ఒంగోలు, న్యూస్‌లైన్: సొంత భవనాలు లేకపోవడంతో పంచాయతీలకు అద్దెల భారం తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలుండాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు చాలాచోట్ల నేటికీ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు. పంచాయతీ భవనాల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ జిల్లా వ్యాప్తంగా బుధవారం పరిశీలించింది. ఈ పరిశీలనలో అనేక సమస్యలు బహిర్గతమయ్యాయి. పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారడం, రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో లక్ష్యం నెరవేరలేదు. భారత్ నిర్మాణ్ రాజీవ్ గాంధీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పంచాయతీలకు కార్యాలయ భవనాలు నిర్మించడంతో పాటు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న పేదలకు పనిదినాలు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం.
ఆమేరకు ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. 2012 మే 4వ తేదీలోపు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు చేపట్టలేదు. 357 పంచాయతీ భవనాలకు రూ. 35.70 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 97 భవనాలు మాత్రమే పూర్తికాగా..అసలు పనులు మొదలు పెట్టనివి 181 ఉన్నాయి. మిగిలినవి వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో సర్పంచ్‌ల గృహాలే కార్యాలయాలుగా మారాయి. నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేసిన కాంటాక్టర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించకపోవడం కూడా మరో కారణం. తాజాగా ఈ పథకం పేరును రాజీవ్‌గాంధీ పంచాయత్ శక్తికారణ్ అభియాన్‌గా మార్చారు. దీని ప్రకారం సొంత భవనాలు లేని పంచాయతీల జాబితా పంపాలని ఇటీవల పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ పథకం కింద గతంలో మంజూరై ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాని వాటిని చూపించవచ్చా.. నిధుల కొరతతో ఆగిన వాటిని పేర్కొనవచ్చా అనే సమస్య ప్రస్తుతం పంచాయతీ అధికారులను పట్టి పీడిస్తోంది.
‘అద్దె’ పంచాయతీలు
Published Thu, Jan 9 2014 4:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:24 AM
Advertisement
Advertisement