కొల్చారం: రేషన్ దుకాణంలో నిత్యవసర వస్తువులు ఇవ్వడం లేదంటూ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితరులను గ్రామస్తులు పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామానికి చెందిన 240 మంది లబ్ధిదారులకు నాలుగు నెలలుగా రేషన్ అందడం లేదు... అలాగే నాలుగు నెలల క్రితం ఉన్నట్టుండి లబ్ధిదారుల పేర్లు కీ రిజిస్టర్ నుంచి మాయం అయ్యాయి.
దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఆ క్రమంలో ఈ రోజు సాదాబైనామల గురించి సదస్సులో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో చంద్రయ్య, టెస్కో రాష్ట్ర డెరైక్టర్ అరిగె రమేష్ గ్రామానికి వచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహంతో అధికారులను పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉంచి బయట గడియపెట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు.
పోలీసులు వచ్చి ఆర్డీవోతో మాట్లాడారు. బుధవారం నాటికి సగం మందికి బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మిగిలిన వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.