ఒడిశాలో వృద్ధురాలి కష్టాలు
కియోంఝర్(ఒడిశా): వృద్ధాప్య పెన్షన్ కోసం పండుటాకులాంటి బామ్మ పడరాని పాట్లు పడుతున్న దృశ్యం ఒడిశాలో కనిపించింది. పెన్షన్ కావాలంటే పంచాయతీ ఆఫీస్‌దాకా వచ్చి నువ్వే తీసుకో అని అధికారులు తెగేసి చెప్పడంతో 80 ఏళ్ల బామ్మ 2 కి.మీ.లు పాక్కుంటూ వెళ్లింది. శనివారం జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ కావడంతో అధికారులపై అందరూ మండిపడుతున్నారు.
ఒడిశా రాష్ట్రంలోని సీఎం మోహన్ చరణ్ మాఝీ సొంత జిల్లా కియోంఝర్‌లోని రైసాన్‌లో ఘటన జరిగింది. గ్రామంలోని పథూరీ దేహరీ అనే బామ్మ నడవలేని దుస్థితి. ఇలాంటి వృద్ధులకు ఇంటి వద్దే పెన్షన్ అందజేయాలని ఉత్తర్వులు ఉన్నాయి. కానీ వాటిని అమలుచేసిన నాథుడే లేడు. శనివారం గ్రామ పంచాయతీలో పెన్షన్లు ఇస్తున్న విషయం తెల్సుకుని బామ్మ బురద ఉన్న ఎర్రమట్టి బాట గుండా పాకుతూ వచ్చి పెన్షన్ తీసుకున్నారు.
వృద్ధురాలు ఇంత కష్టపడి కార్యాలయానికి వస్తుంటే పట్టించుకోరా? అని బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ గీతా ముర్మును కొందరు నిలదీశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఇకపై బామ్మకు ఇంటి వద్దే పెన్షన్ ఇస్తామని మాటిచ్చారు. ఆమెకు ఒక చక్రాల కుర్చీని సైతం అందజేశారు. ఇకపై ఇంటి వద్దే రేషన్ సైతం అందిస్తామని స్పష్టంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment