సాక్షి, మహబూబ్‌నగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘న్యూడ్‌కాల్స్’ వ్యవహారం కొత్త మలుపు తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు అసలు నిందితులను తప్పించారని.. ఈ మేరకు పెద్దమొత్తంలో డబ్బులు చేతులు మారాయని రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ అధికారుల విచారణలో తేలినట్లు సమాచారం. డర్టీపిక్చర్‌ను తలపించిన ఈ రోత పనిలో ఓ పోలీస్ అధికారి స్వీయ భాగస్వామ్యం ఉందని.. అయితే కిందిస్థాయి అధికారిపై బదిలీ వేటుతో సరిపుచ్చారని గుర్తించినట్లు తెలిసింది. ఈ క్రమంలో జిల్లా పోలీస్‌శాఖలో అసలు ఏం జరుగుతోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఎటుపోయి ఎవరి మెడకు చుట్టుకుంటుందోననే భయం ఖాకీల్లో నెలకొంది.
తాజాగా రహస్య విచారణ..
న్యూడ్‌కాల్స్ వ్యవహారం వెలుగులోకి రాగా రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా జిల్లాపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయి పోలీస్ అధికారులు జిల్లాపై డేగ కన్ను వేశారు. ఇటీవల జిల్లాలో వ్యభిచార గృహాలపై పోలీసులు దాడి చేసి పలువురిని అదుపులోకి తీసుకోగా.. అందరూ దాదాపుగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో అసలు వారికి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు.. ఇక్కడ ఎవరి మద్దతు ఉంది..
పోలీసులు ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు అనే కోణంలో రాష్ట్రస్థాయి ఇంటెలిజెన్స్ బృందం రహస్యంగా విచారణ చేపట్టి ఆరా తీసింది. ఈ క్రమంలో న్యూడ్ కాల్స్ వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అసలు నిందితులను తప్పించే క్రమంలో సుమారు రూ.50 లక్షలు చేతులు మారాయని గ్రహించిన వారు.. ఎవరెవరికి ఎంత ముట్టాయనే లెక్కలు తీస్తున్నట్లు సమాచారం.
అప్పట్లో ఏం జరిగింది..
గద్వాలకు చెందిన కొందరు కొన్నాళ్లుగా అమ్మాయిలను ట్రాప్ చేసి లోబరుచుకోవడమే కాకుండా వారితో నగ్న వీడియో కాల్స్ మాట్లాడి స్క్రీన్ రికార్డ్, స్క్రీన్ షాట్లు తీసి బ్లాక్‌మెయిల్ చేస్తూ రోత పనులకు పురిగొల్పారు. పలువురి మహిళల అర్ధనగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ట్రాప్, బ్లాక్ మెయిలింగ్ అంశం బట్టబయలైన విషయం తెలిసిందే. గతేడాది నవంబర్ 4న ఈ ఉదంతం వెలుగులోకి రాగా.. ఇందులో ప్రధాన పారీ్టకి చెందిన యువకులు ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
పలువురు పోలీసుల పాత్ర కూడా ఉన్నట్లు బట్టబయలు కావడం కలకలం సృష్టించింది. అయితే ఫిర్యాదు చేసేందుకు బాధితులెవరూ ముందుకు రాకపోవడంతో ‘సాక్షి’తోపాటు పలు పత్రికల్లో వచ్చిన కథనాలను పోలీసులు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టారు. తొలుత గద్వాల పట్టణానికి చెందిన తిరుమలేష్ అలియాస్ మహేశ్వర్‌రెడ్డి, ఆ తర్వాత నిఖిల్, వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తతంగంలో ఓ ప్రజాప్రతినిధికి చెందిన ముఖ్య అనుచరుడు అయిన ఓ ప్రజాసంఘం నాయకుడి కుమారుడు, ఇద్దరు కౌన్సిలర్లతోపాటు ఓ కౌన్సిలర్ భర్త ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అరెస్టు చేసిన ఆ ముగ్గురు మాత్రమే నిందితులని.. మిగతా వారి ప్రమేయం లేదని అప్పటి జిల్లా పోలీస్ బాస్ కొట్టి పారేశాడు. దీనిపై అప్పట్లోనే దుమారం చెలరేగింది.
కలవరం..
న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి పట్టుబడిన ముగ్గురు యువకులతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రధాన పార్టీకి చెందిన యువకులే. పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురితోపాటు తప్పించిన అసలు నిందితుడు ఓ పురపాలిక ప్రజాప్రతినిధి అనుచరులే. ఈ పంచాయితీ జిల్లాకు చెందిన ముఖ్య నేత వద్దకు చేరింది. తన వైరి వర్గమైనప్పటికీ జిల్లా పరువు పోతుందనే కారణంతో ఆయన సైలెంట్‌గా ఉన్నారు.
దీన్ని ఆసరాగా చేసుకుని స్వీయ భాగస్వామ్యం ఉన్న పోలీస్ అధికారిని వదిలేసి నిందితులతో ఖరీదు దోస్తాన్ చేసిన ఓ ఎస్‌ఐపై బదిలీ వేటు వేసి కేసు మొత్తం క్లోజ్ చేశారని ఇంటెలిజెన్స్ అధికారులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేసు క్లోజ్ అయిన మూడు నెలల తర్వాత రాష్ట్ర ఇంటెలిజెన్స్ రహస్యంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టడం జిల్లా పోలీస్‌శాఖ సిబ్బందిని కలవరానికి గురిచేస్తోంది.
‘సిట్’తో విచారణ జరిపించాలి..
గద్వాలలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, దాడులపై ప్రభుత్వం స్పందించాలి. ఇందులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరైనా సరే గుర్తించి శిక్ష పడేలా ప్రత్యేకంగా సిట్ బృందం ఏర్పాటు చేయాలి. ఈ కేసులో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, పోలీసుల పేర్లు వినపడుతున్నాయి. స్థానిక పోలీసులపై అనేక రకాల ఒత్తిళ్లు ఉంటాయి. వారిని జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పారదర్శకంగా జరగాలంటే సిట్‌తో విచారణ జరిపించాలి.
– జ్యోతి, స్త్రీ చైతన్య సంఘం రాష్ట్ర కన్వీనర్
ఎవరినీ ఉపేక్షించం..
జిల్లాలో న్యూడ్‌కాల్స్ వ్యవహారానికి సంబంధించి నేను బాధ్యతలు తీసుకోక ముందే విచారణ చేశారు. దానిపై ఆరోపణలు వస్తున్న మాట వాస్తవమే. పరిశీలించి మళ్లీ విచారణ చేపడతాం. తేలిన దాని ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు.
– సృజన, జోగుళాంబ గద్వాల ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment