పుల్‌కల్, న్యూస్‌లైన్ : ‘గుడుంబా తయారు చేయనీయం, మద్యం అమ్మనీయం.. గట్లైతేనే మా బతుకులు మంచిగ ఉంటయ్’ అంటూ మండలంలోని బొమ్మారెడ్డిగూడ తండా గిరిజనులు, సర్పంచ్ శోభాబాయి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. వివరాలకు వెళితే.. గుడుంబా, మద్యం తాగడం వల్ల మా సంసారాలు వీధుల పాలవుతున్నాయంటూ పలువురు గిరిజనులు శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము ఎంత సంపాదించినా మగవాళ్లు తాగనీకే సరిపోతోందని తెలిపారు. దీంతో సంసార ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో సారా, మద్యం ఎవరూ విక్రయించ కూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు వివరించారు. ఒకవేళ ఎవరైనా విక్రయించినట్లు తెలిస్తే పోలీసులకు పట్టిస్తామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గ్రామంలో ఎవరైనా మద్యం, డబ్బు పంచితే వారిని కటకటాలలోకి నెట్టేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా తీర్మాన పత్రాన్ని ఎస్‌ఐ లోకేష్‌కు అందించారు.
మహిళ, యువజన సంఘాలతో కమిటీ
మద్యంపై కదం తొక్కిన సందర్భంలో మహిళలు, యువజన సంఘాలతో ఓ కమిటీగా ఏర్పడ్డారు. మహిళల నుంచి లలిత, మేనక, లక్ష్మి, డ్వాక్రా గ్రామ సంఘాల నుంచి రేణుక, యువజన సంఘాల ఆద్వర్యంలో జైల్‌సింగ్, సుశీల్, తిలక్, గౌతమ్‌లను ఎన్నుకున్నారు.
ఆ సందర్భంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో పోలీసులతో కలిసి గుడుంబా తయారు చేసే సామగ్రి పగులగొట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ లోకేష్ మాట్లాడుతూ గుడుంబా, మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. సమాచారం తెలిస్తే 94409 01840, 084502 73733కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.
మద్యం అమ్మనీయమని ప్రతిజ్ఞ
Published Sun, Mar 23 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 5:01 AM
Advertisement