబేద్కర్ విగ్రహంపై దాడిని దళిత సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనం దగ్గర దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. అంబేద్కర్ వాదులు నల్ల రిబ్బన్లతో నిరసన చేపట్టారు. గత రాత్రి జరిగిన దుశ్చర్య అంబేద్కర్ మహనీయుడి పై జరిగిన దాడిగానే చూస్తాం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వం చేయించిన దాడేనని.. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పరాకాష్టకు టీడీపీ దాడులు: మల్లాది విష్ణు
అంబేద్కర్ విగ్రహంపై దాడిని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంబేద్కర్ మాన్యుమెంట్‌పై వైఎస్ జగన్ పేరును తొలగించిన ప్రాంతాన్ని నేతలు పరిశీలించారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైఎస్సార్‌సీపీ నేతలు దేవినేని అవినాష్, పోతిన మహేష్ తదితరులు ఉన్నారు. టీడీపీ దాడులు పరాకాష్టకు చేరాయని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అంబేద్కర్‌పై దాడి హేయమైన చర్య అన్నారు.
ఏపీలో రెడ్‌బుక్ రాజ్యాంగం: పుష్పశ్రీవాణి
పార్వతీపురం మన్యం జిల్లా: డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడిని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన కూటమి నేతలను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ‘‘కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులు పరాకాష్టకు చేరాయి. అంబేద్కర్ విగ్రహం పై దాడి చేయడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగ మాత్రం అమల్లో ఉంటుందని అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉండదని చెప్పినట్టుగా వీళ్లు తీరు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ రూ. 440 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి 9 గంటల సమయంలో అధికారులు, పోలీసులు సమక్షంలో అంబేద్కర్ విగ్రహం పై దాడి జరిగిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది’’ అని పుష్పశ్రీవాణి ప్రశ్నించారు.
విజయవాడ నడిబొడ్డున రాష్ట్రానికి తలమానికంగా ఉన్న అంబేద్కర్ విగ్రహంపై తెలుగుదేశం మూకలు ఉన్మాదంతో పేట్రేగిపోవడం దేశవ్యాప్తంగా యావత్ దళిత సమాజాన్ని నివ్వెరపోయేలా చేసింది. స్వయంగా ప్రభుత్వమే పూనుకుని రాజ్యాంగ నిర్మాతపై దాడికి ఉన్మత్త మూకలను ప్రేరేపించడం దేశచరిత్రలో కనీవినీ ఎరుగని దారుణం.
గురువారం రాత్రి కుట్రపూరితంగా అంబేడ్కర్ మహాశిల్పం చుట్టుపక్కల విద్యుత్ సరఫరా నిలిపివేయించి, సిబ్బందిని బయటకు తరలించి.. తెలుగుదేశం మూకలు భీంరావ్ అంబేద్కర్ విగ్రహాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి తెగబడ్డాయి.
రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన కొందరు అధికారులు, పోలీసుల సమక్షంలో ఈ సామాజిక న్యాయ మహాశిల్పాన్ని ధ్వంసం చేసేందుకు బరితెగించారు. వీరి మాటలను బట్టిచూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ ప్రోద్బలంతోనే ఎంపిక చేసిన కొందరు అధికారుల సమక్షంలో ఇదంతా జరిగినట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment