వారిద్దరూ అధికార పార్టీకి చెందినవారే. ఒకరు జడ్‌పీ చైర్మన్, మరొకరు ఎమ్మెల్యే. కాని ఒకరంటే ఒకరికి పడదు. సమన్వయంతో పనిచేయడం మానేసి.. ఆధిపత్య పోరుకు తెర తీసారు. ఒకరు మంత్రి మనిషి.. మరొకరికి మంత్రితో పడదు.. దీంతో ఈ ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు?
ఇంటా, బయటా.. వేడేక్కిన రాజకీయం
నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం.. అధికార పార్టీలోని వారి మధ్యే జరుగుతోంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితకు కొంతకాలంగా అంతర్గత వైరం కొనసాగుతుంది. గతంలో జడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు.
జడ్పీ చైర్ పర్సన్ సరితకు మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలు ఉండటంతో ఆమె ఎమ్మెల్యేతో సై అంటే సై అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న ఎమ్మెల్యే సైతం డీ అంటే డీ అన్నట్టుగా ఉన్నారు. నియోజకవర్గంలో బలమైన నేతగా ఉన్న డీకే అరుణను ఎదుర్కొని నిలవటం ఎమ్మెల్యే కృష్ణమోహన్‌కు నిత్యం సవాల్‌గా మారుతోంది. ఇప్పుడు స్వంత పార్టీ నేత నుంచి కూడా ప్రతికూల పరిస్ధితులు ఎదురు కావడంతో ఆయనలో ఆందోళన పెరుగుతోంది.
మా దారి మాదే
గద్వాల నియోజకవర్గంలో జడ్‌పీ ఛైర్మన్, ఎమ్మెల్యే ఎవరికి వారుగా అధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విధిలేని పరిస్ధితిలో జడ్‌పీ సమావేశంలో కలిసి పాల్గొన్నా అంటిముట్టనట్టే ఉంటున్నారు. వీరిద్దరి మద్య వైరానికి కారణం ఏంటని ఆరా తీస్తే.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయుడిగా ముద్ర పడింది. దీంతో నిరంజన్‌రెడ్డితో ఆయనకు సఖ్యత లేదనే వాదన చాలా కాలంగా కొనసాగుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి తనకు వ్యతిరేకంగా మరోవర్గాన్ని ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ సరిత గద్వాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశ్యంతో పావులు కదుపుతున్నట్టు జోరుగా ప్రచారం సాగుతుంది. ఓసారి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి రావాల్సిందిగా.. మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డిలను ఆహ్వానించారు. మంత్రుల ఫోటోలతో జిల్లా కేంద్రంలో స్వాగత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయించారు చైర్మన్ సరిత. తనకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే వెళ్లి ఎలా పిలుస్తారని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సీరియస్ అయ్యారట. ఇదే విషయాన్ని మంత్రుల దృష్టికి సైతం తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది. వీరిద్దరి వర్గపోరు కారణంగానే ఆ ఇద్దరు మంత్రులు మీటింగుకు రాకుండా డుమ్మా కొట్టారు.
కులాల కురుక్షేత్రం
గద్వాల నియోజకవర్గంలో బీసీ వర్గాల్లో వాల్మీకి బోయల తర్వాత కురువ సామాజిక ఓటర్లే అధికంగా ఉన్నారు. కురువ వర్గానికి చెందిన సరిత రాజకీయంగా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. గద్వాలలో క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. నేరుగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్యాడర్‌కు భరోసా ఇస్తున్నారు.
చదవండి: బండ్ల కృష్ణమోహన్ రెడ్డికీ, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత
బీసి కోటా కింద గద్వాల నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. టిక్కెట్ వస్తే ఎంతైనా ఖర్చు చేస్తామన్న ధీమాను ఆమె వ్యక్తం చేస్తున్నారట. పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఎమ్మెల్యే పట్ల అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలను చేరదీసి తన వర్గంలో కలుపు కుంటున్నారట. జడ్పీ చైర్‌పర్సన్ భర్త తిరపతయ్య కూడ గద్వాల రాజకీయాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు ఎమ్మెల్యే వర్గీయులు.
నన్నే పక్కనబెడతారా?
ఇటీవల బీసీ గురుకుల పాఠశాల భవనాన్ని తాను రాకముందే జడ్పీ చైర్‌పర్సన్‌తో ప్రారంభింప చేయటంపై ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక సంబంధిత శాఖ జిల్లా కోఆర్డినేటర్‌పై చేయిచేసుకున్నారు. ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో ఎమ్మెల్యేకు, జడ్పీ చైర్‌పర్సన్‌కు మద్య ఉన్న విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఘటనపై అధిష్టానానికి ఫిర్యాదులు కూడ వెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య వైరం కొనసాగుతుండటంతో ప్రభుత్వ అధికారుల పరిస్దితి డోలాయమానంలో పడింది.
ఎవరిని కలిస్తే ఎవరికి కోపం వచ్చి తమను టార్గెట్ చేస్తారోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఉన్నతాధికారులు గద్వాల జిల్లాలో పనిచేయడానికి అంతగా ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఒక కంట కనిపెట్టాలని.. విభేదాలను పరిష్కరించకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని గులాబీ పార్టీ కేడర్ కోరుతోంది.
పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్
feedback@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment