గొలుగొండ : ‘ఉపాధి కూలికెళ్తే గిట్టుబాటు కాదు. ఉదయం నుంచి పని చేసినా కూలి అందలేదు. అలాంటప్పు డు పనికెళ్లి ఏం తినాలి?, ఎలా బతకాలి’.. అంటూ చోద్యం గ్రామానికి చెందిన వందలాది మంది కూలీలు శుక్రవారం రోడ్డెకాకరు. పనులకు వెళ్లకుండా ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించారు. చోద్యం గ్రామంలో 430 మంది కూలీలు ఉపాధి పనులకు రోజూ వెళ్తున్నారు. రెండు వారాలుగా పనికెళ్తున్నా కూలి సొమ్ము అందలేదు. డబ్బులు అందకపోవడంతో రెండ్రోజులుగా కూలీలు ఇబ్బంది పడ్డారు. అధికారులను నిలదీస్తే డబ్బులొచ్చాయి.. తీసుకోండన్నారు.
తీరా వెళ్తే ఒక్కొక్కరికి రోజు కూలి రూ.40 నుంచి రూ.60కి మించలేదు. ఎంత పనిచేసినా కూలి డబ్బులు రాకపోవడంతో కూలీంతా ఆవేదన చెందారు. అధికారులు కొలతలు తప్పుగా గుర్తించడం వల్లే కూలి డబ్బులు తక్కువగా వచ్చాయని, మళ్లీ కొలతలు తీయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప పనులకు వెళ్లమన్నారు. ఈ పంచాయతీలో ఏడాదిగా పనులు పూర్తిస్థాయిలో చేస్తున్నా సక్రమంగా కూలి ఇవ్వడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే మండల కేంద్రం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం నేత సుర్ల బాబ్జి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
పంచాయతీ కార్యాలయంలో బైఠాయింపు
అనకాపల్లి: తమకు కేటాయించిన ఉపాధి పనులను అర్ధాంతరంగా నిలిపి వేసినందుకు నిరసనగా సత్యనారాయణ పురం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు శుక్రవారం బైఠాయించారు. తమ పనులను ఎవరు నిలిపివేశారని సర్పంచ్‌ను నిలదీశారు. సుమారు 400 మంది కూలీలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇద్దరు గ్రామస్తులు, ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కూలీలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు.
ఈ కూలితో ఏం తినాలి?
Published Sat, May 30 2015 3:58 AM | Last Updated on Sun, Sep 3 2017 2:54 AM
Advertisement
Advertisement