27,83,00,000
జమ్మలమడుగు: వందలు..వేలు.. లక్షలు కాదు.. ఏకంగా 27 కోట్ల 83 లక్షల రుపాయలు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసిన కూలీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం ఇది. మే 24వ తేదీ నుంచి ఉపాధి కూలీలకు డబ్బు రాలేదు. ఉపాధి పనులు చేసిన వారికి ప్రతి శనివారం ఫీల్డ్ అసిస్టెంట్లద్వారా కూలి డబ్బులు అందజేస్తారు.
రాష్ట్ర విభజన నేపధ్యంలో కూలి డబ్బులు నిలిచిపోయినట్లు ఆశాఖకు చెందిన అధికారులు పేర్కొంటున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం 2006లో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం వర్షాలు సక్రమంగా లేకపోవడంతో రైతు కూలీలకు వ్యవసాయ పనులు లేక ఉపాధి లేకుండా పోయింది. జిల్లాలోని 50 మండలాల్లో 5 లక్షలకు పైగా ఉపాధి కూలీలు రెండు నెలలుగా పనులు చేశారు. దాదాపు 50 రోజులు కావస్తున్నా వీరికి కూలి డబ్బులు అందలేదు.
జిల్లాలో ఉపాధి పనులు చేసిన కూలీలకు దాదాపు 27 కోట్ల వరకు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. తాము చేసిన పనులకు కూలి డబ్బు ఎప్పుడిస్తారంటూ కూలీలు అధికారుల చుట్టూ పోస్టాఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఫీల్ట్ అసిస్టెంట్లు మాత్రమే ఉపాధి పనులు చేయించుకుంటున్నారు. అధికారులు గ్రామాలకు వెళ్లడం లేదు. గ్రామాలకు వెళితే కూలిడబ్బుల కోసం తమను ఎక్కడ నిలదీస్తారోననే భయం వారిలో నెలకొంది. తమకు వెంటనే ఉపాధి కూలి డబ్బులు ఇవ్వాలని కూలీలు కోరుతున్నారు. లేని పక్షంలో కుటుంబాలను పోషించుకోవడానికి వలసలు వెళ్లాల్సి వస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.