ఉపాధిలో పొదుపు
ఉపాధి కూలీలను చెడువ్యవసనాలకు దూరంగా ఉంచేందుకు వారిలో పొదుపును అలవాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యసనాలకు ఖర్చు చేసే సొమ్మును మదుపు చేయించడం ద్వారా వారి భవిష్యత్ అవసరాలకు భరోసా కల్పించే విధంగా కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనపై ఇటీవల జరిగిన డ్వామా పీడీల జాతీయస్థాయి సదస్సులో సుదీర్ఘ చర్చ జరిగింది. కూలీల నుంచి అభిప్రాయ సేకరణ అనంతరం ఈ పొదుపు పథకాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి జనవరి నుంచి అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది.
- కూలీమొత్తం పొదుపు ఖాతాకు మళ్లింపు
- ఆర్డీలపై ఇచ్చే 8.5 శాతం వడ్డీ చెల్లింపు
- చెడు వ్యసనాల నుంచి దారి మళ్లించేందుకే
సాక్షి, విశాఖపట్నం : ఉపాధి హామీ పథకంలో సంపాదించే మొత్తంలో ముప్పై నుంచి 40 శాతం మద్యం, ఇతర వ్యసనాల కోసం కూలీలు ఖర్చు చేస్తున్నట్టుగా ఇటీవల ఒక సర్వేలో కేంద్రం గుర్తించింది. 80 శాతం మంది పురుషులు, 30 శాతం మంది మహిళలు ఇలా వ్యసనాలకు ఖర్చు చేస్తున్నట్టు నిర్ధారణైంది. వీరిలో పొదుపు అలవాటును పెంపొందించగలిగితే వ్యసనాలకు చేసే ఖర్చు తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. తొలుత వీరు సంపాదించే మొత్తంలో కనీసం 10 శాతం మొత్తాన్ని పొదుపు చేయించాలని నిర్ణయించారు.
సాధారణంగా ఉపాధి పథకంలో ఆర్నెల్లు మాత్రమే పనులుంటాయి. మిగిలిన ఆర్నెల్లు కూలీలు ఇతర పనులకు వెళ్తుంటారు. ఉపాధి పనులు చేసినంత కాలం ప్రతీ నెలా వారు సంపాదించిన మొత్తంలో 10 శాతం మొత్తాన్ని సేవింగ్ అకౌంట్‌లో జమచేస్తారు. సాధారణంగా సేవింగ్ అకౌంట్‌లో జమ చేసే మొత్తంపై కేవలం 4 శాతం మాత్రమే వడ్డీ ఇస్తారు.ప్రతీనెలా కొంత మొత్తం చొప్పున ఏడాదిపొడవునా పొదుపు చేస్తేనే రికవరింగ్ డిపాజిట్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఈ అకౌంట్‌లో పొదుపుచేసే మొత్తానికి మాత్రమే బ్యాంకులు 8.5 శాతం వడ్డీ చెల్లిస్తాయి. కానీ ఉపాధి కూలీల కోసం కేంద్రం కాస్త వెసులుబాటు కల్పించింది.
సేవింగ్ ఖాతాలో పొదుపు చేసే కూలీల మొత్తానికి కూడా ఆర్డీలపై చెల్లించే 8.5 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలని నిర్ణయించింది. ఉదాహరణకు ఏదైనా కూలీ రోజుకు గరిష్టంగా రూ.169ల చొప్పున ఏడాదికి 100 రోజుల పాటు ఉపాధి పొందితే అతను సంపాదించే రూ.16,900లలో 10శాతం చొప్పున రూ.1690ల మొత్తం సేవింగ్ ఖాతాలో అటోమేటిక్‌గా జమవుతుంది. మన రాష్ర్టంలో ఉపాధి హామీ పథకంలో 80,68,349 జాబ్ కార్డుల పరిధిలో కోటి 72లక్షల83వేల 712 మంది కూలీలున్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 31లక్షల35వేల92 కుటుంబాల పరిధిలో 52 లక్షల 11వేల586 మంది కూలీలు పనులు చేస్తున్నారు. ప్రస్తుత సీజన్‌లో రూ.252కోట్ల 41 లక్షల 84వేల విలువైన 26లక్షల 76వేల 41పనులు గుర్తించగా, ఇప్పటివరకు రూ.107 కోట్ల విలువైన 14లక్షల 70వేల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులను బట్టి ఎంత తక్కువ లెక్కేసుకున్నా రూ.25 కోట్ల మేర కూలీలు పొదుపుచేసే అవకాశం ఉంటుంది.
ఈ పొదుపు పథకానికి సంబంధించిఇప్పటికే మార్గదర్శకాల రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ఇటీవల పీడీల కాన్ఫరెన్స్‌లో ఈపథకంపై పీడీల అభిప్రాయాలు కేంద్రం సేకరించింది. డిసెంబర్ నెలాఖరులోగా కూలీలనుంచి అభిప్రాయాలు సేకరించిన వచ్చే సీజన్ నుంచి అమలు చేయాలన్న కృతనిశ్చయంతో కేంద్రం ఉన్నట్టుగా ఉపాధి హామీ అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల ఉపాధి కూలీల్లో పొదుపు అలవాటు పెరగడంతో పాటు వ్యసనాలకు దూరమయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.