
ఎమ్మెల్యే బీకే, స్థానిక మాజీ సర్పంచ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్న దృశ్యం
నిరసన నినాదం హోరెత్తింది.ఆగ్రహ జ్వాల ఎగిసిపడింది. ఓ వైపుఖాకీ బూట్ల చప్పుళ్లు.. మరోవైపు ప్రజల నిరసనాగ్రహంతో ఊటుకూరు రణరంగాన్ని తలపించింది. సాగునీరిచ్చే చెరువు భూముల్లో ఫ్యాక్టరీ నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు సోమవారం రోడ్డెక్కారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రాణ త్యాగాలకైనా సిద్ధమని తేల్చిచెప్పారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: పరిగి మండలంలోని ఊటుకూరు చెరువు సమీపంలో చెన్నై కంపెనీ పరిశ్రమకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలనే డిమాండ్‌తో సోమవారం ఊటుకూరు, బీచిగానిపల్లి పంచాయతీ గ్రామాల ప్రజలు ఆందోళనకు దిగారు. కియా కంపెనీకి అనుబంధంగా నిర్మించతలపెట్టిన ఫ్యాక్టరీ పనులను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తొలుత గ్రామస్తుంలా స్థానిక బస్టాండ్ వద్ద సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీఎం జిల్లా, రాష్ట్ర నాయకులు వస్తారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారిని చెదరగొట్టారు. ఈక్రమంలోనే కొందరు స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి, టీడీపీ తాజా మాజీ సర్పంచ్ ఈశ్వరప్ప, టీడీపీ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమ నిర్మాణం చేపడితే తామంతా ఆత్మహత్యలు చేసుకంటామని తేల్చిచెప్పారు. ఇంతలోనే ముగ్గురు యువకులు ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా.. గ్రామస్తులు అడ్డుకున్నారు.
అడుగడుగునా అడ్డుకున్న పోలీసులు
పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తూ గ్రామసభ నిర్వహించిన స్థానికులు అనంతరం పరిశ్రమ నిర్మాణ ప్రదేశంలో నిరసన తెలిపేందుకు భారీ సంఖ్యలో బయలుదేరారు. అప్పటికే ఊటుకూరుకు పెద్ద సంఖ్యలో చేరుకున్న స్పెషల్ ప్రొటక్షన్ పోలీసులతో కలిసి ధర్మవరం డీఎస్పీ వెంకటరమణ, సీసీఎస్ డీఎస్పీ శ్రీనివాసులు వారిని అడ్డుకుని పోలీసులు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి తప్పించుకున్న కొందరు పరిశ్రమ నిర్మాణ స్థలానికి చేరుకునేందుకు వెళ్లగా పోలీసులు వారినీ అడ్డుకున్నారు.
ఎమ్మెల్యే బీకే పార్థసారథిపై ఆగ్రహం
ఊటుకూరు ప్రజల మనోభావాలను లెక్కచేయకుండా స్థానిక ఎమ్మెల్యే బీకే పార్థసారథి, స్థానిక సర్పంచ్‌తో కలిసి చెన్నై కంపెనీ వారితో ఒప్పందం చేసుకుని ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని గ్రామస్తులు ఆరోపించారు. కనీసం తమ బాధలు చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులతో కొట్టించారని వాపోయారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరులు మాట్లాడుతూ, ఫ్యాక్టరీ నిర్మాణానికి పంచాయతీ సర్పంచ్ ఏకపక్షంగా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. చెరువు మునకలో పరిశ్రమ నిర్మాణానికి పూనుకోవడం వల్లే సమస్య ఉత్పన్నమవుతోందన్నారు. చెరువులోకి నీరు వచ్చే కాలువ నుంచి పరిశ్రమ ఏర్పాటు కోసమని డైవర్షన్ కెనాల్ ఎలా నిర్మిస్తారన్నారు. ఈడైవర్షన్ కెనాల్ వల్ల భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నమవుతాయని.. ఏదో ఓరోజు ఫ్యాక్టరీ యాజమాన్యమే నీరు చెరువులోకి రాకుండా అడ్డుకునే ప్రమాదం ఉందన్నారు.
గ్రామస్తులను ఈడ్చుకెళ్లిన పోలీసులు
విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి వచ్చిన ఆర్డీఓ ఓబులేసు ఆందోళన కారులతో మాట్లాడారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి శాఖాపరమైన అంశాలన్నీ పరిశీలించామని ఇందులో ఎలాంటి అభ్యంతరాలు లేవన్నారు. దీంతో ఆగ్రహించిన ప్రజలు తమ జీవనాధారంపై ప్రభావం చూపే ఫ్యాక్టరీ కట్టడానికి ఒప్పుకునేది లేదన్నారు. దీంతో పోలీసులు ముఖ్య నేతలను ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. వారందరినీ స్టేషన్ తరలించేందుకు సిద్ధం కాగా స్థానికులంతా అడ్డుకున్నారు. ఈక్రమంలోనే తోపులాట జరగ్గా..పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళంలోనే పోలీసులు 50 మందిని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.
పోలీసుల చర్యను నిరసిస్తూ రాస్తారోకో
పోలీసుల చర్యను నిరసిస్తూ ఉటుకూరు, బీచిగానిపల్లి గ్రామస్తులు రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బీకే పార్థసారధికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అరెస్టులు చేసిన వారందరినీ విడుదల చేయాలంటూ హిందూపురం పెనుకొండ రహదారిపై కూర్చుని వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళన కారులను చెదరగొట్టారు. సాయంత్రం అరెస్టు చేసిన వారిని సొంత పూచికత్తుతో విడుదల చేసినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment