Employment Workers
-
ఉపాధి అభివృద్ధి.. మూడు జాతీయ స్థాయి అవార్డులు
ఉపాధి కూలీలకు జీవనోపాధి కల్పిస్తూ శాశ్వత నిర్మాణాలతో అభివృద్ధిలో జిల్లా దూసుకెళ్తోంది. మెటీరియల్ కాంపోనేట్తో గ్రామీణాభివృద్ధిలో భాగంగా పది రకాల భవనాలు నిర్మిస్తున్నారు. ప్రతి రోజూ సుమారు 60 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో సుమారు 1.20 కోట్ల పని దినాలు కల్పించడం, అభివృద్ధే లక్ష్యంగా జిల్లా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగానికి లక్ష్యాలు నిర్దేశించారు. నెల్లూరు (పొగతోట): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వ్యవసాయ కూలీలకు పనులు కల్పించడంతో పాటు గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి నిధులతో 10 రకాల అభివృద్ధి పనులు చేపడుతున్నారు. జిల్లాలో 2019 నుంచి ఇప్పటి వరకు ఉపాధి హమీ పథకం ద్వారా రూ.1,419.38 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు రూ.828.95 కోట్లు వేతనా ల రూపంలో చెల్లించారు. మెటీరియల్ కాంపో నేట్ ద్వారా రూ.590.43 కోట్లు ఖర్చు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సీసీరోడ్లు, సీసీ డ్రెయిన్లు, రైతుభరోసా కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, సచివాలయాలు, బల్క్ మిల్క్ సెంటర్స్ తదితర భవన నిర్మాణాలు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పనులు హాజరయ్యే కూలీలకు రోజుకు ఒక్కొక్కరికి రూ.252 వేతనం చెల్లించాల్సి ఉంది. రూ.252 వేతనం కూలీకి చెల్లిస్తే రూ.171 అభివృద్ధి పనులు చేపట్టేందుకు మంజూరు చేస్తున్నారు. జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు గ్రామాల్లో అవసరం పనులను ఉపాధి హామీ సిబ్బంది ద్వారా గుర్తించి ప్రతి వారం ఆయా పనులను అప్లోడ్ చేస్తున్నారు. గుర్తించి పనులకు కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత నింబంధనల ప్రకారం గుర్తించిన పనులను పూర్తి చేసి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తేనే కొత్త పనులు చేపట్టే అవకాశం ఉంది. ఉపాధి పని దినాలు కల్పించడంలో జిల్లాకు మూడు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంలో 1.29 కోట్ల పనిదినాలు కల్పించారు. కూలీలకు వేతనం ద్వారా రూ 266.96 కోట్లు, మెటీరియల్ కాంపోనేట్కు రూ.132.13 కోట్లు ఖర్చు చేశారు. ఉపాధి పనులు చేసిన కూలీలకు వారి బ్యాంకు అకౌంట్లలో నగదు జమ అవుతుంది. కూలీలు ఉదయం 6 గంటలకు వచ్చి 10.30లోపు ఉపాధి పనులు పూర్తి చేసుకుని వెను తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు అధికంగా జరిగే రోజుల్లో ఉపాధి పనులకు వచ్చే కూలీల సంఖ్య తక్కువగా ఉంటుంది. రాపూరు, వింజమూరు, వరికుంటపాడు, ఉదయగిరి తదితర మండలాల్లో ఉపాధి పనులు అధికంగా జరుగుతున్నాయి. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచి నిర్దేశించిన వేతనం మంజూరు చేయించేలా జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. కలెక్టర్ కేవీఎన్ చక్రధర్‌బాబు క్రమం తప్పకుండా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి సూచనలు సలహాలు ఇస్తున్నారు. డ్వామా పీడీ , అడిషనల్ పీడీ నిర్మలారెడ్డి నిత్యం మండల సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌లో నిర్వహించి ఉపా«ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు. 1.20 కోట్ల పని దినాలే లక్ష్యం జిల్లాలోని 37 మండలాల్లో 722 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 4.43 లక్షల మంది జాబ్‌కార్డులు కలిగిన కూలీలు ఉన్నారు. ప్రతి రోజు 50 నుంచి 60 వేల మంది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. గతేడాది 90 వేల నుంచి లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటిలో 82 లక్షల పనిదినాలు జిల్లాకు కేటాయించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోపు 1.10 కోట్ల నుంచి 1.20 కోట్ల పని దినాలు పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండడంతో పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య తక్కువగా ఉంది. ఉపాధి పనులతో అభివృద్ధి పనులతో పాటు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతి కూలీకి రూ.252 వేతనం వచ్చేలా పనులు చేయిస్తున్నారు. ఉపాధి పనులు అధికంగా జరిగి కూలీలకు వేతనం అధికంగా చెల్లిస్తే అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగే అవకాశం ఉంది. కూలీలకు నిర్దేశించిన వేతనం చెల్లించేలా చర్యలు జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కూలీలకు రూ.252 వేతనం చెల్లించేలా చర్యలు చేపట్టాం. ఉపాధి పనులు అధికంగా జరిగితే అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంది. సీసీ రోడ్లు, ఆర్బీకేలు, అంగన్వాడీ భవనాలు తదితర భవన నిర్మాణాలు చేపట్టి పూర్తి చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 82 లక్షల పని దినాలు కల్పించమని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు 79 లక్షల పనిదినాలు కల్పించాం. ఉపా«ధి పనులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు అధికంగా చేపట్టే అవకాశం ఉంది. – వెంకట్రావ్, డ్వామా పీడీ -
వేతన వెతలు
⇒ ఉపాధి కూలీలకు అందని వేతనం ⇒ రూ.4 కోట్లు సస్పెన్స్ అకౌంట్లలో మూలుగుతున్న వైనం ⇒ 40 వేలమంది కూలీలకు ఇబ్బందులు ఉదయగిరి: ఉదయగిరి పట్టణానికి చెందిన కిరణ్ అనే వికలాంగ గ్రూపు సభ్యులు 15 వారాల నుంచి పనులు చేస్తున్నా వారికీ నగదు రాలేదు. పలుమార్లు అధికారులను అడిగినా సమాధానం లేదు. తీరా ఆరాతీస్తే కూలీ నగదు సస్పెన్షన్ అకౌంట్లో పడినట్లు గా చెబుతున్నారు. ఆ అకౌంట్ నుంచి కూలీల ఖాతా లోకి ఎప్పుడు జమవుతుందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఏ ఒక్కరో ఇద్దరికో సంబంధించింది కాదు. జిల్లాలోని సుమారు 40 వేలమంది ఉపాధి కూలీలు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉపాధి కూలీలు కరువుతో పనులు లేక ఉపాధి పనులకు వెళితే నెలల తరబడి వేతనం రాకపోవడంతో కుటుంబాలు గడవక దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా గత రెండ్రోజుల నాటికి రూ.3.85 కోట్లు సస్పెన్షన్ (అనుమానాస్పద ఖాతా) ఖాతాల్లో ఉంది. జిల్లాలో 4.67 లక్షల మంది ఉపాధి కూలీలున్నారు. ప్రస్తుతం ప్రతిరోజూ జిల్లావ్యాప్తంగా 20–25 వేల మంది ఉపాధి పనికి వెళుతున్నారు. వీరిలో 90 శాతం మంది ఏ పూటకాపూట కుటుంబాన్ని వెళ్లదీసే వారే ఉన్నారు. వీరికి నెలల తరబడి వేతనాలు అందకపోతే కుటుంబాలు నెట్టుకొచ్చేపరిస్థితి లేదు. మరి నాలుగు నెలలనుంచి కూలీల ఖాతాల్లో నగదు జమకాడం లేదు. సస్పెన్షన్ అకౌంట్లలో జమవుతూ ఉన్నాయి. పైకి చూసేందుకు నగదు కూలీలకు చేరినట్లుగా కనిపించినా అవి మాత్రం వారి ఖాతాల్లో జమకావడం లేదు. దీనికి కారణం కూలీలకు సంబంధించిన ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా అనుసంధానంలో సిబ్బంది, అధికారుల నిర్లక్ష్యమే. పూర్తిస్థాయిలో అనుసంధానం చేయకపోవటమే ఈ తప్పిదాలకు కారణం. జరిగిన పొరపాటును సరిదిద్దాల్సిన అధికారులు, సరిచేయాల్సిన సిబ్బంది పట్టించుకోకపోవటం ఉపాధి కూలీలకు శాపంగా మారింది. రోజుకో మార్పు మొదట్లో ఉపాధి కూలీలకు సీఎస్పీల ద్వారా నగదు అందించేవారు. అనంతరం పోస్టాఫీసుల ద్వారా నగదు పంపిణీ చేస్తున్నారు. తాజాగా బ్యాంకుల ద్వారా కూలీలకు నగదు సత్వరమే అందించేందుకు అధికారులు సంకల్పించారు. ఈ విధానంలో అతివేగంగా కూలీల ఖాతాలకు నగదు జమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, వ్యవస్థలో ఉన్న లోపాలు సరిదిద్దకుండా హడావుడిగా దీనిని అమలుచేయటమే ఇబ్బందులకు కారణమైంది. దీంతో ఇప్పటికే బ్యాంకుల్లో అనుమానాస్పద ఖాతాల్లో రూ.3.85 కోట్లు మూలుగుతోంది. ఈ మొత్తం కడుపేదవారికి చేరవలసిన నగదు. కానీ వారికి చేరకపోవడంతో ఆకలితో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి సస్పెన్షన్ ఖాతాల్లో జమై ఉన్న నగదును కూలీల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. -
ఈ కూలితో ఏం తినాలి?
గొలుగొండ : ‘ఉపాధి కూలికెళ్తే గిట్టుబాటు కాదు. ఉదయం నుంచి పని చేసినా కూలి అందలేదు. అలాంటప్పు డు పనికెళ్లి ఏం తినాలి?, ఎలా బతకాలి’.. అంటూ చోద్యం గ్రామానికి చెందిన వందలాది మంది కూలీలు శుక్రవారం రోడ్డెకాకరు. పనులకు వెళ్లకుండా ఆందోళన చేసి రోడ్డుపై బైఠాయించారు. చోద్యం గ్రామంలో 430 మంది కూలీలు ఉపాధి పనులకు రోజూ వెళ్తున్నారు. రెండు వారాలుగా పనికెళ్తున్నా కూలి సొమ్ము అందలేదు. డబ్బులు అందకపోవడంతో రెండ్రోజులుగా కూలీలు ఇబ్బంది పడ్డారు. అధికారులను నిలదీస్తే డబ్బులొచ్చాయి.. తీసుకోండన్నారు. తీరా వెళ్తే ఒక్కొక్కరికి రోజు కూలి రూ.40 నుంచి రూ.60కి మించలేదు. ఎంత పనిచేసినా కూలి డబ్బులు రాకపోవడంతో కూలీంతా ఆవేదన చెందారు. అధికారులు కొలతలు తప్పుగా గుర్తించడం వల్లే కూలి డబ్బులు తక్కువగా వచ్చాయని, మళ్లీ కొలతలు తీయాలని డిమాండ్ చేశారు. పూర్తి స్థాయిలో చెల్లిస్తే తప్ప పనులకు వెళ్లమన్నారు. ఈ పంచాయతీలో ఏడాదిగా పనులు పూర్తిస్థాయిలో చేస్తున్నా సక్రమంగా కూలి ఇవ్వడం లేదన్నారు. సమస్యను పరిష్కరించకపోతే మండల కేంద్రం ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. రైతు కూలీ సంఘం నేత సుర్ల బాబ్జి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. పంచాయతీ కార్యాలయంలో బైఠాయింపు అనకాపల్లి: తమకు కేటాయించిన ఉపాధి పనులను అర్ధాంతరంగా నిలిపి వేసినందుకు నిరసనగా సత్యనారాయణ పురం పంచాయతీ కార్యాలయంలో ఉపాధి హామీ కూలీలు శుక్రవారం బైఠాయించారు. తమ పనులను ఎవరు నిలిపివేశారని సర్పంచ్‌ను నిలదీశారు. సుమారు 400 మంది కూలీలు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో ఇద్దరు గ్రామస్తులు, ఉపాధి హామీ మహిళా కూలీల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా మహిళా కూలీలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు బయల్దేరి వెళ్లారు. -
ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు : కలెక్టర్
మహబూబ్‌నగర్ (టౌన్): జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉపాది కూలీలందరికి మార్చి నెలాఖరు నాటికి పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పనిచేస్తామని ముందుకు వచ్చే ప్రతి కూలీకి పని కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో పని కల్పించని వారిని సహించేది లేదని వారిపై కఠిన చర్యలు తప్పవంటూ కలెక్టర్ హెచ్చరించారు. ఇక కూలీలకు పని కల్పించే విషయంలో ముందస్తు ప్రణాళికల్ని రూపొందించుకొని సాధ్యమైననీ ఎక్కువ రోజులు పని కల్పించాల్సిందిగా వారికి సూచించారు. ఇంత వరకు పనులు చేపట్టేందుకు గుర్తించిన వాటిలో తక్షణమే పనులు ప్రారంభించాలని, ఈవిషయంలో కూలీలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. -
ఉపాధిలో పొదుపు
ఉపాధి కూలీలను చెడువ్యవసనాలకు దూరంగా ఉంచేందుకు వారిలో పొదుపును అలవాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యసనాలకు ఖర్చు చేసే సొమ్మును మదుపు చేయించడం ద్వారా వారి భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇటీవల జరిగిన డ్వామా పీడీల జాతీయస్థాయి సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగింది. కూలీల నుంచి అభిప్రాయ సేకరణ అనంతరం ఈ పొదుపు పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. - కూలీమొత్తం పొదుపు ఖాతాకు మళ్లింపు - ఆర్డీలపై ఇచ్చే 8.5 శాతం వడ్డీ చెల్లింపు - చెడు వ్యసనాల నుంచి దారి మళ్లించేందుకే సాక్షి, విశాఖపట్నం : ఉపాధి హామీ పథకంలో సంపాదించే మొత్తంలో ముప్పై నుంచి 40 శాతం మద్యం, ఇతర వ్యసనాల కోసం కూలీలు ఖర్చు చేస్తున్నట్టుగా ఇటీవల ఒక సర్వేలో కేంద్రం గుర్తించింది. 80 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు ఇలా వ్యసనాలకు ఖర్చు చేస్తున్నట్టు నిర్ధారణైంది. వీరిలో పొదుపు అలవాటును పెంపొందించగలిగితే వ్యసనాలకు చేసే ఖర్చు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. తొలుత వీరు సంపాదించే మొత్తంలో కనీసం 10 శాతం మొత్తాన్ని పొదుపు చేయించాలని నిర్ణయించారు. సాధారణంగా ఉపాధి పథకంలో ఆర్నెల్లు మాత్రమే పనులుంటాయి. మిగిలిన ఆర్నెల్లు కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. ఉపాధి పనులు చేసినంత కాలం ప్రతీ నెలా వారు సంపాదించిన మొత్తంలో 10 శాతం మొత్తాన్ని సేవింగ్ అకౌంట్లో జమచేస్తారు. సాధారణంగా సేవింగ్ అకౌంట్లో జమ చేసే మొత్తంపై కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ ఇస్తారు.ప్రతీనెలా కొంత మొత్తం చొప్పున ఏడాదిపొడవునా పొదుపు చేస్తేనే రికవరింగ్ డిపాజిట్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఈ అకౌంట్లో పొదుపుచేసే మొత్తానికి మాత్రమే బ్యాంకులు 8.5 శాతం వడ్డీ చెల్లిస్తాయి. కానీ ఉపాధి కూలీల కోసం కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది. సేవింగ్ ఖాతాలో పొదుపు చేసే కూలీల మొత్తానికి కూడా ఆర్డీలపై చెల్లించే 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఏదైనా కూలీ రోజుకు గరిష్టంగా రూ.169ల చొప్పున ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి పొందితే అతను సంపాదించే రూ.16,900లలో 10శాతం చొప్పున రూ.1690ల మొత్తం సేవింగ్ ఖాతాలో అటోమేటిక్‌గా జమవుతుంది. మన రాష్ర్టంలో ఉపాధి హామీ పథకంలో 80,68,349 జాబ్ కార్డుల పరిధిలో కోటి 72లక్షల83వేల 712 మంది కూలీలున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31లక్షల35వేల92 కుటుంబాల పరిధిలో 52 లక్షల 11వేల586 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్లో రూ.252కోట్ల 41 లక్షల 84వేల విలువైన 26లక్షల 76వేల 41పనులు గుర్తించగా, ఇప్పటివరకు రూ.107 కోట్ల విలువైన 14లక్షల 70వేల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.25 కోట్ల మేర కూలీలు పొదుపుచేసే అవకాశం ఉంటుంది. ఈ పొదుపు పథకానికి సంబంధించిఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల పీడీల కాన్ఫరెన్స్‌లో ఈపథకంపై పీడీల అభిప్రాయాలు కేంద్రం సేకరించింది. డిసెంబర్ నెలాఖరులోగా కూలీలనుంచి అభిప్రాయాలు సేకరించిన వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉన్నట్టుగా ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఉపాధి కూలీల్లో పొదుపు అలవాటు పెరగడంతో పాటు వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. -
27,83,00,000
జమ్మలమడుగు: వందలు..వేలు.. లక్షలు కాదు.. ఏకంగా 27 కోట్ల 83 లక్షల రుపాయలు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఇది. మే 24వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు డబ్బు రాలేదు. ఉపాధి పనులు చేసిన వారికి ప్రతి శనివారం ఫీల్డ్ అసిస్టెంట్లద్వారా కూలి డబ్బులు అందజేస్తారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో కూలి డబ్బులు నిలిచిపోయినట్లు ఆశాఖకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా లేకపోవడంతో రైతు కూలీలకు వ్యవసాయ పనులు లేక ఉపాధి లేకుండా పోయింది. జిల్లాలోని 50 మండలాల్లో 5 లక్షలకు పైగా ఉపాధి కూలీలు రెండు నెలలుగా పనులు చేశారు. దాదాపు 50 రోజులు కావస్తున్నా వీరికి కూలి డబ్బులు అందలేదు. జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు దాదాపు 27 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. తాము చేసిన పనులకు కూలి డబ్బు ఎప్పుడిస్తారంటూ కూలీలు అధికారుల చుట్టూ పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఫీల్ట్ అసిస్టెంట్లు మాత్రమే ఉపాధి పనులు చేయించుకుంటున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లడం లేదు. గ్రామాలకు వెళితే కూలిడబ్బుల కోసం తమను ఎక్కడ నిలదీస్తారోననే భయం వారిలో నెలకొంది. తమకు వెంటనే ఉపాధి కూలి డబ్బులు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. లేని పక్షంలో కుటుంబాలను పోషించుకోవడానికి వలసలు వెళ్లాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. -
బయోమెట్రిక్ బాధలు
కేసముద్రం, న్యూస్‌లైన్ : ఉపాధి కూలీలు, పింఛన్‌దారుల పాలిట బయోమెట్రిక్ విధానం శాపంగా మారింది. వేలిముద్రలు సరిగా పడకపోవడంతో అధికారుల చుట్టూ లబ్ధిదారులు ప్రదక్షిణలు చేయక తప్పడం లేదు. ‘నీ వేలిముద్రలు సరిగాలేవు... మళ్లీ బయోమెట్రిక్ కేంద్రంలో ఫొటోదిగి, వేలిముద్రలను నమోదుచేసుకుని రండి... ఆ తర్వాత యంత్రం ఓకే చేస్తే డబ్బులు ఇస్తాం. లేకపోతే మేం ఏంచేయలేం.’ అని సమాధానం చెప్పడం పోస్టుమాస్టర్లకు పరిపాటిగా మా రింది. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఫొటోలు ఎక్కడ దిగాలో... వేలిముద్రలు ఎట్లా సరిచేసుకోవాలో తెలియక డ బ్బుల కోసం ఉపాధి కూలీలు, పింఛన్ కోసం వృద్ధులు నానాపాట్లు పడుతున్నారు. ఒకవేళ తెలిసినా... వేలిముద్రలు, ఫొటోలు తీసుకునే ఫీల్డ్‌ఆఫీసర్ ఆచూకీ దొరక్క వారు మండల కా ర్యాలయం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాయూల్సి వస్తోంది. మండల పరిధిలోని గ్రా మాల్లో పర్యటించడమే ఫీల్డ్ ఆఫీసర్ విధి. ఈ క్రమంలో సదరు అధికారి ఏ గ్రామంలో ఉంటే లబ్ధిదారులు అక్కడికి తిరగాల్సిన పరిస్థితి ఎ దురవుతోంది. ఈ సమస్య ప్రతీ నెల తలెత్తుతుండడంతో పింఛన్లపైనే ఆధారపడుతున్న వారు రోడ్డునపడాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాలో 50 వేల మంది... కేసముద్రం మండలంలో 8,168 మంది పింఛన్‌దారులు, 18 వేల మంది ఉపాధి కూలీలు ఉన్నారు. ఇందులో బయోమెట్రిక్ యంత్రం వేలిముద్రలు తీసుకోకపోవడంతో తిరస్కరణ కు గురైన వారు 800 మంది నుంచి 1,000 మంది వరకు ఉన్నట్లు అధికారులే చెబుతున్నా రు. ఇందులో ఎక్కువ మంది రెండు, మూడు దఫాలుగా ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు వెళ్లి ఫొటోలు, వేలిముద్రలు నమోదుచేసుకున్న వారే. అరుు నా... వారి సమస్య పరిష్కారం కాలేదు. ఇలా జిల్లావ్యాప్తంగా 51 మండలాల్లో సుమారు 50 వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా. అందరికీ తిప్పలే... జిల్లావ్యాప్తంగా పింఛన్‌దారులు 3,97,459 మంది ఉండగా... వారి అకౌంట్లలో ప్రతి నెలకు రూ.12,03,27,400 జమ అవుతున్నారుు. అదేవిధంగా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీలు 5,61, 843 మంది ఉన్నారు. ఉపాధి కూలీలకు ఇదివరకు అకౌంట్బుక్ ద్వారా... వృద్ధ, వితంతు తది తర పింఛన్‌దారులకు స్మార్ట్‌కార్డు ద్వారా పం చాయతీ కార్యదర్శుల సమక్షంలో డబ్బులు అందేవి. ఈ విధానంలో అవకతవకలు వెలుగుచూడడంతో... మళ్లీ అలాంటి పొరపాటు జరగొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం 2013 సెప్టెం బర్లో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టింది. కానీ... బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా వేలిముద్రలు తీసుకోకపోవడం అటు లబ్ధిదారులు.. ఇటు పోస్టుమాస్టర్లు, ఫీల్డ్ ఆఫీసర్లను అయోమయూనికి గురిచేస్తోంది. ప్రతి గ్రామం తిరుగుతున్నాం... బయోమెట్రిక్ విధానంలో మొదటగా ఆధార్ కార్డులున్న పింఛన్‌దారులు, కూలీలకు సంబంధించి ఫొటోలు, వేలిముద్రలను పీఓటీ యంత్రంలో ఎన్రోల్మెంట్ చేశాం. ఆధార్ కార్డులు లేనివారికి వేలిముద్రల ఆధారంగా పోస్టుమాస్టర్లు డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు ఆ విధానం తొలగించడంతో మేమే వేలిముద్రలు, ఫొటోలను తీసుకుంటూ వారికి సంబంధించిన డాటాను పీఓటీ మిషన్‌లోకి డౌన్లోడ్ చేస్తున్నాం. ఒక్కోసారి వేళ ్లకు తేమ ఉండడం.. వేలి చర్మం పొట్టు లేవడం వంటి కారణాలతో ఆ యంత్రం ఫెయిల్డ్ ఆప్షన్ చూపుతోంది. దీనివల్ల వారికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. దీంతో మేమే ప్రతి గ్రామం తిరుగుతూ.... ఎవరికి డబ్బులు రావడం లేదో వారి వేలిముద్రలు, ఫొటోలను సేకరిస్తున్నాం. - దిలీప్, టీసీఎస్ మండల ఫీల్డ్ ఆఫీసర్ రెండుసార్ల గిట్లనే తిరిగిన.. పోస్టాఫీసులో పింఛన్కని పోతే నా చేతియేళ్లు మంచిగపడట్లేదని పోస్టయిన చెప్పిండు. గిదేందనడిగితే వేలిముద్రలు మంచిగపడట్లే.. మళ్లపోయి ఫొటోదిగి, వేలి ముద్రలు ఏపించుకునిరా... అప్పడే డబ్బులిత్తనన్నడు. ఇప్పటికి ఇట్టా జరగబట్టి రెండోసారి. ఇప్పుడు కూడా పింఛన్రాలే. వచ్చే నెలదాక ఆగాలంటాండ్రు. - ఎస్కే.జానీమియా, కేసముద్రం విలేజ్ తలనొప్పిగా మారింది... పింఛన్ కోసం వచ్చినోళ్లను మీరు ఫొటోలు దిగిరండని చె ప్తే... ఇన్ని రోజులు ఎట్టా ఇచ్చినవ్.. ఇప్పుడు ఎందుకు ఇవ్వవ్ అని గొడవ చేస్తాండ్రు, ఆధార్‌కార్డులు ఉన్నవారికే ఇప్పుడు ఇస్తానం. లేనివాళ్లను ఫీల్డ్ ఆఫీసర్ వద్దకు పంపిస్తానం. అరుునా.. కొంతమంది వేలిముద్రలు ఫెయిల్డ్ అని వస్తానయ్. ఇది మాకు తలనొప్పిగా మారింది. - మొయినొద్దీన్, బ్రాంచ్ పోస్టుమాస్టర్, కేసముద్రం విలేజి