పంచాయతీల ‘గోడు’
Published Mon, Jan 6 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM
విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: అధికారుల చిత్తశుద్ధి లోపమో., ప్రజాప్రతినిధుల అలసత్వమో..పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలకు శాపంగా మారింది. నిధులున్నా వాటి నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. పంచాయతీలకు సొంత గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంచాయతీలకు సొంత గూడు కలగానే మిగిలిపోనుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నా యి. జిల్లాలో 928 పంచాయతీలు ఉండగా అందులో మూ డు పంచాయతీలను గత ఏడాది విజయనగరం మున్సిపాల్టీలో విలీనం చేశారు. మరో రెండు మేజర్ పంచాయతీలను విలీనం చేసి నగర పంచాయతీగా మార్పు చేశారు.
ఇంకో రెండు పంచాయతీలు తోటపల్లి ప్రాజెక్టులో ముంపునకు గురవడంతో అక్కడి ప్రజలు వివిధపంచాయతీలకు తరలిపోవడంతో ఆ రెండింటినీ జిల్లా అధికారులు పంచాయతీల కింద పరిగణించడం లేదు. దీంతో ప్రస్తుతం 921 పంచాయతీలుండగా వాటిలో 80 శాతం పంచాయతీలకు సొంత భవనాలు లేవు. మరికొన్ని భవనాలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయి. దీంతో అద్దె భవనాలే పంచాయతీ కార్యాలయాలకు దిక్కుగా మారాయి. అయితే 2011లో పంచాయతీలకు సొంత భవనాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం జిల్లా అధికారుల నుంచి ప్రతిపాదనలు కోరింది. ఇందులో భాగంగా జిల్లా పంచాయతీ అధికారులు పంపించిన ప్రతిపాదనలను పరిశీలించిన ఆ శాఖ కమిషనర్ మొత్తం 486 పంచాయతీలకు సొంత భవనాలు నిర్మించుకునేందుకు ఆమోదం తెలిపారు.
ఒక్కో పంచాయతీ భవనం నిర్మాణానికి రూ.10లక్షల వరకు నిధులు కూడా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. అయితే మంజూరైన 486 పంచాయతీ భవనాల్లో 390 మాత్రమే పరిపాలనా పరమైన ఆమోదం పొందినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా వాటి నిర్మాణ ప్రగతిని పట్టించుకునే నాథుడు లేక పోవడంతో మంజూరైన మొత్తం భవనాల్లో ఎన్ని నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయో అధికారులకే లెక్క తెలియని పరిస్థితి నెల కొంది.
వాస్తవానికి వీటి నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగానికి అప్పగించారు. సుమారు 80 నుంచి 100 వరకు భవనాల నిర్మాణాలు పూర్తయినట్లు కాకిలెక్కలు చెబుతున్నారే తప్ప కచ్చితమైన సంఖ్యను చెప్పలేకపోవడం గమనార్హం. మరో 80 పంచాయతీల్లో ఇప్పటికీ నిర్మాణాలు ప్రారంభం కాని పరిస్థితి ఉండగా మిగిలిన పంచాయతీల్లో భవన నిర్మాణాలు వివిధస్థాయిల్లో జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు శ్రద్ధ వహించి పంచాయతీ భవనాల నిర్మాణాలపై దృష్టి సారించి అవి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పంచాయతీల పాలకులు, కార్యదర్శులు, గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.
Advertisement
Advertisement