వైద్యంపై వివాదం: కాన్పు కోసం వెళ్తే.. కాదుపొమ్మన్నారు
గద్వాల, న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం జరిగిందని చెబుతున్న ఓ సంఘటన వివాదస్పదమైంది. కాన్పు కోసం వెళితే వివక్షతో వైద్య సేవలను నిరాకరించారని బాధితులు పేర్కొనగా.. వారు ఆస్పత్రికే రాలేదని అధికారులు చెబుతున్నారు. బాధితుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అయిజ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, తిరుమలేష్ భార్యాభర్తలు. నిండు గర్భిణీ అయిన గోవిందమ్మ భర్తతో కలిసి సోమవారం ఆటోలో కర్నూలులోని సర్వజన ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అక్కడి సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోవడానికి నిరాకరించారు.
‘తెలంగాణ వారికి మేం వైద్యం చేయం. మీరు మీ ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లండి’అని పంపించారని గోవిం దమ్మ భర్త తిరుమలేష్ చెప్పాడు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది కాళ్లావేళ్ల్లా పడినా కనికరించలేదని వాపోయారు. అనంతరం తాము అక్కడి నుంచి ప్యాసింజర్ రైలులో తిరిగి గద్వాలకు సాయంత్రం చేరుకున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిలో గోవిందమ్మ వైద్యసాయం పొందుతోంది. ఈ విషయం ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసిన స్థానిక న్యాయవాదులు చంద్రమోహన్, మౌలా, రమేష్ తదితరులు ఆస్పత్రికి చేరుకుని కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరును ఖండిం చారు. ఈ ఘటనపై కర్నూలు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉమామహేశ్వర్‌ను వివరణ కోరగా..గోవిందమ్మ పేరుతో సోమవారం గైనిక్ వార్డుకు ఎవరూ రాలేదని, ఓపీలో కూడా పేరు నమోదు కాలేదని వివరించారు. ఈ విషయమై అవసరమైతే మంగళవారం విచారణ చేయిస్తామని అన్నారు.