డేటా ఎంట్రీలో ఇబ్బందులు
ఇంకా సిద్ధంకాని పింఛన్ల జాబితా
ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు
ఈమె పేరు బుర్రు కొమురమ్మ(70). పెళ్లి అయిన మూడేళ్లకే భర్త రాజయ్య మృతి చెందాడు. 50 ఏళ్ల క్రితం రెండేళ్ల కూతురుతో ఎల్లాపురం వచ్చి తల్లిగారింట్లో స్థిరపడింది. ప్రస్తుతం కూతురు కూడా మృతి చెందగా.. ప్రభుత్వం ఇచ్చే రూ.200 పింఛన్‌తో కాలం వెళ్లదీసేది. అయితే, నాలుగు నెలలుగా ఈ పెన్షన్ ఆగిపోగా.. చుట్టు పక్కల వారు పెడితే తినడం.. లేకుంటే పస్తులతో కాలం వెళ్లదీసింది. ఈనెల 9 నుంచి రూ.1000 పింఛన్ వస్తుందని సంబరపడింది. ఐదు రోజులు పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరిగినా ఎవరూ స్పందించలేదు. ఇక పింఛన్ రాదేమోననే బెంగతో శుక్రవారం తుదిశ్వాస విడిచింది.
- హసన్‌పర్తి - మెరుున్‌లో
హన్మకొండ అర్బన్ :తెలంగాణ సర్కారు ఆసరా పేరిట ప్రకటించిన కొత్త పింఛన్ల పంపిణీ కార్యక్రమం జిల్లాలో అస్తవ్యస్తంగా తయూరైంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన లెక్కలు తప్పుల తడకలేనని తెలుస్తోంది. వాస్తవ వివరాలు అంది ఉంటే.. ముందుగా ప్రకటించిన గడువు ప్రకారం ఈనెల 8న వితంతువులు, వృద్ధులు, వికలాంగులైన అర్హులందరికీ పింఛన్లు అందేవి. అయితే జిల్లాలోని చాలా గ్రామాల్లో దరఖాస్తుల పరిశీలన పూర్తికాలేదు. కొన్ని ప్రాంతాల్లో ఎస్‌కేఎస్ డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేక దరఖాస్తులను పక్కన పెట్టగా.. పరిశీలన పూర్తయిన చోట్ల డాటా ఎంట్రీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. డాటా ఎంట్రీ పూర్తి అరుున తర్వాత ఆ వివరాలు ఎన్‌ఐసీకి అందాలి. అధికారులు వాటిని ఎస్‌కేఎస్ డాటాతో పోల్చి అనర్హులను తొలగించి అర్హుల జాబితాను డీఆర్‌డీఏకి అందజేయూలి. ఆ శాఖ అధికారులు మరోసారి వివరాలు సరిచూసి అర్హుల జాబితాను ప్రకటించాలి. కానీ.. పలు అవాంతరాలతో ఈ ప్రక్రియ అనుకున్న సమయానికి పూర్తి కాలేదు. దీంతో అన్ని స్థాయిల్లో పింఛన్ల పంపిణీ విషయంలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పింఛన్లను ఈ నెలలోపు కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేసే పరిస్థితులు కనిపించడం లేదు.
నమోదైంది మూడు లక్షలే..
జిల్లాలో ఆసరా పింఛన్ల కోసం అధికారులకు మొత్తం 5,43,000 దరఖాస్తులు అందగా.. క్షేత్రస్థారుులో 5,27,000 దరఖాస్తుల పరిశీలన పూర్తరుుంది. ఇందులో 3.80 లక్షల మందిని ప్రాథమికంగా పింఛన్లకు అర్హులుగా గుర్తించారు. 5,27,000 దరఖాస్తుల్లో ఈనెల 11 నాటికి ఎస్‌కేఎస్ డాటా వెబ్‌సైట్‌లో 3 లక్షలలోపు మాత్రమే అప్‌లోడ్ చేశారు. వీటిలో 40 వేల దరఖాస్తులు మాత్రమే ఎంపీడీఓల ద్వారా తుది పరిశీలన నిమిత్తం డీఆర్‌డీఏ అధికారులకు అందిన ట్లు సమాచారం. ఇందులో ఆ శాఖ అధికారులు పరిశీలించి 35 వేల మందిని అర్హుల జాబితాలో చేర్చారు. ఈ లెక్కన 4,87,000 దరఖాస్తులు వివిధ స్థారుుల్లో పరిశీలనలో ఉన్నారుు. సర్వర్ డౌన్ సమస్య కారణంతోనే పరిశీలన ప్రక్రియ నత్తనడకన సాగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఆందోళనలో పింఛన్‌దారులు
గతంలో పింఛన్ల పంపిణీ ప్రతి నెలా 1 నుంచి 5వ తేదీ మధ్య కొనసాగేది. ఈ క్రమంలో ప్రభుత్వం వితంతువులు, వృద్ధులు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లను పెంచుతూ.. వడపోత కార్యక్రమం మొదలుపెట్టింది. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించడంతోపాటు పింఛన్ల పరిశీలనను పక్కాగా చేపట్టింది. వివిధ దశల్లో స్క్రూట్నీ చేసేలా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుండడంతో ఈనెల 8వ తేదీన జాబితాను ప్రకటించాల్సిన అధికారులు 10వ తేదీకి వారుుదా వేశారు. ఇప్పటికీ ప్రక్రియ పూర్తికాకపోవడంతో అధికారులు ఏం చెప్పలేక చేతులెత్తేస్తున్నారు. జాబితా ఎప్పుడు ప్రకటిస్తారు.. పింఛన్ ఎప్పుడిస్తారు.. అన్న విషయంలో ఏ స్థాయి అధికారుల్లోనూ స్పష్టమైన సమాచారం లేదు. దీంతో తమ దరఖాస్తు ఏమైంది.. ఎక్కడుంది.. తమకు పింఛన్ అర్హత ఉం దా.. లేదా.. అర్హత ఉంటే పింఛన్ ఎప్పుడిస్తారు.. అన్న సవాలక్ష ప్రశ్నలు సగటు పింఛన్‌దారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పింఛన్ మంజూరైన పక్షంలో లబ్ధిదారులకు రెండు నెలల మొత్తం కలిపి ఇస్తారా.. లేదా అన్న విషయంలోనూ అధికారులు స్పష్టత ఇవ్వకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే ఆందోళనబాట
కొత్త పింఛన్ల మంజూరు.. పంపిణీలో స్పష్టత లేకపోవడంతో అర్హులైన వృద్ధులు, వికలాంగులు రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు. ఆసలు పింఛన్ల పంపిణీ ఎప్పుడు చేస్తారో స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఇంకా పెరగకముందే అధికారులు స్పష్టత ఇస్తే సమస్య తీవ్రత కొంత తగ్గే అవకాశం ఉంది.
తగ్గనున్న పింఛన్లు
జిల్లాలో గతంలో అన్ని రకా ల పింఛన్లు కలిపి 3,91,975 ఉన్నాయి. వీటిలో వృద్ధాప్య 1,75,942, చేనేత 10,549, వికలాంగులు 46,076, వితంతువులు 1,13,029, గీత కార్మికులు 4,266, అభయహస్తం 42,113 ఉన్నాయి. ప్రస్తు తం అందిన దరఖాస్తుల్లో 3,80,000 మాత్రమే అర్హత ఉన్నట్లు తేల్చారు. తుది జాబితాలో మరో 10 శాతం తగ్గొచ్చని అంచనా.
4 రోజులుగా తిరుగుతున్నా...
నాలుగేళ్లుగా వికలాంగుల పింఛన్ తీసుకుంటున్న. నెల రోజుల క్రితం కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న. ఇప్పటీకి రాలేదు. అంతకు మునుపు రెండు నెలల పింఛన్ ఇవ్వలేదు. డబ్బులు ఇస్తారని నాలుగు రోజుల నుంచి గ్రామపంచాయతీ చుట్టూ తిరుగుతున్నా.
- సంగాల అనూప్, వికలాంగుడు, భీమారం
నవంబర్ లో ఆసరా కి నో
Published Sat, Nov 15 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM
Advertisement
Advertisement