సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ నిధులను పద్ధతిగా ఖర్చు చేయాలని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పథకాల అమలులో అనర్హులకు ఒక్క రూపాయి కూడా వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖలపై మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం లో మంత్రి ఈటల శుక్రవారం విస్తృత స్థాయి సమీక్ష జరిపారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమా సికంలో వ్యవసాయానికి ఎక్కువ ఖర్చు చేసినం. రాష్టాన్ని అగ్రభాగాన నిలిపినందుకు అందరికీ అభినందనలు. ప్రజలు కడుతున్న పన్నులను ఖర్చు పెడుతున్నాం. అనర్హులకు వెళ్లకుండా చూడండి.
మీకు అన్ని రకాల అధికారాలు ఇస్తున్నాం. ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత తప్పు జరిగితే ఎలా? స్థానిక సంస్థలపై ఆడిట్ చేస్తున్నారుగానీ ఎందుకు రికవరీ జరగడం లేదు’ అని మంత్రి ప్రశ్నించారు. రికవరీ చేసే అధికారం తమకు లేదని అధికారులు చెప్పడంతో... అవసరమైతే నిబంధనలు మార్చాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావును మంత్రి ఈటల ఆదేశించారు. ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రామపంచాయతీలలో కుంభ కోణాలను గుర్తించాం. నిధులు దుర్వినియోగం చేసిన వారిని ఉపేక్షించేది లేదు. ఎవరు తప్పు చేసినా ప్రభుత్వం నుంచి తప్పించుకోలేరనే భావన తీసుకురావాలి. ట్రెజరీ శాఖలో ఈ–కుబేర్ సాఫ్ట్‌వేర్ తీసుకువచ్చాం. దీనివల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేశాం.
త్వరలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సైతం ఈ–కుబేర్ ద్వారా అందించనున్నాం. పింఛను విధానంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చినం. రిటైర్డ్ అయిన వ్యక్తి చనిపోయిన తర్వాత వారి నామినీలకు అందిస్తారు. అయితే 50 ఏళ్లుగా పొందుతున్నవారి నామినీలూ ఉన్నారు. మరోవైపు 315 జీవో ప్రకారం మూడోతరం వారూ పొందుతున్నా రు. ఈ ఉత్తర్వులపై అధికారులు పునఃసమీక్ష చేసి నివేదిక ఇస్తే సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కాగ్ మన శాఖలపై ఆడిట్ చేస్తోంది. ప్రణాళిక శాఖ నుంచి వేరే శాఖకు డిప్యూటేషన్‌పై వెళ్లిన వారందరినీ వెనక్కి తీసుకువచ్చేందుకు ఓ నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్ర రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ప్లానింగ్ శాఖ సమన్వయంతో పనిచేయాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment