government funds
-
పూడూరులో పిల్లర్ స్థాయి దాటని ‘డబుల్’ ఇళ్ల నిర్మాణం..
పూడూరు: మండల కేంద్రంలో పేదల సొంతింటి కల ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం. ప్రభుత్వం నిధులు కేటాయించినా కాంట్రాక్టర్ నిర్వాకం వల్ల పనులు ముందకు సాగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పునాదుల స్థాయిలోనే ఆగిపోయాయి. పూడూరు మండలానికి 50 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరయ్యాయి. పూడూరు, మన్నేగుడ, మీర్జాపూర్ గ్రామాల్లో స్థలాలను గుర్తించారు. పూడూరులోని శ్మశానవాటిక పక్కన ఉన్న ప్రభుత్వ స్థలం ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించారు. రెండేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పిల్లర్లకే పనులు పరిమితమయ్యాయి. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి 3,873 డబుల్ ఇళ్లు మంజూరయ్యాయి. సగానికిపైగా రోడ్లు భవనాల శాఖకు అప్పగించగా, మరి కొన్ని ఇరిగేషన్ శాఖ, మున్సిపాలిటీలకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. ఇందులో భాగంగా పూడూరులో 50 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. పునాదుల పనులు పూర్తయి పిల్లర్ల స్థాయిలో ఆగిపోయాయి. పరిగి నియోజకవర్గానికి 680 ఇళ్లు మంజూరు కాగా పరిగి, దోమ, కులకచర్ల, గండ్వీడ్, మహమ్మదాబాద్ మండలాల్లో డబుల్ ఇళ్ల నిర్మాణాలు చివరి దశకు చేరాయి. నిధులు లేని కారణంగానే కాంట్రాక్టర్ పనులు ఆపేసినట్లు తెలిసింది. పనులు వేగవంతం చేస్తాం పూడూరులో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్ పనులు ఆపేశాడు. ప్రస్తుతం బిల్లులు వచ్చాయి. పనుల వేగం పెంచి త్వరలో పూర్తయ్యేలా చూస్తాం. – మహేశ్, ఆర్అండ్బీ ఏఈ -
ఎమ్మెల్యే ‘చల్లా’ మోసం చేశారు.. సీఎం మంజూరు చేసిన రూ.5 కోట్లు మళ్లించారు
గీసుకొండ: వంచనగిరికి సీఎం కేసీఆర్ మంజూరు చేసిన నిధులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి నియోజకవర్గంలోని పలు గ్రామాలకు మళ్లించి తమకు అన్యాయం చేశారని వంచనగిరి గ్రామస్తులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఆరోపించారు. మండలంలోని కోటగండి వద్ద వారు బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2017లో అప్పటి ఎమ్మెల్సీ కొండా మురళి వినతి మేరకు సీఎం కేసీఆర్ వంచనగిరికి రూ.9.50 కోట్లు అభివృద్ధి పనులకు మంజూరు చేశారని తెలిపారు. ఆ నిధుల్లో కేవలం రూ.3.38 కోట్ల పనులు చేశారని, మరో రూ.1.29 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొండా మురళి పార్టీ మారాడనే అక్కసుతోనే ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గ్రామానికి మంజూరైన రూ.5 కోట్ల బ్యాలెన్స్ నిధులను ఇతర గ్రామాలకు మళ్లించారన్నారు. దీంతో గ్రామంలో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెబుతామని వారు హెచ్చరించారు. సర్పంచ్, ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో ఈజీఎస్ నిధుల మంజూరులోనూ వివక్ష కొనసాగుతోందని పేర్కొన్నారు. మొరం, మట్టి తరలించే వాహనాలు, టెక్స్టైల్ పార్కు నుంచి వచ్చిపోయే వాహనాలతో శాయంపేట–స్తంభంపల్లి రోడ్డు శిథిలమైందన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే మళ్లించిన నిధులను గ్రామానికి కేటాయించి అభివృద్ధి పనులు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ భీమగాని సౌజన్య, సర్పంచ్ అమిరిశెట్టి అనసూర్య, ఎంపీటీసీ నాగరబోయిన రజితసారంగం, మండల కోఆప్షన్ సభ్యుడు రహీం, వార్డు సభ్యులు కరుణాకర్, అమిరిశెట్టి రాజు, నల్ల సురేశ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
కుంభమేళాకు అన్ని కోట్లు అవసరమా?
లక్నో : కుంభమేళా నిర్వాహణకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం సరైంది కాదని కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎంపీ ఉదిత్ రాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీ ప్రభుత్వం కుంభమేళా పేరిట అలహాబాద్‌లో 4200 కోట్ల రూపాయలు ఖర్చుచేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ర్టానికి సొంతంగా ఒక మతం అంటూ ఉండదని, అలాంటప్పుడు మత ప్రచారాలు, బోధనలకు ప్రభుత్వ నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఉదిత్ రాజ్ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోట్లాది మంది ప్రజలు ఓ కార్యక్రమానికి హాజరైనప్పడు వారికి మౌలిక సదుపాయలు ఏర్పాటుచేసే బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. (లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలు కోసమే ప్రభుత్వం పనిచేయదని, కుంభమేళా అన్నది కోట్లాది ప్రజల మనోభావాలతో ముడిపడి ఉంటుందని స్పష్టం చేశారు. భక్తుల కనీస సౌకర్యాలను ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఇదే అంశంపై యూపీ మంత్రి బ్రిజేష్ పాథక్ మాట్లాడుతూ.. కుంభమేళా అన్నది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదని, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది భక్తులు హాజరవుతారని తెలిపారు. ఇలాంటి కార్యక్రమంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. (తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ) -
ఉప సర్పంచ్‌లకు నిరాశే..
సాక్షి, భూపాలపల్లి: నూతన పంచాయతీరాజ్ చట్టం అమలులోకి వచ్చే వరకు కార్యదర్శి, సర్పంచ్‌కు ఉమ్మడి చెక్ పవర్ కల్పించే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి పలు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకవర్గం ఏర్పడి రెండు నెలలు దాటినా అభివృద్ధిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. చెక్‌పవర్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తొలగకపోవడంతో పల్లెల్లో పాలన పడకేసింది. నిధులు ఉన్నా ఖర్చుపెట్టలేని పరిస్థితి. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికైతే పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్‌ను కల్పించనుంది. అయితే ఇన్నాళ్లుగా చెక్‌పవర్‌పై ఆశలు పెట్టుకున్న ఉపసర్పంచ్లు నిరాశలో ఉన్నారు. రిజర్వేషన్లు కలిసి రాకున్నా ఉపసర్పంచ్ పదవి కొసం కొంత మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. తాత్కాలికమేనా.. జీపీల్లో చెక్ పవర్ సర్పంచ్, కార్యదర్శులకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కలెక్లర్లు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇది తాత్కాలికమా, లేక ఇలాగే కొనసాగిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని 415 గ్రామపంచాయతీలకు ఎన్నికలు ముగిసి మూడు నెలలు కావస్తోంది. ఇప్పటికీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్‌లకు పవర్ లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌ల ఉమ్మడి చెక్‌పవర్‌పై ప్రభుత్వం ఇంకా ఎటువంటి స్పష్టత ఇవ్వకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం గ్రామ పంచాయతీ సిబ్బందికి నెలనెలా జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. వీటిని దృష్టిలో పెట్టుకుని పాత విధానంలోనే సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులకు తాత్కాలికంగా చెక్‌పవర్ ఇచ్చే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం గ్రామాల్లో నిలిచిన బకాయిలు, బిల్లులు చెల్లించేందుకు మాత్రమే తాత్కాలికంగా సర్పంచ్, కార్యదర్శులకు ఉమ్మడి చెక్‌పవర్ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఉపసర్పంచ్లు అనుకుంటున్నారు. అయితే రాష్ట్రంలోని చాలా మంది డీపీఓలు సర్పంచ్‌తో పాటు పంచాయతీ కార్యదర్శికే ఉమ్మడి చెక్ పవర్ ఉంటే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చనే అభిప్రాయాన్ని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. నిరాశలోనే.. ఇన్నాళ్లు చెక్ పవర్‌తో పవర్ వస్తుందనుకున్న ఉపసర్పంచ్‌లకు నిరాశే ఎదురుకానుంది. రెండు జిల్లాల్లో ఉన్న 415 పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో ఉపసర్పంచ్‌ల ఎన్నికలు కూడా అదే స్థాయిలో తీసుకున్నారు. చెక్‌పవర్ సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు ఉంటుందని ఈసారి చాలా మంది పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కొన్ని చోట్ల సర్పంచ్ల కంటే ఉపసర్పంచ్ పదవి కోసం ఎక్కువ ఖర్చు చేసిన వారు కూడా ఉన్నారు. కొంత మంది రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో ఉపసర్పంచ్ పదవి కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. ప్రస్తుతం చెక్‌పవర్ పై స్పష్టత లేకపోవడం ఉపసర్పంచ్లు ఆందోళనలో ఉన్నారు. సమర్థ నిర్వహణకే.. ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కల్పించే ఆంశంపై పునరాలోచన చేసినట్లు తెలుస్తోంది. కొత్త పంచాయితీరాజ్ చట్టం–2018 ప్రకారం సర్పంచ్, ఉపసర్పంచ్‌కు సమష్టిగా చెక్ పవర్ కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సవరించిన పంచాయితీరాజ్ చట్టానికి గతేడాది ఆమోదముద్ర వేసింది. అయితే ఈ నిర్ణయం అములు విషయంలో సర్కారు ఆచితూచి అడుగువేస్తోంది. ముఖ్యంగా ఆర్థిక అధికారాలు ఇరువురు ప్రజాప్రతినిధులకు కట్టబెట్టడం వల్ల విధుల దుర్వినియోగం జరుగుతుందని, రికార్డుల నిర్వహణ కూడా కష్టసాధ్యమవుతోందని పంచాయితీరాజ్ శాఖ అంచనా వేసింది. అంతేకాకుండా లావాదేవీల్లో అధికారులను బాధ్యులను చేయడం కూడా కుదరదని తేల్చింది. మరోవైపు పంచాయతీ పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషించే కార్యదర్శుల కస్టడీలో రికార్డులు ఉంటాయని, ఈ తరుణంలో నిధుల వినియోగంలో వారికి బాధ్యతలు అప్పగిస్తే నియంత్రణ కష్టమని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వం దృష్టికి తెచ్చింది. చెక్‌పవర్‌ను వారికి కల్పించి కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామనే నిర్ణయం సరికాదని అభిప్రాయపడింది. ఈ వాదనతో ఏకీభవించిన పంచాయితీరాజ్ శాఖ, గతంలో ఉన్న మాదిరే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ కల్పించే దిశగా ఆలోచన చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. ఎటువంటి సమాచారం రాలేదు – చంద్రమౌళి, జిల్లా పంచాయతీ అధికారి సర్పంచ్‌లు, కార్యదర్శులకు జాయంట్ చెక్ పవర్ గురించి ఎటువంటి సమాచారం రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వస్తుంది. -
ఫ్రీజింగ్.!
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో రెండు మాసాలుగా చెల్లింపులన్నీ ఆగిపోయాయి. ఖజానా ఖాళీ అవడం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బిల్లులను ఆపేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు, కార్మికులకు రావాల్సిన జీతాలను కూడా ఈనెల 13వ తేదీ విడుదల చేశారు. గత ఏడాది నుంచి అన్ని బిల్లులు మాన్యువల్‌గా కాకుండా సీఎఫ్ఎంఎస్ ద్వారా ఆన్లైన్లో మంజూరు చేస్తున్నారు. మున్సిపాలిటీలు, ఇతర శాఖల్లోని బిల్లులన్నీ దీని ద్వారానే జారీ చేస్తున్నారు. ఒక్క వైఎస్ఆర్ జిల్లాలోనే రూ.100కోట్లకు పైగా బిల్లులు సీఎఫ్ఎంఎస్లో ఆగిపోయినట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, జిల్లా పరిషత్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. మున్సిపాలిటీల్లో అయితే 14వ ఆర్థిక సంఘం, ఎస్సీ సబ్‌ప్లాన్, బీపీఎస్ నిధుల కింద చేపట్టిన పనులకు కూడా బిల్లులు రావడం లేదు. ఒక్క కడప కార్పొరేషన్లోనే సుమారు రూ.3కోట్ల బిల్లులు రావాల్సి ఉండగా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో రూ.35కోట్లకు పైగా బిల్లులు రావాల్సి ఉంది. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక వారు తలలు పట్టుకుంటున్నారు. అగ్రిమెంట్ మేరకు గడువు లోపు పనులు చేయాలని ఒత్తిడి చేసి పనులు చేయించారని, అప్పులు సప్పులు చేసి పనులు చేస్తే ఇప్పుడు బిల్లులు రాకుండా ఆపేశారని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఐసీడీఎస్, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లోనే సుమారు రూ.100 కోట్ల బిల్లులు రావాల్సి ఉంటే ఇక మైనర్, మేజర్ ఇరిగేషన్, ఆర్అండ్బి, ఆర్‌డబ్లు్యఎస్, పంచాయితీరాజ్, హౌసింగ్, పబ్లిక్ హెల్త్, వైద్య, ఆరోగ్యశాఖ, విద్యాశాఖ, ఎస్ఎస్ఏ, జిల్లా పరిషత్ వంటి ఇతర శాఖల్లో మరో రెండువందల కోట్లు రావాల్సి ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ఖాజానా ఖాళీ అవడం వల్లే చెల్లింపులన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. బడ్జెట్లో కేటాయించకపోయినా చాలా పనులను ప్రభుత్వం చేసేస్తోంది. వచ్చిన ఆదాయమంతా జీతాలకే సరిపోతుండటంతో మిగిలిన వ్యయానికి బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. రుణం ఇచ్చేందుకు బ్యాంకుల నుంచి కూడా ఆశించినంత స్పందన రాకపోవడంతోనే ప్రభుత్వం చెల్లింపులన్నీ ఆపేసినట్లు తెలుస్తోంది. అంగన్వాడీలకు 3 మాసాలుగా అందని వేతనాలు అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలు, హెల్పర్లకు మూడు మాసాలుగా జీతాలు ఇవ్వలేదు. దీంతో ఇటీవల వారు రెండు రోజులు సమ్మె చేపట్టారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం రాలేదు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు 7242 మంది కార్యకర్తలు, హెల్పర్లు పనిచేస్తున్నారు. వీరికి మూడుమాసాలుగా రూ.16.29కోట్లు వేతనాలు రావాల్సి ఉంది. అన్నిశాఖల్లోని ఉద్యోగులు, కార్మికులకు ప్రతినెలా జీతాలిస్తున్న ప్రభుత్వం అంగన్వాడీలకు మాత్రమే ఇలా జీతాలు ఆపేయడం పట్ల వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉపాధి కూలీ దక్కలేదు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కూడా మూడు మాసాలుగా వేతనాలు అందలేదు. జిల్లాలో 5,62,899 కుటుంబాల్లో 11,12,279 మంది కూలీలు ఉన్నారు. వీరికి మూడు నెలలుగా సుమారు రూ.39కోట్ల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయడానికే ఐసీడీఎస్, డ్వామా నిధులు ఆపేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ... ఒక పక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు ప్రకటిస్తుండటం పట్ల ఆర్థిక వేత్తలు విస్తుపోతున్నారు. జీతాలు, ఉన్న బిల్లులు ఇవ్వడానికే నిధులు లేకుంటే కొత్తగా పింఛన్లు రూ.2వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇంకా కొత్తవి కూడా ప్రకటించే అవకాశం ఉంది. -
చిలక్కొట్టుడు!
సాక్షి, విజయవాడ : పర్యాటక సంస్థలో నిబంధనలకు నీళ్లొదిలిన పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పర్యాటకుల్ని ఆకట్టుకోవడానికి ఖర్చు చేయాల్సిన నిధులు తమ వ్యక్తిగత అవసరాలకు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారుల అవినీతిని ప్రశ్నించే నాథుడే లేకపోవడంతో వారు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా కొనసాగుతోంది. సొంత కార్యక్రమాలకు పర్యాటక సంస్థ భోజనాలు.. పర్యాటకులకు కావాల్సిన భోజనాలను పున్నమి రెస్టారెంట్లో తయారు చేస్తారు. పర్యాటకులు ముందుగా సొమ్ము చెల్లిస్తే అక్కడ వంటలు వండించుకుని బయటకు తీసుకెళ్లవచ్చు. దీన్ని అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుని పర్యాటక సంస్థ ఆదాయానికి చిల్లు పెడుతున్నారు. గతంలో పర్యాటక సంస్థలో ఓ ఉన్నతాధికారి భార్యకు సీమంతం జరిగింది. దీనికి పున్నమి రెస్టారెంట్ నుంచి భోజనాలు వెళ్లాయి. ఈ భోజనాలు భవానీద్వీపం, బరంపార్కుకు వచ్చిన పర్యాటకులకు ఖర్చు చేసినట్లుగా చూపించారు. అయితే ఈ విషయం ‘సాక్షి’ వెలుగులోకి తీసుకురావడంతో చివరకు ఆ అధికారి భోజనాలకు అయిన ఖర్చును పర్యాటక సంస్థకు చెల్లించి రసీదు తీసుకున్నారు. అప్పట్లో ఆ అధికారి ఇంట్లో శుభకార్యానికి భోజనాలు పంపి స్వామి భక్తి ప్రదర్శించిన ఒక మేనేజర్ ఇంట్లో ఇటీవల ఒక శుభకార్యం జరిగింది. ఆ మేనేజర్ కుమార్తె జన్మదిన వేడుకలను గత నెలలో భవానీపురంలోని ఒక కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆ ఫంక్షన్‌కు కావాల్సిన భోజనాలన్నీ పున్నమి రెస్టారెంట్ నుంచే వెళ్లాయి. రెండు నాన్‌వెజ్ రకాలతో సుమారు 200 మందికి భోజనాలు వెళ్లాయని పర్యాటక సంస్థ సిబ్బంది చెబుతున్నారు. కనీసం లక్షన్నర విలువ చేసే ఈ భోజనాలకు అయిన ఖర్చు పర్యాటక సంస్థ ఖాతాలో వేశారు. ఇటీవల పున్నమి ఘాట్‌లో ఎఫ్1హెచ్2ఓ పవర్ బోటింగ్ ఫార్ములా రేస్ జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందల మందికి భోజన, వసతి ఏర్పాట్లను పర్యాటక సంస్థ కల్పించింది. దీంతో అంతకు ముందు జరిగిన జన్మదిన ఖర్చులను ఆ మేనేజర్ ఇందులో కలిపేశారని సిబ్బంది నుంచి తెలుస్తోంది. తన జేబులో రూపాయి ఖర్చు కాకుండా కుమార్తె జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించడం ఇప్పుడు బరంపార్కులో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయం పర్యాటక సంస్థ ఉన్నతాధికారికి తెలిసినా మిన్నకుండటం గమనార్హం. ఖర్చుకు.. లెక్కకు పొంతన కరువు పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో పెద్దపెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు పెట్టే ఖర్చులకు, చూపే లెక్కలకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు వచ్చినప్పుడు వారి వెంట వచ్చిన వారికి కావాల్సిన భోజనాలు కూడా పర్యాటక సంస్థ కల్పిస్తుంది. ఆ సమయంలో భోజనాలు చేసిన వారికి మరో 50 శాతం ఎక్కువ మంది తిన్నట్లుగా చూపించి ఆ సొమ్ము పంచుకుంటున్నారని సమాచారం. రాష్ట్రంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హడావుడి అధికారులకు వరంగా మారిందని కింది స్థాయి సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. -
చేబదుళ్లు..తడిసి మోపెడు!
సాక్షి, అమరావతి: ఆర్థిక అవసరాలతో తెలిసిన వారి దగ్గర చేబదుళ్లు తీసుకోవడం సహజమే. ఇలా చేసిన అప్పును వారం పది రోజుల్లో లేదా వీలైనంత త్వరగా తీర్చేస్తాం. కొద్ది రోజులే కావడంతో ఇలాంటి వాటికి వడ్డీ ఉండదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో చేబదుళ్లకు కూడా రూ. వందల కోట్లలో వడ్డీలు కడుతోంది. గడువులోగా చేబదుళ్లు తిరిగి చెల్లించకపోవడమే దీనికి కారణం. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే! రాష్ట్ర ప్రభుత్వం వరుసగా నాలుగో ఆర్థిక సంవత్సరంలో కూడా చేబదుళ్లు చేయడం, అందుకు వడ్డీలు చెల్లించడంలో రికార్డు సృష్టించింది. నాలుగేళ్లలో చేబదుళ్లకు వడ్డీ కింద ఏకంగా రూ.124.72 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. 2017–18లో కూడా చేబదుళ్ల జోరు కొనసాగిందని కాగ్ స్పష్టం చేసింది. అప్పులు చేసి వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర అవసరాల కోసం పప్పు బెల్లాలకు వ్యయం చేస్తోంది. దీంతో ఆస్తులు తరిగిపోయి అప్పుల శాతం భారీగా పెరిగిపోతోంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో చేబదుళ్ల కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.45,860.75 కోట్లు తీసుకున్నట్లు ‘కాగ్’ నిర్ధారించింది. దీన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఖజానాపై వడ్డీల భారం పడింది. చేబదుళ్లకు వడ్డీలు చెల్లించడం అంటే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత అస్తవ్యస్థంగా ఉందో తేటతెల్లం అవుతోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. చేబదుళ్లకు వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించడం అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమేనని ఆర్థిక శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 14 రోజుల్లోగా చెల్లిస్తే వడ్డీ ఉండదు..: ఆర్బీఐ అన్ని రాష్ట్రాలకు వేస్ అండ్ మీన్స్ (చేబదుళ్లు) సౌకర్యం కల్పిస్తుంది. ఖజానాలో పైసా లేకపోయినా అత్యవసరాల కోసం వేస్ అండ్ మీన్స్ రూపంలో ఆర్బీఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,500 కోట్లను వినియోగించుకోవచ్చు. ఈ మొత్తాన్ని సకాలంలో 14 రోజుల్లోగా చెల్లించాలి. 14 రోజుల గడువు దాటితే వడ్డీ కట్టాల్సి ఉంటుంది. వేస్ అండ్ మీన్స్ పరిమితి దాటితే తరువాత ఓవర్ డ్రాప్టుకు వెళ్లాల్సి వస్తుంది. బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు వరుసగా నాలుగో ఏడాది కూడా చంద్రబాబు సర్కారు అప్పులు చేసి ఆస్తుల కల్పనకు కాకుండా రెవెన్యూ రంగాలకు వ్యయం చేసింది. దీంతో అప్పులు పెరిగిపోతున్నాయి కానీ ఆస్తులు కానరావడం లేదు. ఫలితంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ పరాధీనంలోకి వెళ్లిపోతుంది. ఈ ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ.25,452 కోట్ల మేర అప్పులు చేయగా ఆస్తుల కల్పనకు కేవలం రూ.14,127.03 కోట్లనే వ్యయం చేశారు. అంటే మిగిలిన అప్పును రెవెన్యూ రంగాలకు వ్యయం చేసినట్లైంది. అలాగే బడ్జెట్ అంచనాలను మించి రెవెన్యూ, ద్రవ్య లోటు ఏర్పడింది. 2017–18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాల్లో రెవెన్యూ లోటు –415.80 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత రెవెన్యూ లోటు –16,772.83 కోట్ల రూపాయలకు చేరుకుంది. బడ్జెట్ అంచనాల్లో ద్రవ్య లోటు –23,054.44 కోట్ల రూపాయలుగా ప్రతిపాదించగా ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత ద్రవ్య లోటు –33,591.92 కోట్ల రూపాయలుగా తేలింది. ద్రవ్య, రెవెన్యూ లోటులు ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్ఆర్బీఎం) నిబంధనలకు మించి ఉండటం గమనార్హం. ఆ రికార్డు బాబుదే.. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో కూడా ఏడాదిలోని 365 రోజుల్లో అత్యధికంగా 230 రోజులు చేబదుళ్లలోనే గడిపిన చరిత్ర ఉంది. ఆ తొమ్మిదేళ్లలో ఉమ్మడి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పుడు కూడా మళ్లీ అదే తరహాలో ఆయన పాలన కొనసాగుతోంది. చేబదుళ్లను సకాలంలో చెల్లించకపోవడంతో వడ్డీ చెల్లించే పరిస్థితి కల్పించిన ఘనత దేశంలో ఏ ముఖ్యమంత్రికి దక్కదని అధికార వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘జలసిరి’కి రూ.4.01 కోట్ల హారతి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నిధుల దుబారాకు ఇదో మచ్చుతునక. గతేడాది సెప్టెంబర్ 8న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఇంద్రావతి గ్రామం వద్ద.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అక్విడెక్టు వద్ద సీఎం చంద్రబాబు జలసిరికి హారతి కార్యక్రమం నిర్వహించారు. దానికి రూ.4.01 కోట్ల విడుదలకు ఆమోదం తెలుపుతూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఒక సభకు ఏర్పాట్లు, జన సమీకరణ కోసం రూ.4,01,08,000 ఖర్చు చేయడంపై ఇటు అధికార వర్గాల నుంచి.. అటు ప్రజా సంఘాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంద్రావతి వద్ద బహిరంగ సభ ఏర్పాట్లు, జన సమీకరణకు భారీ ఎత్తున ఖర్చు చేయడానికి అనంతపురం జిల్లా కలెక్టర్‌కు సర్కార్ అనుమతివ్వడంతో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేశారు. ఆ ఖర్చుకు సంబంధించి అక్టోబర్ 10, 2017న అనంతపురం జిల్లా కలెక్టర్.. ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై జలవనరుల శాఖ ఆమోదముద్ర వేసింది. సాగునీటి ప్రాజెక్టుల పనుల కోసం ఏపీడబ్ల్యూఆర్డీసీ (ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా జాతీయ, ప్రైవేటు బ్యాంకుల వద్ద అధిక వడ్డీకి తెచ్చిన రుణాలను రాష్ట్ర ప్రభుత్వం ఇలా దుబారా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అనర్హులకు రూపాయీ వెళ్లకూడదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిధులను పద్ధతిగా ఖర్చు చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పథకాల అమలులో అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో మంత్రి ఈటల శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష జరిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమా సికంలో వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు చేసినం. రాష్టాన్ని అగ్రభాగాన నిలిపినందుకు అందరికీ అభినందనలు. ప్రజలు కడుతున్న పన్నులను ఖర్చు పెడుతున్నాం. అనర్హులకు వెళ్లకుండా చూడండి. మీకు అన్ని రకాల అధికారాలు ఇస్తున్నాం. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత తప్పు జరిగితే ఎలా? స్థానిక సంస్థలపై ఆడిట్ చేస్తున్నారుగానీ ఎందుకు రికవరీ జరగడం లేదు’ అని మంత్రి ప్రశ్నించారు. రికవరీ చేసే అధికారం తమకు లేదని అధికారులు చెప్పడంతో... అవసరమైతే నిబంధనలు మార్చాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును మంత్రి ఈటల ఆదేశించారు. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీలలో కుంభ కోణాలను గుర్తించాం. నిధులు దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరనే భావన తీసుకురావాలి. ట్రెజరీ శాఖలో ఈ–కుబేర్ సాఫ్ట్వేర్ తీసుకువచ్చాం. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేశాం. త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సైతం ఈ–కుబేర్ ద్వారా అందించనున్నాం. పింఛను విధానంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చినం. రిటైర్డ్ అయిన వ్యక్తి చనిపోయిన తర్వాత వారి నామినీలకు అందిస్తారు. అయితే 50 ఏళ్లుగా పొందుతున్నవారి నామినీలూ ఉన్నారు. మరోవైపు 315 జీవో ప్రకారం మూడోతరం వారూ పొందుతున్నా రు. ఈ ఉత్తర్వులపై అధికారులు పునఃసమీక్ష చేసి నివేదిక ఇస్తే సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాగ్ మన శాఖలపై ఆడిట్ చేస్తోంది. ప్రణాళిక శాఖ నుంచి వేరే శాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లిన వారందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు ఓ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ప్లానింగ్ శాఖ సమన్వయంతో పనిచేయాలి’ అని అన్నారు. -
నిధుల దుర్వినియోగం : 8వేల మందిపై చర్యలు
బీజింగ్ : అవినీతి నిర్మూలనే ధ్యేయంగా అధికారంలోకి వచ్చిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన హామీని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. 2016కు చెందిన ప్రభుత్వ బడ్జెట్లో అవకతవకలకు పాల్పడిన 8వేల మందికి పైగా ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్టు చైనా అధికారిక పత్రిక జిన్హువా వెల్లడించింది. జాతీయ ఆడిట్ కార్యాలయం అధిపతి అయిన హు జ్యూన్ వీరి ఉల్లంఘనలను బహిర్గతం చేశారు. పేదరిక నిర్మూలన పథకం కోసం కేటాయించిన నిధులను దుర్వినియోగపరిచిన కేసులో 970మందిపై, నిధుల మంజూరులో అక్రమాలకు పాల్పడినందుకు 1363మందిపై చర్యలు తీసుకున్నట్టు జ్యూన్ వెల్లడించారు. నిధులను ఉల్లంఘించిన వారిలో ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన వారు 800 మంది ఉండగా.. ఎనిమిది దిగ్గజ బ్యాంకులకు చెందిన వారు 73 మంది ఉన్నట్టు జ్యూన్ పేర్కొన్నారు. అదేవిధంగా మెడికల్ ఇన్సూరెన్స్ ఫండ్స్‌లో దుర్వినియోగానికి పాల్పడిన 505 మందిపై కూడా ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఏడాది పైగా కావొస్తున్నా.. అఫార్డబుల్ హౌసింగ్ ప్రాజెక్టులకు చెందిన 48 బిలియన్ యువాన్ల ఫండ్స్‌ను వాడలేదని జ్యూ పేర్కొన్నారు. దుర్వినియోగం చేసిన 1.37బిలియన్ యువాన్లను తిరిగి రాబట్టినట్లు తెలిపారు. అయితే వీరికి ఎలాంటి శిక్షలు విధించారో తెలుపలేదు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 15లక్షల మంది ప్రభుత్వ అధికారులపై విచారణ జరిపినట్టు తెలిసింది. -
రోడ్డేశారు.. తవ్వేశారు..
పైప్‌లైన్ నిర్మాణం కోసం ధ్వంసం చేస్తున్న వైనం శాఖల మధ్య సమన్వయ లోపంతో నిధులు నేలపాలు నెల్లూరు సిటీ: రెండు శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా రూ.లక్షలు నేలపాలవుతున్నాయి. ఆర్ అండ్ బీ, పబ్లిక్‌హెల్త్ శాఖల అధికారులు ఎవరి దారిలో వారు వెళ్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఫలితంగా కాంట్రాక్టర్‌కు నిధుల పంట పండుతోంది. నగరంలోని పోలీస్ గ్రౌండ్స్ నుంచి డైకస్‌రోడ్డు వరకు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులకు ఆర్ అండ్ బీ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో పోలీస్ గ్రౌండ్స్ నుంచి చెట్లు, దుకాణాలు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. రోడ్డుకు ఇరువైపులా పదడుగుల మేర రోడ్డును విస్తరించాల్సి ఉంది. డైకస్‌రోడ్డు వరకు చేపటాల్సిన విస్తరణ పనులు ఎస్పీ బంగ్లా వరకు సాగాయి. రోడ్డేసి నాలుగు నెలలు గడవకముందే రోడ్డు విస్తరణలో భాగంగా పోలీస్ గ్రౌండ్స్ వద్ద రెండు వైపులా రోడ్డు పనులు జరిగాయి. ఆర్ అండ్ బీ అధికారులు రూ.10 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించారు. రోడ్డును వేసిన నాలుగు నెలలకే పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు జేసీబీ సాయంతో పగలగొట్టారు. నగరంలో తాగునీటి పథకంలో భాగంగా పైప్‌లైన్ నిర్మాణం జరుగుతోంది. అయితే అప్పటికే కాంట్రాక్టర్ రోడ్డును నిర్మించడంతో పబ్లిక్ హెల్త్ అధికారులు వేసిన రోడ్డును తవ్వి పైప్‌లు వేస్తున్నారు. సమన్వయ లోపం కారణంగా నిధులు వృథా కావడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణకు ఆటంకం పోలీస్ గ్రౌండ్స్ నుంచి డైకస్‌రోడ్డు వరకు విస్తరణ పనులు ఈ ఏడాది మార్చిలో ప్రారంభమయ్యాయి. నగరపాలక సంస్థ, అటవీ, విద్యుత్, ఆర్ అండ్ బీ శాఖల సమన్వయంతో విస్తరణ పనులను చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు విస్తరణ పనులు జరగనీయకుండా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు. దీంతో ఎస్పీ బంగ్లా వరకు మాత్రమే రోడ్డు విస్తరణ జరిగింది. అధికార పార్టీకి చెందిన రూరల్ నియోజకవర్గంలోని ఓ ముఖ్యనేత, మేయర్ అజీజ్ రోడ్డు విస్తరణ పనులు జరగకుండా అడ్డుపడ్డారనే విమర్శలు ఉన్నాయి. దీంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు దుకాణాలు కూల్చివేతను నిలిపేశారు. రోడ్డు విస్తరణ పనులు ఇక అటకెక్కినట్లేనని ప్రజలు పేర్కొంటున్నారు. -
రూ.15 కోట్లు ల్యాప్స్!
వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిధుల వినియోగంపై దృష్టిపెట్టని అధికారులు నెలరోజుల్లో ముగియనున్నఆర్థిక సంవత్సరం లక్ష్యసాధనలో వెనుకబడిన వ్యవసాయశాఖ సింగిల్డిజిట్లోనే వృద్ధిరేటు! వ్యవసాయ అనుబంధ శాఖల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వీటిని ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా వినియోగించాలి. అంటే మార్చినెల చివరిలోగా అన్నమాట. ఈ రోజు నుంచి లెక్కవేస్తే సరిగ్గా 34 రోజులు ఉంది. ఈ విషయం తెలిసీ కూడా అధికారుల నిధుల వినియోగంపై దృష్టిసారించలేదు. ఇప్పుడు వారు అప్రమత్తమైనా వ్యవసాయ, ఉద్యాన, పట్టుపరిశ్రమ, ఫిషరీస్, ఏపీఎంఐపీలలో దాదాపు రూ.15 కోట్లు ల్యాప్స్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ అనుబంధ రంగాల్లో వివిధ పథకాల కింద మంజూరు అయిన నిధులను ట్రెజరీ ద్వారా వినియోగిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 11నెలల కాలంలో 50 శాతం నిధులు కూడా వినియోగించలేదు. మిగిలిన నెల రోజుల్లో 50 శాతాన్ని ఎలా వినియోగిస్తారనేది ప్రశ్న. ఎందుకంటే ఇప్పటికే ట్రెజరీలపై ఆంక్షలు మొదలయ్యాయి. ముందుగానే అధికారులు అప్రమత్తమై వివిధ పథకాలకు నిధులను ఖర్చుచేసి ఉంటే కొంతవరకైనా రైతుల అభ్యున్నతికి తోడ్పడేవారు. వ్యవసాయ శాఖలో.. వ్యవసాయ శాఖలో దాదాపు రూ.10 కోట్లు నిధులు వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ యాంత్రీకరణ కింద రూ.11.50 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా రూ.2.50 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. దాదాపు 8 నెలలుగా వ్యవసాయ యాంత్రీకరణ పూర్తిగా నిలిచిపోయింది. యాంత్రీకరణను ఒకసారి జన్మభూమి కమిటీలతో లింక్‌పెట్టడం, మరోసారి గ్రామ సభల తీర్మానాలు తీసుకోవాలనడంతో సమయమంతా వృథాఅయింది. ఇంతవరకు యాంత్రీకరణ అమలు ఒక కొలిక్కి రాలేదు. ఇటీవలనే ట్రెజరీకి రూ.6.50 కోట్ల యాంత్రీకరణ బిల్లులు పంపారు. అయితే ట్రెజరీలో నిధుల చెల్లింపులపై బ్యాన్ ఉండిపోవడంతో నిధుల వినియోగం ప్రశ్నార్థకమైంది. మరోవైపు ఆత్మకింద వ్యవసాయ ప్రదర్శన కేంద్రాల ఏర్పాటు, శిక్షణలు, ఎక్స్పోజర్ విజిట్ తదితర వాటికి 8నెలల క్రితమే రూ.1.30 కో ట్లు విడుదలయ్యాయి. అయితే ఇంతవరకు ఒక్క రూపాయ కూడా వినియోగించలేదు. ఉద్యాన శాఖ.. ఉద్యాన శాఖలో ప్రధానంగా నిర్మల్స్టేట్ ప్లాన్, స్టేట్ హార్టికల్చర్ మిషన్, ఆర్ కేవీవై కింద కొత్త తోటల విస్తరణ, పాత తోటల పునరుద్ధరణ, పాలీహౌస్, షేడ్నెట్ల ఏర్పాటు, ఉద్యాన యాంత్రీకరణ కింద రూ.35 కోట్లు వ్యయం చేయాలి. ఇందులో ఇప్పటి వరకు 50 శాతం కూడా ఖర్చు చేయలేదు. ప్రధానంగా టిస్యూకల్చర్ అరటి సాగును ప్రోత్సహించ తలపెట్టారు. అయితే మార్కెట్లో అరటికి డిమాండ్ తగ్గి రైతులు నష్టాలను మూటగట్టుకుంటుండటంతో రైతులు సాగుకు ముందుకు రావడం లేదు. దీంతో ఉద్యాన యాంత్రీకరణకు సంబంధించిన రూ.70 లక్షల సబ్సిడీ మిగిలి ఉంది. మిగిలిన నెల రోజుల్లో ఉద్యాన అధికారులు చొరవ తీసుకోకపోతే దాదాపు ఈ విభాగం నుంచి రూ.10 కోట్ల వరకు ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఉంది. ఏపీఎంఐపీ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు కింద 11800 హెక్టార్లలో డ్రిప్ కల్పించాల్సి ఉంది. అరటి సాగుపై ఆసక్తి తగ్గడంతో డ్రిప్‌లో లక్ష్యాలను అందుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఏపీఎంఐపీలో దాదాపు రూ.2 కోట్ల నిధులు మురిగిపోయే ప్రమాదం ఉంది. మత్స్యశాఖ వానలు లేకపోవడంతో మత్స్యశాఖ 2015-16లో లక్ష్యాలను అందుకోవడంలో పూర్తిగా వెనుకబడి పోయింది. మత్స్యశాఖ అమలు చేస్తున్న పథకాల ద్వారా మత్స్యకారుల అభివృద్ధికి రూ.5 కోట్లు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంది. ఇందులో రూ.2 కోట్లు కూడా వినియోగించలేదు. దీంతో నిధులు భారీగా ల్యాప్స్ అయ్యే ప్రమాదం ఏర్పడింది. సింగిల్ డిజిట్‌లోనే వృద్ధిరేటు వ్యవసాయ అనుబంధ శాఖల్లో 2015-16లో రెండంకెల అభివృద్ధి రేటును సాధించాలనేది లక్ష్యం. వ్యవసాయం నిరాశ జనకంగా ఉండటంతో సింగిల్ డిజిట్‌లోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరంలో మిగిలిన నెల రోజుల్లో నిధుల వినియోగంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతో ఉంది. -
కార్యదర్శుల చేతికి ఇసుక రీచ్‌లు
* జిల్లాలో 13 మండలాల్లోని 32 రీచ్‌లు అప్పగింత * ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇక్కడినుంచే ఇసుక సరఫరా విజయనగరం మున్సిపాలిటీ : ప్రభుత్వ నిధులతో చేపట్టే పనులకు ఇసుక కొరత లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు. పంచాయతీ కార్యదర్శులకే రీచ్‌లపై అజమాయిషీ ఇచ్చి అవసరమైన ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యా ప్తంగా 13 మండలాల్లోని 32 రీచ్‌లను వారికి అప్పగిస్తూ భూగర్భ జల శాఖ అధికారుల నుంచి జిల్లా పంచాయతీ కార్యాలయానికి ఉత్తర్వులు వచ్చాయి. ఈ రీచ్‌ల ద్వారా కేవలం ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో చేపట్టే పనులకు మా త్రమే ఇసుక సరఫరా చేయనున్నారు. అంతేగాకుండా ఆ గ్రామ పంచాయతీలో ఇళ్లు నిర్మించుకుంటే దానిని నిజ నిర్ధారణ చేసుకుని సరఫరా చేయాలి. ఇంజినీరింగ్ అధికారులు ముందుగా జాయింట్ కలెక్టర్‌కు ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమో దరఖాస్తు చేసుకోవాలి. జేసీ ఆమోదించాక భూగర్భ గనుల శాఖ అధికారికి పంపిస్తారు. అక్కడి నుంచి జిల్లా పంచాయతీ అధికారి ద్వారా కార్యదర్శులకు ఆదేశాలు జారీ అవుతాయి. క్యూబిట్ మీటర్‌కు రూ. 66లు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహించే ఇసుక రీచ్‌ల్లో ఇసుక ధర క్యూబిక్ మీటర్‌కు రూ. 66 గా నిర్ధారించినట్లు భూగర్బగనుల శాఖ ఏడీ మాధవరావు సాక్షికి తెలిపారు. జేసి అనుమతి ఇచ్చాక ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక కావాలో తెలుసుకుని తద్వారా వచ్చే మొత్తాన్ని కార్యదర్శి చలానా ద్వారా ప్రభుత్వానికి జమ చేస్తారు. దీని రవాణాకు కార్యదర్శే వే బిల్లు అందిస్తారు. కార్యదర్శులకు కేటాయించిన ఇసుక రీచ్‌లివే... బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, పారాది బిట్-3, పారాది బిట్-2, గుర్ల మండలంలోని గరికివలస, భూపాలపురం, కలవచర్ల, చింతలపేట, నడుపూరు గజపతినగరం మండలంలోని ఎం.ముగడాం-1, ఎం.ముగడాం-2, ఎం.ముగడాం-3 బలిజిపేట మండలంలోని పెద్దింపేట, అరసాడ, కొమరాడ మండలంలోని పూర్ణపాడు, కల్లికోట, దుగ్గి-2, దుగ్గి డెంకాడ మండలంలోని సింగవరం-2, సింగవరం-1 దత్తిరాజేరు మండలంలోని పెదకాద రామభద్రపురం మండలంలోని రొంపిల్లి, కొట్టక్కి, గొల్లపేట సీతానగరంలోని పనుకుపేట, పెదంకలాం, పెదభోగిలి మెంటాడ మండలంలోని మెంటాడ పాచిపెంట మండలంలోని కర్రివలస జియ్యమ్మవలస మండలంలోని బిట్రపాడు ఎస్‌కోట మండలంలోని చామలపల్లి -
సంతులిత వృద్ధే ప్రభుత్వ లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంతులిత వృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబుచెప్పారు. ప్రపంచ ఆర్ధిక వేదిక 46వ సదస్సుకు హాజరైన ఆయన గురువారం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ, ఆర్థికశాఖ కార్యదర్శులతో కలసి సీఐఐ ఇన్వెస్టర్స్ మీట్లో ప్రసంగించారు. అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ర్టం అద్భుతమైన వృద్ధి రేటుతో దూసుకుపోతోందని చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలపైనా ప్రధానంగా దృష్టిపెట్టామన్నారు. అభివృద్ధికి నిధులు సమస్య కాదని, సైబరాబాద్, హైదరాబాద్‌లను ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టకుండానే అభివృద్ధి చేశానని చెప్పారు. ఏపీలో అపార ఖనిజ సంపద, వ్యవసాయ ఉత్పత్తులు, సుదీర్ఘ తీరప్రాంతం, అన్నింటికీ మించి నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండటం పెట్టుబడిదారులకు కలిసోచ్చే అంశాలని వివరించారు.అనంతరం పారిశ్రామిక, రాజకీయ ప్రముఖులతో చంద్రబాబు 20కి పైగా సమావేశాలు నిర్వహించారు. రక్షణరంగ ఆయుధాల ఉత్పత్తిలో అతిపెద్దదైన లాక్‌హీడ్ మార్టిన్ కంపెనీ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపిన సీఎం రక్షణ పరికరాల తయారీకి ఏపీలో అనువుగా ఉన్న ప్రాంతాలు, వాటి ప్రత్యేకతలను వారికి వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన కంపెనీ సీఈవో మార్లిన్ హ్యూసన్ భారత్‌లో ప్లాంట్ నెలకొల్పేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎయిర్‌బస్ సీఈవోతో జరిపిన చర్చల్లో సీఎం రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగాలకు రాష్ట్రం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అనంతపురంలో విమానయాన రంగానికి మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఎం.ఆర్.ఒ. సెంటర్ స్థాపనకు పుట్టపర్తిని పరిశీలించాలని కోరారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించిన ఎయిర్‌బస్ సీఈవో ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తానని చెప్పారు. హీరో గ్రూప్ అధినేత పవన్ ముంజల్ సీఎంతో సమావేశమై ఏపీలో నెలకొల్పే తమ ప్లాంట్‌కు శంకుస్థాపన తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 24న సింగపూర్‌కు సీఎం బృందం సీఎం బృందం దావోస్ పర్యటన ముగించుకుని అక్కడి నుంచే ఈ నెల 24న సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది.ఈ పర్యటనకు అభ్యంతరం లేదని కేంద్ర విదేశీ మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. దీంతో చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేశ్, సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, సీఆర్డీఏ కార్యదర్శి అజయ్‌జైన్ సింగపూర్ పర్యటనకు సంబంధించి జీఏడీ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సింగపూర్‌లో బాబు రాజధాని మాస్టర్ డెవలపర్‌గా ఎంపిక చేయనున్న అసెండాస్ సెంబ్రిడ్జి అండ్ సెమ్బ్‌క్రాప్ కన్సార్టియం ప్రతినిధులతో పాటు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో చర్చించనున్నారు. -
కుదరదు గాక కుదరదు
జూన్ 1 తర్వాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి నో ♦ సచివాలయంతోసహా అన్ని శాఖలూ కొత్త రాజధానికే ♦ ఆలోగా అన్ని రికార్డులు ఇ-ఆఫీస్‌లో ఉంచాలి : సీఎం ఆదేశం ♦ సచివాలయ ఉద్యోగుల అసంతృప్తి.. హడావుడెందుకని ప్రశ్న సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూన్ 1వ తేదీ తరువాత హైదరాబాద్ నుంచి పనిచేయడానికి ఎవరినీ అనుమతించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇటీవల విజయవాడలో జరిగిన ఉన్నతాధికారులు, మంత్రుల సమావేశంలో సీఎం ఈ మేరకు ఆదేశాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోను జూన్ 1వ తేదీ తరువాత సచివాలయ శాఖలు, శాఖాధిపతుల కార్యాలయాలు హైదరాబాద్ నుంచి పనిచేయడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. జూన్ 1 నుంచి అన్ని ప్రభుత్వ శాఖలు, సచివాలయ శాఖలు నూతన రాజధాని నుంచే పనిచేయాలన్నారు. ఈ నేపథ్యంలో అన్నిరకాల రికార్డుల్ని ఇ-ఆఫీస్‌లో లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని, జూన్ 1 నాటికి ఇ-ఆఫీస్ పూర్తిస్థాయిలో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఎవరి మేలుకోసం ఈనిర్ణయమంటున్న ఉద్యోగులు.. సీఎం ఆదేశాలపై సచివాలయ ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం చేపట్టకుండా హడావిడిగా హైదరాబాద్ నుంచి ఆఫీసుల్ని, ఉద్యోగులను తరలించడమెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. అంతేగాక ఇ-ఆఫీసులోనే ఫైలును పంపించాలని నిర్ణయం తీసుకున్నందున ఎక్కడినుంచి పనిచేస్తే ఏమిటని అంటున్నారు. ఇ-ఆఫీస్ అమల్లోకి వచ్చినందున నూతన రాజధానిలో సచివాలయంతోపాటు ఇతర శాఖల కార్యాలయాల నిర్మాణం పూర్తయ్యేవరకు హైదరాబాద్‌లోనే ఉద్యోగులు పనిచేయడం వల్ల ప్రభుత్వ నిధులు ఆదా అవుతాయని పేర్కొంటున్నారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నందున హడావుడిగా హైదరాబాద్‌ను వీడివెళ్లాల్సిన అవసరం ఏముందని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భవనాల్ని అద్దెకు తీసుకుని, వారికి ఆర్థిక ప్రయోజనం కల్పించేందుకే ప్రభుత్వం తరలింపు హడావుడి చేస్తోందనే అభిప్రాయం అధికారవర్గాల్లో బలంగా వినిపిస్తోంది. లింగమనేని సంస్థకు చెందిన అతిథిగృహంలో ముఖ్యమంత్రి నివసిస్తున్నందున అందుకు ప్రతిగా అదే సంస్థకు చెందిన విల్లాల్ని, అపార్ట్మెంట్లను ఎక్కువ ధర అద్దె చెల్లించి మంత్రులు, ఉన్నతాధికారుల నివాసానికి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని సచివాలయ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాగా నూతన రాజధానికి ప్రభుత్వ కార్యాలయాల తరలింపునకు సంబంధించి అధికారుల కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దాని ఆధారంగా ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలోని మంత్రుల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇదిలా ఉండగా శనివారం సీఎం నిర్వహిస్తున్న ఉన్నతస్థాయి సమీక్ష సందర్భంగా ఉద్యోగులు, కార్యాలయాల తరలింపుపైనా చర్చించనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. -
ఎన్నికలకు ప్రభుత్వ నిధులు సరికాదు!
న్యూఢిల్లీ: ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం, ఇతర ఖర్చులకు ప్రభుత్వం నిధులు సమకూర్చాలనే యోచనను కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. ప్రభుత్వం ఇచ్చే నిధుల వ్యయంపై పర్యవేక్షణ సాధ్యమయ్యే పని కాదని ఈసీ వ్యాఖ్యానించింది. పార్టీలు, అభ్యర్థుల వ్యయం విషయంలో పారదర్శకత, జవాబుదారీ కోసం తగిన సంస్కరణలు తీసుకువచ్చే పక్షంలో ప్రచార వ్యయంకోసం రాయితీలు కల్పించవచ్చని ఈసీ అభిప్రాయపడింది. ఈనెల 30వ తేదీన వివిధ రాజకీయ పార్టీలతో ఇదే అంశంపై సమావేశం ఉన్న నేపథ్యంలో సోమవారం ఎన్నికల సంఘం సంప్రదింపుల ప్రక్రియ చేపట్టింది. ఎన్నికల ప్రచారం, ప్రసార మాధ్యమాల్లో ప్రకటనలు, బహిరంగ సభలకు పార్టీలు, అభ్యర్థులు భారీగా వ్యయం చేస్తున్నట్టు మీడియా వార్తలు పేర్కొంటున్న నేపథ్యంలో డబ్బు ప్రమేయం పెరగడం ఆందోళనకరమని పేర్కొంది. కార్పొరేట్ కంపెనీలు, సంపన్నులు ఆయా అభ్యర్థులకు నిధులు సమకూర్చడం ప్రజాస్వామ్య మౌలిక సూత్రాలకే విరుద్ధమని ఈసీ సంప్రదింపుల పత్రంలో అభిప్రాయపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 78 బీ ప్రకారం కేంద్రప్రభుత్వం అభ్యర్థులకు కొన్నిరకాల వస్తువులను సరఫరా చేయడానికి వీలుంటుందని, దీనినే కొంత విస్తృతపరచి అభ్యర్థులకు రాయితీకింద ఉచితంగా ప్రచార వేదికలు, ముద్రణ, ఉచిత తపాలా సౌకర్యాలు కల్పించవచ్చని ఈసీ సూచించింది. -
అటవీ అధికారుల చేతివాటం
పట్టుపడిన ట్రాక్టర్‌ను వినియోగించుకుంటున్న వైనం అట్లూరు: ఉన్నత అధికారుల పర్యవేక్షణ లోపించడంతో ఫారెస్టు అధికారులు చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ నిధులతో జేబులు నింపుకొంటున్నారు. లంకమల్లేశ్వర అభయారణ్యం కోడూరు బీట్‌లో గుర్రట్లబావి ప్రదేశంలో గతేడాది ఎర్రచందనం దుంగలతో సహా మేస్సే పర్‌గూషన్ 241 ట్రాక్టరును స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ట్రాక్టరుపై ఓఆర్ నంబరు 19113-14 కింద కేసు నమోదు చేసి సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో సీజ్ చేశారు. ఆ ట్రాక్టరుపై కేసు పూర్తి అయిన తరువాత ప్రభుత్వ అనుమతితో యాక్షన్ వేయాలి. అలాంటిది సిద్దవటం ఫారెస్టు అధికారులు సిద్దవటం, అట్లూరు మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో జంతువులకు తాగునీరు అదే ట్రాక్టరుకు ట్యాంకరు జోడించి తరలిస్తున్నారు. అదే ట్రాక్టరుకు ప్రైవేటు ట్యాంకరుతో నీటిని తరలించి డబ్బులు కాజేస్తున్నట్లు సమాచారం. కేసుల్లో పట్టుబడి సీజ్ చేసిన వాహనాలను వినియోగించ కూడదని చట్టం ఉన్నా అందుకు విరుద్ధంగా సిద్దవటం ఫారెస్టు అధికారులు వ్యవహరిస్తున్నారు. జేబులు నింపుకునేందుకు ఆ వాహనాలను వినియోగించడం సిద్దవటం ఫారెస్టు అధికారులకు మామూలయిందని విమర్శలున్నాయి. గతంలో కూడా పట్టపడ్డ బొలేరో వాహనాన్ని కూడా కలివికోడి పరిశోధకులకు అప్పగించారు. ఉన్నత అధికారులు సిద్దవటం అటవీ శాఖ అధికారుల అవినీతిపై విచారణ చేస్తే ఇంకా కొన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. -
‘ఆదర్శం’వైపు అడుగులు
సంసద్ ఆదర్శ యోజన పథకం కింద ఎంపికైన ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి గ్రామం ఆదర్శం వైపు అడుగులు వేస్తోంది. ఈ గ్రామాన్ని ప్రధానంగా పట్టి పీడిస్తున్న మద్యం మహమ్మారిని పారద్రోలే పనిలో పడ్డారు. ఇప్పటికే సారా తయారీకి స్వస్తి చెప్పిన గ్రామస్తులు, ఊర్లో ఉన్న రెండు బెల్టు దుకాణాలనూ మూసేశారు. ప్రభుత్వ నిధులు విడుదల చేసినంత మాత్రానే అభివృద్ధి సాధ్యం కాదని, చేయీ చేయీ కలిపితేనే అనుకున్న లక్ష్యాన్ని ఛేదించగలమనే భావనకు వచ్చి పారిశుధ్యం, అక్షరాస్యత, మద్యనిషేధం, తాగునీటి వసతి కార్యక్రమాల అమలుకోసం ఏకమై ముందుకు సాగుతున్నారు. వరంగల్ జిల్లా గంగదేవిపల్లి స్ఫూర్తిగా ఎనిమిది కమిటీలుగా ఏర్పడి ఆయా అంశాల అమలుకు కృషి చేస్తున్నారు. తన కోటా నిధులతో ఎంపీ బి.వినోద్‌కుమార్ పర్యవేక్షణ, కలెక్టర్ నీతూప్రసాద్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం కలిసి ఈ గ్రామ రూపురేఖలు మార్చే పనిలో పడ్డారు. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్ /ఎల్లారెడ్డిపేట -
రూపాయి తీస్కో.. పండగ చేస్కో!
* జెండావందన వేడుకల నిర్వహణ అయోమయం * అరకొర నిధులతో ఉపాధ్యాయుల అవస్థలు * స్వీట్ కోసం ప్రతీ విద్యార్థికి ఒక్క రూపాయే.. * ఏళ్లనాటి పాత టారిఫ్‌లే అమలవుతున్న వైనం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఇంద రూపాయి తీసుకో.. నోరు తీపి చేసుకొని పండగ చేసుకో పో’.. అంటోంది ప్రభుత్వం. ‘ఏంటీ రూపాయికి ఏం వస్తుంది, పీచు మిఠాయి కూడా రాదు.. అనుకుంటున్నారా? అది నిజమే కానీ, ప్రభుత్వం ఇంతే ఇస్తుంది మరి. వివరాలలోకి వెళ్తే గణతంత్ర, స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయా పాఠశాలల్లో, సంక్షేమ హాస్టళ్లలో విద్యార్ధులకు మిఠాయిలు పంచుతారు. హాస్టల్ విద్యార్థులకు ప్రతిరోజూ ఇచ్చే మెనూకు అదనంగా పండుగల రోజున మిఠాయి కూడా ఇస్తారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లు అన్ని కలుపుకొని 168 వరకు ఉన్నాయి. వీటిలో 16 వేల మంది వరకు విద్యార్థులు అభ్యసిస్తున్నారు. హాస్టళ్లలో ఉన్న వారికి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి ఇచ్చేది మాత్రం కేవలం రూ.1 మాత్రమే. దాదాపు 35 ఏళ్ల కిందట, అంటే ఒక్క రూపాయికి పావుకిలో నెయ్యి, పావుకిలో చెక్కర, ఇతర పదార్ధాలు వచ్చే సమయంలో తీసుకున్న నిర్ణయం అన్న మాట. తరాలు మారినా ఈ టారిఫ్ మాత్రం మారలేదు. ఇప్పుడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోయింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటాయి. రూపాయి పెడితే బజార్లలో సైకిల్ మీద అమ్మే పీచు మిఠాయి కూడా రావడం లేదు. కనీసం 20 గ్రాముల స్వీటు, 5 గ్రాముల కార తీసుకోవాలన్నా కనీసం రూ.10 ఖర్చు అవుతున్నాయి. ఈ లెక్కన ప్రతీ హాస్టల్లో రూ.1,500 వరకు, పాఠశాలలో రూ.4 నుంచి 6.వేల వరకు ఖర్చు అవుతుంది. ఇక పాఠశాలల్లోనైతే మిఠాయిల కోసం ప్రత్యేకంగా ఆ.. ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. జిల్లాలో చిన్న, పెద్ద స్కూళ్లు కలుపుకుని దాదాపు 1,568 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 3.23 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీళ్లకు కూడా జెండా వందనం రోజున స్వీట్ ఇస్తున్నారు, కానీ స్వీట్ కోసం ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో పాఠశాల గోడలకు సున్నం వేయడం కోసమో, రిపేర్ కోసమో ఇచ్చే స్కూల్ మెయింటనెన్స్ నుంచి గాని, స్టేషనరీ ఖర్చుల కోసం స్కూల్ గ్రాంటు నిధుల నుంచి గాని ఆయా పాఠశాలల హెచ్ఎంలు మిఠాయిల కోసం ఖర్చు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వమైనా బూజుపట్టిన పాత టారిఫ్‌ను తొలగించి.. కొత్త టారిఫ్‌ను అమల్లోకి తేవాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
నీళ్లు పోశామంటూ కోట్లు నొక్కేశారు
కంచే చేను మేసిందన్న సామెతను మన్యంలో ఉపాధి హామీ పథకం అధికారులు నిజం చేశారు. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని, మొక్కల పెంపకానికి ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఎంచక్కా నొక్కేశారు. ఇందుకోసం అన్ని స్థాయిల ఉద్యోగులూ కుమ్మక్కయ్యారు. పక్కాగా రికార్డులు చూపించారు. కోట్లు దిగమింగేశారు. ఏడు నెలల కాలంలో జరిగిన ఈ అవకతవకల విలువ ఐదారు కోట్లు పైనే ఉంటుందని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ పరిశీలనలో పలు ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగుచూశాయి. సాక్షి ప్రతినిధి, కాకినాడ :గిరి రైతులను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గత ఏడాది ఉపాధి హామీ పథకంలో జీడిమామిడి తోటల పెంపకం చేపట్టింది. దీనికింద రంపచోడవరం డివిజన్లో మొక్కల పెంపకం, పోషణ కోసం 2013 ఏప్రిల్ నుంచి గత అక్టోబర్ వరకూ రూ.18.16 కోట్లు విడుదల చేసింది. ఏజెన్సీలోని 11,302 మంది రైతులకు చెందిన 16,883 ఎకరాల్లో ఈ పథకం కింద జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరానికి రూ.10 వేలు చొప్పున నిధులు వచ్చాయి. పంపిణీ చేసిన మొక్కల పెంపకానికి ప్రతి నెలా రైతుల బ్యాంక్ ఖాతాల్లో మూడేళ్లపాటు సొమ్ము జమ చేయాలి. ఎకరానికి 70 మొక్కలు ఇచ్చారు. వాటిలో 40 మొక్కలు బతికితే కనుక నాటడం, గోతులు తియ్యడం, చుట్టూ గూడు కట్టడంవంటి పనుల కోసం నెలకు రూ.1050 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయాలి. అలాగే మొక్కలకు నీరు పోసేందుకు జనవరి నుంచి జూన్ వరకూ ఆరు నెలల కాలానికి ఎకరాకు రూ.6వేలు ఇవ్వాలి. ఇందుకోసం రూ.10.12 కోట్లు వచ్చాయి. ఈ నిధులు నొక్కేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్లు, ఏపీఓలు కుమ్మక్కయ్యారు. గత ఏడాది ఇచ్చిన మొక్కలకు నీరు పోయకుండానే పోసినట్టుగా పక్కా రికార్డులు తయారుచేసి విడుదలైన నిధుల్లో అందిన కాడికి దిగమింగేశారు. నీరు పోయని జీడిమామిడి తోటలకు సైతం గిరిజనులతో అవసరమైనచోటల్లా సంతకాలు పెట్టించుకొని సొమ్ములు నొక్కేశారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి విడుదలయ్యే నిధులను మొదట రైతుల ఖాతాలో జమ చేశారు. ఆనక ఆ సొమ్ములు డ్రా చేసి ‘మీకింత-మాకింత’ అనే ముందస్తు ఒప్పందం మేరకు పంపకాలు జరిపించేశారు. ఎకరం తోటకు ఉపాధి సిబ్బందికి రూ.4వేలు, రైతులకు రూ.2వేలు చొప్పున పంపకాలు చేపట్టారు. కొన్నిచోట్ల రెండెకరాల తోట ఉన్న రైతులతో జరిగిన ఒప్పందం ప్రకారం యంత్రాంగానికి రూ.6వేలు, రైతుకు రూ.6వేలుగా పంచేసుకున్నారు. మొత్తంగా లెక్కేస్తే అన్ని స్థాయిల సిబ్బంది కలిపి దాదాపు రూ.5 కోట్లు పైగానే భోంచేశారు. వై.రామవరం మండలం చామగెడ్డ పంచాయతీలో 200 ఎకరాల్లో జీడిమామిడి మొక్కలు నాటారు. వీటికి నీరు పోసేందుకు ఎకరాకు రూ.10 వేల చొప్పున రూ.20 లక్షలు మంజూరయ్యాయి. ఇక్కడ 100 ఎకరాల్లో కూడా నీరు పోయలేదని చెబుతున్నారు. మిగిలిన 100 ఎకరాలకు సంబంధించి విడుదలైన రూ.10 లక్షల్లో ఉపాధి అధికారులు, సిబ్బంది రూ.6 లక్షలు దిగమింగి, మిగిలిన రూ.4 లక్షలు రైతులు, బ్రోకర్లకు ముట్టజెప్పారని స్థానికులు ఆరోపిస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్ నుంచి ఏపీఓ, ఏపీడీ వరకూ కుమ్మక్కై ఒక్కో రైతు నుంచి ఆరేడు వేల వంతున నొక్కేశారు. చామగడ్డ, బండిగెడ్డ గ్రామాల్లో రైతుల నుంచి ఒక క్షేత్రస్థాయి ఉద్యోగి రూ.5 లక్షలు జేబులో వేసుకున్నాడు. అడ్డతీగల మండలం ఎల్లవరం, రంపచోడవరం మండలం రంప గ్రామాలను పరిశీలిస్తే.. ఒక్కో గ్రామంలో 10 మంది లబ్ధిదారులున్నారు. తమలో ఒక్కరికి కూడా సొమ్ములు అందలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డు కోసం అన్నట్టుగా కొందరి ఖాతాల్లో సొమ్ము వేసి చేతులు దులిపేసుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిన సొమ్ములో యంత్రాంగం చేతివాటం చూపించింది. పెదగెద్దాడలో 66 మంది రైతులకు 74 ఎకరాల్లో 5,180 జీడిమామిడి మొక్కలు ఇచ్చారు. వీటికి నీరు పోసేందుకు చిల్లిగవ్వ కూడా అందలేదని ఆయా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, అరా గ్రామాల్లో జరిగిన అన్యాయాన్ని నాయకుల దృష్టికి తీసుకువెళ్లగా, వారికి డబ్బులు తిరిగి ఇచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏపీఓ స్థాయిలో ఐదుగురు కీలకపాత్ర పోషించారని తెలియవచ్చింది. ఇదే విషయాన్ని వారు అంగీకరించి, రైతులకు తిరిగి సొమ్ములు ఇచ్చేశారని విశ్వసనీయవర్గాల సమాచారం. ఉపాధి హామీ నుంచి విడుదలయ్యే సొమ్ము కొన్ని పంచాయతీల్లో విలేజ్ ఆర్గనైజేషన్, కొన్ని గ్రామాల్లో రైతుల ఖాతాలకే జమ అయ్యేవి. ఆర్గనైజేషన్‌లో ఉన్న డ్వాక్రా గ్రూపు మహిళా ప్రతినిధుల చేతికి ఆ సొమ్మంతా చేరేది. అలా వారు డ్రా చేసి రైతులందరికీ అందజేసే పరిస్థితులను చాకచక్యంగా వినియోగించుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు కాజేశారు. నిబంధనల ప్రకారం నీరు పోసి ఉంటే ఏ ప్రతి నెలా సొమ్ము విడుదల చేయాలి. రైతులు ఎప్పటికప్పుడు కూలీలకు సొమ్ములివ్వాలి. ఇవ్వకపోతే రెండో రోజే వారు పనిలోకి రారు. ఫండ్ ట్రాన్సఫర్ ఆర్డర్(ఎఫ్టఓ)లో ఏ రైతుకు ఎంత అనే వివరాలుంటాయి. దాని ప్రకారం పే స్లిప్పులు ఇచ్చి, వాటి ద్వారానే సొమ్ము అందజేసే క్రమంలోనే ఈ అవినీతికి పాల్పడ్డారని చెబుతున్నారు. -
కోట్ల నిధులు ఏట్లో !
మణుగూరు : ప్రభుత్వ నిధులు ‘నీళ్ల’ పాలు అన్న చందంగా ఉంది అధికారుల పనితీరు. కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలకు ఎక్కడా స్థలం దొరకలేదన్నట్లుగా వాగులో నిర్మిస్తున్నారు. దీంతో వాగులు నిండితే ఆ భవనాలు కూడా మునుగుతాయని, అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేస్తున్న ఈ నిధులు ఏట్లో పోసినట్టేనని అంటున్నారు. ఇలాంటి నిర్మాణాలతో కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతారే తప్ప ప్రజలకు మాత్రం ఉపయోగం లేదని ఆరోపిస్తున్నారు. పినపాక నియోజకవర్గ కేంద్రమైన మణుగూరు మండల కేంద్రంలో అన్ని రకాల హాస్టళ్లు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉన్నత చదువులు అందించే లక్ష్యంతో భవననాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.కోటి నిధులు కేటాయించింది. అయితే వచ్చిన నిధులను ఖర్చు చేయాలే తప్ప, వాటిని ఎలా సద్వినియోగం చేయాలనే ఆలోచన అధికారులకు లేకుండా పోయింది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ మణుగూరు మండలంలో ఐటీడీఏ సహకారంతో నిర్మిస్తున్న ఎస్ఎంఎస్ హస్టల్ భవ నమే. మండలంలోని సమితిసింగారం కోడిపుంజుల వాగులో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ రూ.50 లక్షలతో మరో హాస్టల్ భవనాన్ని నిర్మించారు. అయితే వర్షాలు వస్తే వాగు పొంగితే ఈ భవనాలు ఎందుకూ పనికి రావని స్థానికులు అంటున్నారు. వాగును ఎటూ డైవర్షన్ చేయలేదని, నీరొస్తే మునిగే ఈ భవనాలలో విద్యార్థులు ఎలా ఉంటారని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. కబ్జాదారులకు, ప్రైవేటు వ్యాపారులకు మంచి స్థలాలను చూపించే రెవెన్యూ అధికారులు ప్రభుత భవనాలకు మాత్రం స్థలం లేదంటూ ఇలా వాగులు వంకలు చూపించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపున మణుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనానికి ఐదేళ్లుగా స్థలం చూపించకపోవడంతో నిధులు వృథాగా పోవద్దనే ఉద్దేశంతో జూనియర్ కళాశాల ఆవరణలోనే దీన్ని కూడా నిర్మించారు. విద్యాలయాలకు సంబంధించిన భవనాల కే ఇలా ఆటంకాలు కల్పిస్తుంటే.. మారుమూల ప్రాంతాలలో విద్యాభివృద్ధి ఎలా సాధ్యమో ఉన్నతాధికారులే ఆలోచించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
స్టౌలు సరే... గ్యాస్ కనెక్షన్లేవీ ?
- పొగచూరుతున్న అంగన్వాడీ కేంద్రాలు - సక్రమంగా అమలుకాని 'అమృతహస్తం' పథకం చిత్తూరు(టౌన్): జిల్లాలో అమలవుతున్న 'అమృతహస్తం' పథకం పొగచూరుతోంది. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా అంగన్వాడీలకు ఇంతవరకు గ్యాస్ కనెక్షన్లు అందలేదు. ఈ పథకం అమలవుతున్న అన్ని కేంద్రాల్లో కట్టెల పొయ్యిలపైనే ఆధారపడి వంట చేస్తున్నారు. కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో అంగన్వాడీ కేం ద్రాలు మసిబారుతున్నాయి. గర్భిణు లు, బాలింతల సంక్షేమం కోసం కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2013 నుంచి 'అమృతహస్తం' అనే పథకాన్ని రెండు విడతలుగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2,629 అంగన్వాడీల్లో ఈ పథకం అమలవుతోంది. గ్రామాల్లో గర్భిణులు, బాలిం తలను గుర్తించి వారికి అంగన్వాడీల నుంచి పౌష్టికాహారాన్ని అందించడమే ఈ పథక ఉద్దేశం. లబ్ధిదారులకు నెలలో 16 కోడిగుడ్లు, రోజూ మధ్యాహ్నం పూట 200 గ్రాముల పాలు, కూరగాయలు, ఆకు కూరలు, పప్పు తో భోజనం అందిస్తారు. భోజనాన్ని లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాలకే వచ్చి తినేసి వెళ్లాలి. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 30, 344 మంది లబ్ధిదారులు ఉన్నారు. లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అక్కడికక్కడే వండి అందించాలనే ప్రభుత్వ నిబంధన ఉన్నా ఒక్క కేంద్రానికి కూడా గ్యాస్ కనెక్షన్ లేదు. ఒకవేళ ఉన్నా అది సంబంధిత అంగన్వాడీ హెల్పర్ ఇంటి వద్ద నుంచో, వారి సొంత డబ్బులతోనో తెచ్చుకున్నదే. రెండేళ్లకు ముందే 1,100 గ్యాస్ స్టౌలను ఐసీడీఎస్ అధికారులు టెండర్ల ద్వారా కొనుగోలు చేశారు. గ్యాస్ కనెక్షన్ల మంజూరు గురించి మాత్రం పట్టించుకోలేదు. నెల రోజుల కిందట అన్ని కేంద్రాలకు ఒక్కో కనెక్షన్‌కు రూ. 5 వేలు చొప్పున చెక్కులను అందజేశారు. అయితే ఇది కార్యరూపం దాల్చడంలో ఆలస్యమవుతోంది. ఆధిపత్యపోరు లబ్ధిదారుల పౌష్టికాహారానికి అయ్యే ఖర్చులను ప్రభుత్వం వీవో (గ్రామసమాఖ్యలు)ల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. అయితే తాము ఖర్చుపెట్టి పౌష్టికాహారాన్ని అందిస్తుంటే వీవోల ఖాతాల్లోకి జమచేయడం ఏంటంటూ అంగన్వాడీ వర్కర్లు,హెల్పర్లు వాది స్తున్నారు. ప్రభుత్వ నిబందనల ప్రకా రం వంటవండి వడ్డించడం హెల్పర్ల వంతయితే, వండడానికి అవసరమైన వస్తువులు వీవోలే కొనివ్వాలి. అందు కు వారి ఖాతాల్లోకే డబ్బులు పడుతున్నాయి. కానీ పలుచోట్ల అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఖర్చుపెట్టి వండిన తర్వాత వడ్డించే సమయంలో వీవోలు ప్రత్యక్షమై పెత్తనం చెలాయిస్తున్నారు. దీన్ని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషయంగా ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో విభేధాలు ఉన్నాయి. దీని ప్రభావం పథకంపై పడుతోంది. లబ్ధిదారులకు పాలు, ఆకుకూరలు, కూరగాయలు లే ని చప్పిడి భోజనం అందుతోంది. ని ధులు ఖర్చయిపోతున్నారుు. ప్రభుత్వ ఆశయం మాత్రం నీరుగారిపోతోంది. సేఫ్టీ మెజర్స్ తర్వాత వాడకం అమృతహస్తం అమలయ్యే అన్ని కేంద్రాలకు గ్యాస్ కనెక్షన్ల కోసం చెక్కులిచ్చాం. కొన్నింటికి కనెక్షన్లు వచ్చాయి. చాలావాటికి గ్యాస్ కంపెనీల నుంచి అనుమతులు రావడంలో ఆలస్యమవుతోంది. మంజూరైన వాటికి సేఫ్టీ మెజర్స్పై శిక్షణ ఇచ్చిన తర్వాత వాడకాన్ని చేపడతారు. అంతవరకు కొంత ఇబ్బంది తప్పదు. -
కట్టాల్సిందే!
పొద్దుటూరు: స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రుణాల మాఫీ జాప్యం కావడంతో ఓ వైపు బ్యాంకర్లు, మరో వైపు సంబంధిత అధికారులు పొదుపు సంఘాల వారిపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం రుణాలు చెల్లిస్తుందో లేదో తమకు సంబంధం లేదని బకాయిలు చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు. మరికొందరు అధికారులు ఇంకా ముందుకెళ్లి రాజధాని నిర్మాణానికే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, అలాంటప్పుడు మీ బకాయిలు చెల్లిస్తారన్న గ్యారంటీ ఏముందని పొదుపు సంఘాల వారిని నయానా భయానా హెచ్చరిస్తున్నారు. బకాయిలు చెల్లించకపోతే మీ సంఘాలు మనుగడలో లేనట్లేనని చెబుతున్నారు. దీంతో పొదుపు సంఘాలకు చెందిన మహిళలు అధికారుల ఒత్తిడి భరించలేక బకాయిలు చెల్లిస్తున్నారు. కొన్ని సంఘాల వారు బకాయిలు చెల్లించలేదని బ్యాంకర్లు ఏకంగా ఆ సంఘాలకు సంబంధించిన సేవింగ్స్ ఖాతాలోని డబ్బును జమ చేసుకుంటున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పట్టణ పేదల నిర్మూలన పథకం (మెప్మా) పరిధిలో 2300 పొదుపు సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.22 కోట్లు, 2014-15 సంవత్సరంలో రూ.20 కోట్లు బ్యాంక్ లింకేజి కింద మహిళలు రుణాలు తీసుకున్నారు. పట్టణ పరిధిలోని 16 బ్యాంక్‌ల నుంచి వీరు రుణాలు పొందారు. కాగా ఎన్నికల హామీల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి నెల నుంచి మహిళలు రుణాలు చెల్లించడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కోసం మహిళలంతా ఎదురు చూశారు. ప్రమాణ స్వీకారం రోజున రుణ మాఫీ సంతకం పెడతారని భావించారు. ఇందులో భాగంగా ఈనెల 8వ తేదీన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే పొదుపు సంఘాల రుణాల మాఫీపై సంతకం చేసినా స్పష్టత లేదు. ఎప్పటి నుంచి రుణ మాఫీ అమలవుతుంది, ఎంత రుణం మాఫీ అవుతుంది తదితర విషయాలు తేలాల్సి ఉంది. ఈ విషయంపై కమిటీ వేయడంతో ఇప్పుడే రుణాల మాఫీ అమలు కాదని స్పష్టమైంది. ఇదిలావుండగా తీసుకున్న రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. ‘నిబంధనల ప్రకారం 3 నెలలలోగా తీసుకున్న రుణం చెల్లించకపోతే మీ సంఘం నాన్ పర్ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్పీఏ) కిందికి వెళుతుందని, అలా వెళితే మీ సంఘం నష్టపోతుందని’ చెబుతున్నారు. అలాగే రుణాల మాఫీ తేలకపోవడంతో బ్యాంకర్లు కూడా రుణాలు మంజూరు చేయడం లేదు. కాగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని సంబంధిత అధికారులు కూడా పొదుపు సంఘాలపై బకాయిలు చెల్లించాలని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రికవరి 98 శాతం ఉండటంతో గత మూడేళ్లుగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బ్యాంకర్లు, ఉన్నతాధికారుల సూచన మేరకు స్థానిక అధికారులు రుణాలు చెల్లించాలని మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే పలు సంఘాలకు సంబంధించి సేవింగ్స్ ఖాతాలోని సొమ్మును బకాయిల కింద జమ చేసుకున్నారు. సంఘాలు ఎన్పీఏ పరిధిలోకి వెళతాయి తీసుకున్న రుణాన్ని మూడు నెలలలోపు చెల్లించకపోతే సంఘాలు నాన్ ఫర్ఫార్మెన్స్ అకౌంట్ పరిధిలోకి వెళతాయి. దీని వలన ఆ సంఘానికి ఇచ్చే రుణం కూడా తగ్గుతుంది. బకాయిలు చెల్లించాలని సంఘాలకు చెప్పిన మాట వాస్తవమే. - కెజియా జాస్లిన్, పావర్టి రీసోర్స్ పర్సన్ రుణం చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారు తీసుకున్న రుణం చెల్లించమని అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. మాఫీ అవుతుందో లేదో అన్న అనుమానాన్ని అధికారులు వ్యక్తపరుస్తున్నారు. దీంతో రుణం చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. - నాగసుబ్బమ్మ, వీరభద్ర స్వయం సహాయక సంఘం లీడర్ అందరికీ చెప్పారు ఇటీవల స్వయం సహాయక సంఘాల సమావేశంలో అధికారులు బకాయిలు చెల్లించాలని అందరికీ చెప్పారు. అలా చెల్లిస్తేనే రుణాలు ఇస్తారని చెబుతున్నారు. దీంతో రుణం చెల్లించాల్సి వస్తోంది. - జే.వెంకటలక్షుమ్మ, నరసింహ స్వయం సహాయక సంఘం -
నీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళిక
సంగారెడ్డి డివిజన్, న్యూస్‌లైన్: వచ్చే వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ ముందస్తు చర్యలు చేపట్టింది. మంచినీటి కొరత ఎదుర్కొనే గ్రామాలను గుర్తించడంతోపాటు నీటి సరఫరా చేసేందుకు ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించింది. ఈ మేరకు రూ.4.45 కోట్లతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేసింది. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అందజేసిన ప్రణాళికను పరిశీలించి త్వరలో సర్కార్ నిధులు విడుదల చేయనుంది. వచ్చేనెల మొదటి వారం నుంచి ఈ ప్రణాళిక అమలు దిశగా జిల్లా అధికారులు సన్నద్ధమవుతున్నారు. వచ్చే వేసవిలో 41 మండలాల్లోని 903 గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తవచ్చని అధికారులు గుర్తించారు. కౌడిపల్లి మండలంలో అత్యధికంగా 55 గ్రామాలు, నారాయణఖేడ్ మండలంలో 55, సిద్దిపేట, తూప్రాన్ మండలాల్లో 50 గ్రామాల చొప్పున, చిన్నకోడూరు మండలంలో 42, కొల్చారం, నర్సాపూర్ మండలాల్లో 41 చొప్పున, జగదేవ్‌పూర్‌లో 40 గ్రామాలను ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది గుర్తించింది. గత నెల జనవరిలో సిబ్బంది సర్వే చేసి వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాలను గుర్తించారు. సర్వే నివేదికను అనుసరించి అధికారులు రూ.4.45 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. రూ.1.60 కోట్లతో నీటి రవాణా ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి రాబోయే వేసవిలో రూ.4.45 కోట్ల వ్యయంతో 12,447 పనులు చేపట్టాలని ప్రతిపాదించారు. అందులో భాగంగా రూ.1.60 కోట్లతో గ్రామాల్లో తాగునీటి రవాణా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే 343 పంచాయతీల్లో రూ.74.2 లక్షలతో 457 బోరుబావులను అద్దెకు తీసుకోవాలని ప్రతిపాదించారు. రూ.90.74 లక్షలతో 960 బోరు బావులు ఫ్లష్షింగ్ చేయాలని, రూ.79.62 లక్షలతో 873 బోరుబావులను డీపెనింగ్ (మరింత లోతుకు) చేయనున్నారు. అలాగే రూ.40.5 లక్షలతో 31 ఓపెన్ వెల్స్‌ను డీపెనింగ్ చేయాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు. -
‘అద్దె’ పంచాయతీలు
ఒంగోలు, న్యూస్‌లైన్: సొంత భవనాలు లేకపోవడంతో పంచాయతీలకు అద్దెల భారం తప్పడం లేదు. గ్రామ పంచాయతీలకు సొంత భవనాలుండాలని ప్రభుత్వం నిధులు విడుదల చేసి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇప్పటి వరకు చాలాచోట్ల నేటికీ నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు. పంచాయతీ భవనాల పరిస్థితిపై ‘న్యూస్‌లైన్’ జిల్లా వ్యాప్తంగా బుధవారం పరిశీలించింది. ఈ పరిశీలనలో అనేక సమస్యలు బహిర్గతమయ్యాయి. పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో స్థల సేకరణ పెద్ద సమస్యగా మారడం, రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో లక్ష్యం నెరవేరలేదు. భారత్ నిర్మాణ్ రాజీవ్ గాంధీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పంచాయతీలకు కార్యాలయ భవనాలు నిర్మించడంతో పాటు ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న పేదలకు పనిదినాలు కల్పించాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. ఆమేరకు ఒక్కో పంచాయతీ భవనానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసింది. 2012 మే 4వ తేదీలోపు వీటి నిర్మాణాలను పూర్తి చేయాలి. నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో నిధులు మంజూరు చేసి ఏళ్లు గడుస్తున్నా పనులు చేపట్టలేదు. 357 పంచాయతీ భవనాలకు రూ. 35.70 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 97 భవనాలు మాత్రమే పూర్తికాగా..అసలు పనులు మొదలు పెట్టనివి 181 ఉన్నాయి. మిగిలినవి వివిధ దశల్లో పనులు నిలిచిపోయాయి. దీంతో సర్పంచ్ల గృహాలే కార్యాలయాలుగా మారాయి. నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేసిన కాంటాక్టర్లపై ప్రభుత్వం కొరడా ఝుళిపించకపోవడం కూడా మరో కారణం. తాజాగా ఈ పథకం పేరును రాజీవ్‌గాంధీ పంచాయత్ శక్తికారణ్ అభియాన్‌గా మార్చారు. దీని ప్రకారం సొంత భవనాలు లేని పంచాయతీల జాబితా పంపాలని ఇటీవల పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ అధికారులను ఆదేశించారు. అయితే ఈ పథకం కింద గతంలో మంజూరై ఇంత వరకు నిర్మాణాలు ప్రారంభం కాని వాటిని చూపించవచ్చా.. నిధుల కొరతతో ఆగిన వాటిని పేర్కొనవచ్చా అనే సమస్య ప్రస్తుతం పంచాయతీ అధికారులను పట్టి పీడిస్తోంది.