క్యాట్‌ఫిష్‌పై టాస్క్‌ఫోర్స్‌..! | Task Force On Cat Fish Cultivation In Mahabubnagar | Sakshi
Sakshi News home page

క్యాట్‌ఫిష్‌పై టాస్క్‌ఫోర్స్‌..!

Published Fri, Oct 18 2019 7:38 AM | Last Updated on Fri, Oct 18 2019 7:39 AM

Task Force On Cat Fish Cultivation In Mahabubnagar - Sakshi

ఖమ్మంపాడులో గుర్తించిన క్యాట్‌ఫిష్‌ను భూమిలో పాతిపెడుతోన్న అధికారులు

సాక్షి , మహబూబ్‌నగర్‌: నిషేధిత క్యాట్‌ఫిష్‌ సాగుపై టాస్క్‌ఫోర్స్‌ ఉక్కుపాదం మోపుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో విచ్చలవిడిగా సాగవుతోన్న ఈ ప్రాణాంతక క్యాట్‌ఫిష్‌ చెరువులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు కొరడా ఝుళిపిస్తున్నాయి. ఇన్నాళ్లూ అటువైపు కన్నెత్తి చూడని సంబంధిత అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతోన్న నేపథ్యంలో నేరుగా రంగంలో దిగిన జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ అపూర్వరావు ఈ నెల 10న పోలీసులు, రెవెన్యూ, మత్స్యశాఖ సిబ్బందితో టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని ఏర్పాటు చేశారు.

మరుసటి రోజే రంగంలో దిగిన టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది గద్వాల నియోజకవర్గ పరిధిలోని ధరూర్, అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఇటిక్యాల, అయిజ మండలాల్లో సాగవుతోన్న క్యాట్‌ఫిష్‌ చెరువులపై దాడులు నిర్వహించారు. సుమారు 2 క్వింటాళ్ల క్యాట్‌ఫిష్‌ చేపపిల్లలను గుర్తించి.. వాటిని రసాయనాలతో చంపేశారు. తర్వాత భూమిలో పాతిపెట్టారు.

దీంతో ఇన్నాళ్లూ యథేచ్ఛగా సాగు చేస్తున్న క్యాట్‌ఫిష్‌ నిర్వాహకుల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. ఇప్పటికే తాము సాగు చేస్తోన్న చేపలు టాస్క్‌ఫోర్స్‌ కంటబడకుండా వాటిని రక్షించే పనిలో పడ్డారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు కలిగిన సాగు కావడంతో వాటిని కాపాడుకునేందుకురాజకీయ నేతలనూ ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన క్యాట్‌ఫిష్‌ జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో సాగవుతున్నా మత్స్యశాఖఅధికారుల దృష్టికి రాకపోవడం గమ నార్హం. తాజాగా టాస్క్‌ఫోర్స్‌దాడులు గద్వాలలో చర్చనీయాంశంగా మారాయి. అక్కడా అత్యధిక సాగు.. నిషేధిత క్యాట్‌ఫిష్‌ సాగు ఉమ్మడి జిల్లా పరిధిలోని జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో జోరుగా సాగుతోంది. సాగు దారులు ఎవరికీ అంతుపట్టకుండా గ్రామ శివారులో ఉన్న భూముల్లో క్యాట్‌ఫిష్‌ను పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు.

ముఖ్యంగా గద్వాల మండలం బీరెల్లి, లత్తిపురం, అనంతపురం, అయిజ మండలంచిన్నతండ్రాపాడ్, ధరూర్‌ మండలం ఉప్పేర్, గార్లపాడు, ఖమ్మంపాడు, నందిమల్ల, పెబ్బేరు, రంగాపూర్, ఇటిక్యాల మండలం ఆర్‌ గార్లపాడు, యుక్తాపూర్, తిమ్మపురం, కొండేర్, జింకలపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ప్రాణాంతక చేపలు భారీ మొత్తంలో సాగవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో భూములను లీజుకు తీసుకున్న కొందరు అక్రమార్కులు వాటిలో క్యాట్‌ఫిష్‌ను దశాబ్దకాలంగా సాగు చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలతో పాటు పర్యావరణ ముప్పునకు కారకమైన ఈ చేపలను సాగు చేసి.. కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో విక్రయిస్తూ లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఇటిక్యాల, ధరూర్‌ మండలంలో భారీ మొత్తంలో సాగవుతున్న పలు క్యాట్‌ఫిష్‌ చెరువులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దృష్టి సారిస్తాయా? లేదా? అనే చర్చ అప్పుడే మొదలైంది. 

మనోళ్ల చెరువులపై ఆంధ్రుల సాగు.. 
ఉమ్మడి జిల్లాలోని ఎన్నో ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ సాగు అవుతున్నా.. ఆయా చెరువుల నిర్వాహకులు మాత్రం తెలంగాణేతరులే కావడం గమనార్హం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు ఉమ్మడి జిల్లాలోని పలు శివారు ప్రాంతాల్లో ఎక్కువ డబ్బులిచ్చి చెరువులు లీజుకు తీసుకుంటారు. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ను సాగు చేస్తారు.

పలుచోట్ల కనబడకుండా చెరువుల చుట్టూ కంప చెట్లు పెంచుకుంటారు. దీంతో ఆయా ప్రాంతాల్లో చెరువులు ఉన్నట్లు.. వాటిలో నిషేధిత క్యాట్‌ఫిష్‌ ఉన్నట్లు కనీసం ఆయా గ్రామాల ప్రజలకు సైతం తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు క్యాట్‌ఫిష్‌ను గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి.

దాడులు విస్తృతం చేశాం.. 
టాస్క్‌ఫోర్స్‌.. నిషేధిత క్యాట్‌ఫిష్‌ సాగుపై కొరడా ఝుళిపిస్తుంది. ఇప్పటికే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సహాయంతో జిల్లాలో పలుచోట్ల దాడులు నిర్వహించి క్యాట్‌ఫిష్‌ను గుర్తించాం. వాటిని చంపి.. భూమిలో పాతిపెట్టాం. ఇకపైనా దాడులు కొనసాగుతాయి. నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం.
– రూపేందర్‌సింగ్, జిల్లా మత్య్యశాఖాధికారి, జోగులాంబ గద్వాల    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement