లక్నో: యూపీలోని కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు.
మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు.
కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు .
షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు.
ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు.
ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH
— Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023
.#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy
ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా?
Comments
Please login to add a commentAdd a comment