సాక్షి, గట్టు (గద్వాల): పంచాయతీకి అత్యంత కీలకమైన రివిజన్ రిజిస్టర్ గట్టు పంచాయతీలో మాయం చేశారు. పంచాయతీలో ఎన్ని గృహాలు ఉన్నాయి.. ఖాళీ స్థలాలు.. వ్యాపార దుకాణాలు ఇలా అన్ని రకాల వాటికి సంబంధించిన అత్యంత కీలమైనది రివిజన్ రిజిస్టర్. ప్రస్తుతం ఈ రిజిస్టర్ కనిపించడం లేదు. గతంలో ఇక్కడ పని చేసి, ఇదే మండలంలో వేరే పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శికి, ప్రజాప్రతినిధి భర్తకు మధ్య పంచాయతీ నిధుల వాటాల పంపకాల్లో తేడాల కారణంగా ఓ నేత రివిజన్ రికార్డులను మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు పంచాయతీ నిధులకు సంబంధించిన జమ, ఖర్చుల రికార్డులు సైతం పంచాయతీలో కనిపించకుండా చేశారు.
2017 నుంచి వసూలు చేసిన ఇంటి పన్నులు ఎక్కడ జమ చేశారో తెలియని పరిస్థితి నెలకొంది. గతంలో ఇక్కడ పనిచేసిన పంచాయతీ కార్యదర్శులు వారి హ యాంలో విలువైన ఖాళీ స్థలాలకు సంబంధించి పంచాయతీ రికార్డులో నమోదు చేసి, పాత తేదీల్లో పొజీషన్ సర్టిఫికెట్లను జారీ చేశారు. తాజాగా గ్రామ పంచాయతీలో చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో పంచాయతీ స్థలాలను చదును చేస్తుండటంతో ఆయా అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
రికార్డులు అప్పగించలే..
గట్టు పంచాయతీకి సంబంధించిన రివిజన్ రిజిస్టర్‌తోపాటు ఇతర రికార్డులను అప్పగించని వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి కృష్ణ గట్టు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం గట్టు పర్యటనకు వచ్చిన కలెక్టర్ శశాంక దృష్టికి గట్టు–1 ఎంపీటీసీ సభ్యురాలు మహేశ్వరి భర్త రామునాయుడు, మరికొందరు యువకులు రివిజన్ రిజిస్టర్ లేని విషయాన్ని తీసుకువచ్చారు. దీంతో గతంలో ఇక్కడ పనిచేసి వెళ్లిన ఆరుగురు పంచాయతీ కార్యదర్శులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించిన తరుణంలో డీపీఓ గట్టు పోలీస్‌స్టేషన్‌లో పంచాయతీ రికార్డులను అప్పగించని వారిపై ఫిర్యాదు చేశారు. కార్యదర్శులు రికార్డులతోపాటు పంచాయతీ నిధులు సైతం పెద్దఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రూ.40 లక్షలకు రికార్డులేవీ..?
గట్టు పంచాయతీలో 13, 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40,56,656లకు సంబంధించి ఎలాంటి రికార్డులు లేకుండానే డ్రా చేసుకున్న వ్యవహారంపై 2017లో జిల్లా పంచాయతీ అధికారి అప్పటి సర్పంచ్‌కు షోకాజ్ నోటీస్ జారీ చేశారు. 2018లో పంచాయతీ నిధులు రూ.1,35,764 ఎలాంటి పనులు లేకుండా పంచాయతీ కార్యదర్శి, అప్పటి సర్పంచ్ స్వాహా చేసినట్లు అప్పట్లో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై గట్టు– 2 ఎంపీటీసీ సభ్యురాలు నాగవేణి, వార్డు సభ్యులు కలిసి విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment