గొల్లప్రోలు :మండలంలోని తాటిపర్తి గ్రామంలో మంగళవారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పంచాయతీ కార్యాలయ సమీపంలో ఉన్న హోటల్‌ను తొలగించే ప్రయత్నంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి చెందిన దాసం నాగరాజు కుటుంబం 70 ఏళ్లుగా పంచాయతీ కార్యాలయ సమీపంలో హోటల్ నిర్వహిస్తోంది. నాగరాజు మరణానంతరం అతడి కొడుకు రాజబాబు ఈ హోటల్ ద్వారా జీవనోపాధి పొందుతున్నాడు. మూడు నెలలు క్రితం రాజబాబు కూడా మంచానపట్టాడు. దీంతో అతడి భార్య చంద్రావతి, ఇద్దరు కుమార్తెలు హోటల్ నడుపుతున్నారు. కాగా సోమవారం రాత్రి పంచాయతీ సిబ్బంది హోటల్‌ను పడగొట్టి ఆ స్థలంలో ఇటుకలు పేర్చారు. పడగొట్టిన స్థలంలో బరకం(టార్పలిన్) కప్పుకుని యథావిధిగా మంగళవారం చంద్రావతి హోటల్ నడిపింది. సాయంత్రం పంచాయతీ సిబ్బంది వచ్చి హోటల్‌ను తొలగించాలని ఆదేశించారు.
దీంతో హోటల్ నిర్వాహకుడు రాజబాబు కుటుంబసభ్యులు తాము 70 ఏళ్లుగా హోటల్ నడుపుకుంటున్నామని, ఇప్పుడు తొలగిస్తే ఎలా బతికేదని సిబ్బందిని ప్రాధేయపడ్డారు. అయితే పంచాయతీ సిబ్బంది అవేవీ పట్టించుకోకుండా మహిళలను తోసివేసి హోటల్ సామాన్లు చిందరవందరగా పడేశారు. పంచాయతీ రిక్షాలను హోటల్ స్థలంలో మళ్లించారు. దీనిని అడ్డుకోబోయిన రాజబాబు, అతడి భార్య సత్యవతిపై దురుసుగా ప్రవర్తించారు. అవమానం భరించలేని కుటుంబసభ్యులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ సమయంలో స్థానికులు అడ్డుకుని వారిని వారించారు. తమపై కావాలనే పంచాయతీ సర్పంచ్,
ఇతరనాయకులు వేధింపులకు గురిచేస్తున్నారని చంద్రావతి ఆరోపించింది. ప్రభుత్వ స్థలంలో 30కుపైగా షాపులు ఉండగా తమపై కక్ష కట్టారన్నారు. రాజకీయ నాయకుడి విగ్రహం ఏర్పాటుకు తమ జీవనాధారమైన హోటల్‌ను ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై, తన కుటుంబంపై దాడి చేసిన, చేయించిన పంచాయతీ సిబ్బంది, సర్పంచ్‌పైన పోలీస్ కేసు పెడతానని తెలిపారు. కాగా పంచాయతీ కాంట్రాక్ట్ సిబ్బంది జి. శివశ్రీనువాస్ మాట్లాడుతూ సర్పంచ్ ఆదేశాల మేరకు ఆక్రమణను తొలగించామన్నారు. తాము ఎవరిపైనా దాడికి దిగలేదన్నారు.
తాటిపర్తిలో ఉద్రిక్తత
Published Wed, Nov 5 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM
Advertisement