తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
- వైఎస్సార్ ఫొటో ధ్వంసం చేసి పంచాయతీ కార్యాలయంలో టీడీపీ చోటా నేత ఫొటో
- సర్పంచ్‌ను కాదని తెగులు తమ్ముళ్ల వీరంగం
- పోలీసులకు, డీపీవోకు సర్పంచ్ ఫిర్యాదు
పెనుమూరు : పెనుమూరు పంచాయతీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో తొలగించి కనీసం వార్డు మెంబర్ కూడా కాని దివంగత టీడీపీ నేత ఫొటోను తగిలించి తెలుగుదేశం పార్టీ నాయకులు నీచ రాజకీయాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ జిల్లా సంయుక్త కార్యదర్శి బి.నరసింహారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం వైఎస్సార్ సీపీ నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోందన్నారు.
గత నెల 30వ తేదీ కలవగుంట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నాగమ్మ మెమోరియల్ ట్రస్ట్ బోధన సామగ్రి పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపీపీ హరిబాబు నాయుడు, జెడ్పీటీసీ సభ్యుడు రుద్రయ్యనాయుడు, ఎంపీటీసీ సభ్యుడు సలాం, తెలుగు యువత మండల అధ్యక్షుడు కార్తీక్, పలువురు నేతలు పంచాయతీ కార్యాలయానికి వెళ్లారని తెలిపారు.
కార్యాలయ గోడపై ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో తొలగించి పగుల కొట్టారన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఫొటో స్థానంలో మరణించిన స్థానిక టీడీపీ నేత భాస్కరనాయుడు ఫొటో పెట్టి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారని చెప్పారు. సర్పంచ్ అనుమతి లేకుండా నిబంధనలు అతిక్రమించి వార్డు మెంబర్ కూడా కాని టీడీపీ నేత ఫొటో పెట్టి నివాళులర్పించడం న్యాయమేనా అని ప్రశ్నించారు. భాస్కర్‌నాయుడుపై అభిమానం ఉంటే విగ్రహం పెట్టుకోవాలని సూచించారు. కలవగుంట సర్పంచ్ ఆమీన్ మాట్లాడుతూ శనివారం పంచాయతీ కార్యాలయానికి వచ్చి చూడగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫొటో తొలగించి, ఆ స్థానంలో టీడీపీ నాయకుడు భాస్కర్‌నాయుడు ఫొటో ఉందన్నారు.
విచారించగా తెలుగుదేశం నాయకుల సమక్షంలో తెలుగు యువత అధ్యక్షుడు కార్తీక్ తన అనుచరులతో తప్ప తాగి వైఎస్ ఫొటో తొలగించి కాలు కింద వేసి తొక్కినట్లు తెలిసిందన్నారు. ఈమేరకు పెనుమూరు ఎస్‌ఐ శ్రీనివాసులు, ఎంపీడీవో శివరాజు, డీపీవోకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల రైతు విభాగం అధ్యక్షుడు కారేటి గోవిందరెడ్డి పలువురు నేతలు పాల్గొన్నారు.