villagers protests
-
ఊటుకూరు ఉగ్రరూపం
నిరసన నినాదం హోరెత్తింది.ఆగ్రహ జ్వాల ఎగిసిపడింది. ఓ వైపుఖాకీ బూట్ల చప్పుళ్లు.. మరోవైపు ప్రజల నిరసనాగ్రహంతో ఊటుకూరు రణరంగాన్ని తలపించింది. సాగునీరిచ్చే చెరువు భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు సోమవారం రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తేల్చిచెప్పారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: పరిగి మండలంలోని ఊటుకూరు చెరువు సమీపంలో చెన్నై కంపెనీ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్తో సోమవారం ఊటుకూరు, బీచిగానిపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కియా కంపెనీకి అనుబంధంగా నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గ్రామస్తుంలా స్థానిక బస్టాండ్ వద్ద సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా, రాష్ట్ర నాయకులు వస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈక్రమంలోనే కొందరు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ తాజా మాజీ సర్పంచ్ ఈశ్వరప్ప, టీడీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమ నిర్మాణం చేపడితే తామంతా ఆత్మహత్యలు చేసుకంటామని తేల్చిచెప్పారు. ఇంతలోనే ముగ్గురు యువకులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు. అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామసభ నిర్వహించిన స్థానికులు అనంతరం పరిశ్రమ నిర్మాణ ప్రదేశంలో నిరసన తెలిపేందుకు భారీ సంఖ్యలో బయలుదేరారు. అప్పటికే ఊటుకూరుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్పెషల్ ప్రొటక్షన్ పోలీసులతో కలిసి ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు వారిని అడ్డుకుని పోలీసులు స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకున్న కొందరు పరిశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకునేందుకు వెళ్లగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై ఆగ్రహం ఊటుకూరు ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి, స్థానిక సర్పంచ్తో కలిసి చెన్నై కంపెనీ వారితో ఒప్పందం చేసుకుని ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. కనీసం తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులతో కొట్టించారని వాపోయారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరులు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నిర్మాణానికి పంచాయతీ సర్పంచ్ ఏకపక్షంగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చెరువు మునకలో పరిశ్రమ నిర్మాణానికి పూనుకోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. చెరువులోకి నీరు వచ్చే కాలువ నుంచి పరిశ్రమ ఏర్పాటు కోసమని డైవర్షన్ కెనాల్ ఎలా నిర్మిస్తారన్నారు. ఈడైవర్షన్ కెనాల్ వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఏదో ఓరోజు ఫ్యాక్టరీ యాజమాన్యమే నీరు చెరువులోకి రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు. గ్రామస్తులను ఈడ్చుకెళ్లిన పోలీసులు విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన ఆర్డీఓ ఓబులేసు ఆందోళన కారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి శాఖాపరమైన అంశాలన్నీ పరిశీలించామని ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు తమ జీవనాధారంపై ప్రభావం చూపే ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకునేది లేదన్నారు. దీంతో పోలీసులు ముఖ్య నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. వారందరినీ స్టేషన్ తరలించేందుకు సిద్ధం కాగా స్థానికులంతా అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరగ్గా..పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళంలోనే పోలీసులు 50 మందిని పోలీస్స్టేషన్లకు తరలించారు. పోలీసుల చర్యను నిరసిస్తూ రాస్తారోకో పోలీసుల చర్యను నిరసిస్తూ ఉటుకూరు, బీచిగానిపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బీకే పార్థసారధికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అరెస్టులు చేసిన వారందరినీ విడుదల చేయాలంటూ హిందూపురం పెనుకొండ రహదారిపై కూర్చుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. సాయంత్రం అరెస్టు చేసిన వారిని సొంత పూచికత్తుతో విడుదల చేసినట్లు తెలిసింది. -
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత.
-
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
-
పాణ్యం పీఎస్ వద్ద గ్రామస్థుల ఆందోళన
పాణ్యం : కర్నూలు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసులు బనాయించి తమ వారిని తీవ్రంగా హింసిస్తున్నారంటూ ఓ మహిళ పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన పాణ్యం పోలీస్ స్టేషన్ ఎదుట గురువారం చోటుచేసుకుంది. కొండజూటూరు గ్రామంలో ఏర్పాటు చేయనున్న నానో కెమికల్ ప్యాక్టరీని అడ్డుకుంటున్న గ్రామస్థులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు మరింత మందిపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పోలీస్స్టేషన్ ఎదుట ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి యత్నించింది. దీంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత
-
బందరు పోర్టు భూసేకరణపై ఉద్రిక్తత
కృష్ణా : బందరు పోర్టు భూ సేకరణపై బాధిత గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోర్టు అనుబంధ పరిశ్రమలకు భూములు ఇచ్చేది లేదంటూ కరగ్రాహారం, పోతేపల్లి, బొరబోతుపాలెం గ్రామాల ప్రజలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. పోర్టు నిర్మాణానికి చేపట్టిన అవగాహన సదస్సులను గ్రామస్తులు బహిష్కరించారు. భూ సేకరణ జోవోను రద్దు చేయాలంటూ అధికారులను బాధిత గ్రామాల ప్రజలు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో మూడు గ్రామాల్లో భారీగా పోలీసులను మోహరించారు. -
‘మా గ్రామాలను కోట్పల్లిలో కలపవద్దు’
రంగారెడ్డి జిల్లా : రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాల కోసం ఉద్యమాలు ఊపందుకున్నాయి. అందులో భాగంలో రంగారెడ్డి జిల్లాలో ప్రజలు తమ గ్రామాలను కొత్తగా ఏర్పడబోయే మండలంలో కలపవద్దంటూ ఆందోళనకు దిగారు. నాగ సమందర్, గడ్డమీది గంగారం, కొండాపూర్ కలాన్ గ్రామాలకు కోట్పల్లి మండలంలో కలపవద్దంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధారూరు మండలకేంద్రంలో తాండూరు-హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నా చేపట్టారు. ప్రభుత్వం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో అన్ని పార్టీలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు. -
దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా ఆందోళన
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వాకదారిపేటలో ఏర్పాటు చేయనున్న దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. గ్రామస్థులు ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. తమ గోడు వినకుండా.. పరిశ్రమ నిర్మాణం చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని గ్రామస్థులు హెచ్చరించారు. పరిశ్రమ ఏర్పాటు చేసే స్థలంలో ఉన్న గుడిసెలకు కొందరు మహిళలు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మద్దతు తెలిపారు. దివీస్ ల్యాబొరేటరీ ఏర్పాటును నిలిపివేయాలని రాజా డిమాండ్ చేశారు. -
నీటి సమస్యను పరిష్కరించాలంటూ ధర్నా
జక్రాన్పల్లి: తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ఉదయం గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. జక్రాన్పల్లి మండలం పడకాల్ గ్రామస్తులు 10 లారీల్లో వచ్చి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. అనంతరం గ్రామస్తులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. -
ప్రత్యేక మండలం కోరుతూ రాస్తారోకో
బిచ్కుంద: నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక మండలం కోరుతూ సోమవారం ఉదయం గ్రామస్తులు రాస్తారోకో చేశారు. బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయాలంటూ రోడ్డెక్కారు. హైదరాబాద్-నాందేడ్ రహదారిపై రాస్తారోకోకు దిగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. -
రేషన్ రావడం లేదని అధికారుల నిర్బంధం
కొల్చారం: రేషన్ దుకాణంలో నిత్యవసర వస్తువులు ఇవ్వడం లేదంటూ అధికారులను నిర్బంధించారు. ఈ ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో తదితరులను గ్రామస్తులు పంచాయతీరాజ్ కార్యాలయంలో నిర్బంధించారు. గ్రామానికి చెందిన 240 మంది లబ్ధిదారులకు నాలుగు నెలలుగా రేషన్ అందడం లేదు... అలాగే నాలుగు నెలల క్రితం ఉన్నట్టుండి లబ్ధిదారుల పేర్లు కీ రిజిస్టర్ నుంచి మాయం అయ్యాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం ఉన్నారు. ఆ క్రమంలో ఈ రోజు సాదాబైనామల గురించి సదస్సులో భాగంగా డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, వీఆర్వో చంద్రయ్య, టెస్కో రాష్ట్ర డెరైక్టర్ అరిగె రమేష్ గ్రామానికి వచ్చారు. దీంతో బాధితులు ఆగ్రహంతో అధికారులను పంచాయతీరాజ్ కార్యాలయంలో ఉంచి బయట గడియపెట్టారు. అనంతరం రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు వచ్చి ఆర్డీవోతో మాట్లాడారు. బుధవారం నాటికి సగం మందికి బియ్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మిగిలిన వారి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.