సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జోగుళాంబ గద్వాల జిల్లాలో గట్టు (నల సోమనాద్రి) ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ పరిహారం పంపిణీలో భారీ గోల్‌మాల్ చోటుచేసుకుంది. ఇటు రికార్డులు లేకున్నా అటు పొజిషన్‌లో లేకున్నా.. పలువురికి పరిహారం చెల్లించినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ బాగోతంలో రూ.3.74కోట్లు దుర్వినియోగం కావడం కలకలం రేపుతోంది.
అసలు ఏం జరిగిందంటే..
కరువు పీడిత ప్రాంతమైన జోగుళాంబ గద్వాల జిల్లాలోని గట్టు, కేటీదొడ్డి, ధరూర్, మల్దకల్ మండలాల్లోని 33వేల ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు గట్టు ఎత్తిపోతల పథకానికి అంకురార్పణ జరిగింది. ఈ మేరకు కుచ్చినెర్ల గ్రామ శివారులో రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రిజర్వాయర్, కట్ట నిర్మాణంలో మొత్తం 955.45 ఎకరాలు ముంపునకు గురవుతున్నట్లు అంచనా వేశారు. ఇందులో 574 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేల్చారు.
ముంపు ప్రాంతానికి సంబంధించి 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.80లక్షల పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో భూములు కోల్పోతున్న వారి పేర్లు, వారికి ఎంతెంత భూమి ఉంది.. ప్రభుత్వ భూమిలో పొజిషన్‌లో ఉన్న వారు ఎంతమంది.. వంటి వివరాలు సేకరించి ఈ ఏడాది ఏప్రిల్‌లో 155మందితో కూడిన జాబితాను కుచ్చినెర్ల గ్రామపంచాయతీలో అధికారులు ప్రదర్శించారు. నోటీసులు అందజేసి.. ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
ఆ తర్వాత మారిన సీన్..
ఇంతవరకు బాగానే ఉన్నా.. అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల జోక్యంతో అక్రమా లకు తెరలేచింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్ట్‌లో ముంపునకు గురవుతున్న ప్రభుత్వ భూము లకు సంబంధించి పట్టాలు లేకున్నా, పొజిషన్‌లో ఉంటే సరిపోతుందని అధికారులు చెప్పడాన్ని అక్రమా ర్కులు అదునుగా తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో పట్టా లేనప్పటికీ, పొజిషన్‌లో లేకున్నప్పటికీ మరో 17మందిని పొజిషన్‌లో ఉన్నట్లు చూపిస్తూ.. వారి పేర్లను పరిహారం జాబితాలో చొప్పించారు.
ఇందకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలోని కొందరు సిబ్బంది, సర్వేయర్లు అండదండలు అందించినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఇలా 17 మందికి సంబంధించి రూ.3.76కోట్లు దండుకున్నట్లు సమాచారం. బ్యాంకులో పరిహారం డబ్బులు పడిన తర్వాత ఆ 17మంది నుంచి సదరు నేతలు రికవరీ కూడా చేసుకున్నారని అంటున్నారు. అయితే ఇలా 17మందిని అడ్డుపెట్టు కుని అధికారపార్టీ నేతలు రూ.కోట్లు దండుకున్న విషయం ఓ ముఖ్య నేత దృష్టికి రాగా ఆయన సీరియస్ అయినట్టు తెలిసింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా విషయం రచ్చ కాకుండా సెటిల్ చేసుకోవాలని సదరు ముఖ్యనేత క్లాస్ పీకినట్టు సమాచారం.
విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం
17 మందికి సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ఫిర్యాదు రాలేదు. వివరాలు సేకరించి క్షేత్ర స్థాయిలో మరోసారి విచారణ చేపడతాం. అక్రమాలు నిజమని రుజువైతే తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
– వల్లూరు క్రాంతి, కలెక్టర్, జోగుళాంబ గద్వాల.
ఇది కూడా చదవండి: బఫర్ జోన్‌లో ఎలా నిర్మిస్తారు?
Comments
Please login to add a commentAdd a comment